Arakuloya : బొర్రా గుహలకు ముప్పు!
ABN , Publish Date - Jul 12 , 2024 | 05:40 AM
సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు.. కొత్తవలస-కిరండోల్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులతో ముప్పు వాటిల్లేలా ఉంది. రెండో ట్రాక్‌ను బొర్రా గుహలపై నుంచి నిర్మిస్తే గుహలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
వాటిపై నుంచే రెండో ట్రాక్ నిర్మాణం
పట్టించుకోని పర్యాటక శాఖ అధికారులు
అరకులోయ, జూలై 11: సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు.. కొత్తవలస-కిరండోల్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులతో ముప్పు వాటిల్లేలా ఉంది. రెండో ట్రాక్‌ను బొర్రా గుహలపై నుంచి నిర్మిస్తే గుహలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
ఇప్పటికే జంబో ట్రైన్‌లు రాకపోకలు సాగించే సమయాల్లో బొర్రా గుహలలో మట్టిపెళ్లలు, రాళ్లు విరిగి పడుతున్నాయి. కేకే(కొత్తవలస-కిరండోల్) లైన్‌లో ప్రస్తుతం డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. కొరాపుట్ నుంచి సిమిలిగుడ వరకూ పనులు పూర్తవగా, సిమిలిగుడ నుంచి బొడ్డవర వరకూ పనులు జరుగుతున్నాయి.
కరకవలస-బొర్రా మధ్య నాలుగు టన్నెల్స్ నిర్మించాల్సి ఉండగా రెండు పూర్తయ్యాయి. ప్రస్తుతం బొర్రా రైల్వేస్టేషన్ సమీపంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఉన్న రైల్వే ట్రాక్ బొర్రా గుహలపైనే ఉంది. గత రెండేళ్ల నుంచి ఆ ట్రాక్ పైనుంచి జంబో రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో గుహల్లోని మట్టిపెళ్లలు, రాళ్లు జారి పడుతున్నాయి. రెండో ట్రాక్ కూడా గుహలపై నుంచి నిర్మిస్తే వాటి ఉనికే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. బొర్రా గుహలపైనుంచి రెండో ట్రాక్ నిర్మాణం చేపట్టడంపై గిరిజనులు మండిపడుతున్నారు. అలైన్‌మెంట్ మార్చాలని, రెండో ట్రాక్‌ను గుహలపై నుంచి కాకుండా వేరొక మార్గంలో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏటా ఆరు లక్షల మంది సందర్శకులు..
ఏటా దేశవిదేశాల నుంచి 6లక్షల మందికిపైగా పర్యాటకులు బొర్రాగుహలను సందర్శిస్తున్నారు. టికెట్ల రూపంలోనే పర్యాటక శాఖకు ఐదారు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ట్యాక్సీలు, ఆటోలు, వ్యాన్ల వాహనదారులు, హోటళ్ల ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు.
బొర్రాగుహలను జాతిసంపదగా గుర్తించి, ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఎన్నికల ముందు కేంద్రం స్వదేశీ దర్శన్‌లో భాగంగా రూ.29కోట్లతో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరుచేసింది. స్వదేశీ దర్శన్‌ను వర్చువల్‌గా ప్రధానిమోదీ ప్రారంభించారు.
గుహలకు ఇబ్బంది ఉండదు: రైల్వేశాఖ
రెండో ట్రాక్‌ను గుహలపై నుంచి నిర్మిస్తున్న విషయాన్ని పర్యాటక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గుహల్లో పనిచేసేవారు చెబుతున్నారు. ట్రాక్‌ను వేరే మార్గంలో నిర్మించేలా చూడాలని బొర్రా గైడ్స్ యూనియన్ కోరుతోంది.
వైసీపీ ప్రభుత్వంలో అప్పటి పర్యాటక మంత్రి రోజా బొర్రా గుహలను అసలు సందర్శించలేదు. ఆ శాఖ అధికారులూ పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వమైనా జోక్యం చేసుకోని ట్రాక్ అలైన్‌మెంట్ మార్చేలా చూడాలని ప్రజాప్రతినిధులు, గైడ్స్ యూనియన్ ప్రతినిధులు, బొర్రాగుహల సిబ్బంది కోరుతున్నారు. రైల్వే అధికారులను దీనిపై ప్రశ్నించగా.. ఆ లైన్ వల్ల బొర్రా గుహలకు ఎలాంటి ఇబ్బందీ ఉండబోదన్నారు. అక్కడ అలైన్‌మెంట్ మార్చేందుకు అవకాశం కూడా లేదన్నారు.