Share News

Wayanad Landslide: పరిమళించిన మానవత్వం.. వయనాడ్ బాధితులకు భారీగా విరాళాలు

ABN , Publish Date - Jul 31 , 2024 | 09:16 PM

సమాజంలో జరుగుతున్న నేరాలను చూస్తుంటే మనుషుల్లో మానవత్వం ఉందా అనే భావన కలగక మానదు. అలాంటప్పుడే మానవత్వం పరిమళించే ఘటనలు సాక్షాత్కరిస్తుంటాయి. కేరళ విషయంలో అచ్చం ఇలాంటిదే జరుగుతోంది.

Wayanad Landslide: పరిమళించిన మానవత్వం.. వయనాడ్ బాధితులకు భారీగా విరాళాలు

వయనాడ్: సమాజంలో జరుగుతున్న నేరాలను చూస్తుంటే మనుషుల్లో మానవత్వం ఉందా అనే భావన కలగక మానదు. అలాంటప్పుడే మానవత్వం పరిమళించే ఘటనలు సాక్షాత్కరిస్తుంటాయి. కేరళ విషయంలో అచ్చం ఇలాంటిదే జరుగుతోంది. భారీ వర్షాలు, వరదలతో వయనాడ్ అల్లాడిపోయిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడి ఇప్పటికే 185 మందికిపైగా మరణించగా.. 200లకుపైగా వ్యక్తుల ఆచూకీ గల్లంతైంది. బాధితుల సంఖ్య వందల్లో ఉండటంతో బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి.

అయితే బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం కేరళ సీఎం సహాయనిధికి ప్రభుత్వం తరఫున రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. వయనాడ్ విషాదంపై అదానీ గ్రూప్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.


ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సానుభూతి ప్రకటించారు. అదానీ గ్రూప్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. తమ కంపెనీ తరఫున రూ.5 కోట్ల సాయాన్ని సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్పీ గ్రూప్‌ రవి పిళ్లై, లులు ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ, కల్యాణ్‌ జువెలర్స్‌ ఛైర్మన్‌ కల్యాణరామన్‌లు కూడా ఒక్కొక్కరు రూ.5కోట్ల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించారు. వయనాడ్‌ ఘటనపై నటుడు విక్రమ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.20 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇంకోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వయనాడ్‌ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆత్మీయులను కోల్పోయిన బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మృతులకు సంతాపంగా కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్‌లు ఇతర కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు సినిమా బృందాలు ప్రకటించాయి.


ప్రముఖ దాతలు...

కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్‌ప్రైజెస్ సహాయనిధికి రూ.5 కోట్లు, కెనరా బ్యాంక్ కూడా సీఎండీఆర్‌ఎఫ్‌కు రూ.5 కోట్లు ఇచ్చింది. కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ (KMML) రూ. 50 లక్షలు, కేరళ స్టేట్ ఉమెన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ. 30 లక్షలు, నటుడు విక్రమ్ రూ. 20 లక్షలు, దలైలామా ట్రస్ట్ రూ. 11 లక్షలు, శోభనా జార్జ్, చైర్‌పర్సన్, ఔషధి (ఆయుర్వేద ఔషధాల తయారీదారు) రూ. 10 లక్షల చొప్పున విరాళాలు అందించాయి.


శవాలదిబ్బగా గ్రామం..

కేరళవ్యాప్తంగా గత 5 రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వయనాడ్‌ ప్రాంతానికి.. ముఖ్యంగా చాలియార్‌ నదికి వరద ఉద్ధృతి పెరిగింది. సోమవారం అర్ధరాత్రి 1.30 సమయంలో వరద బీభత్సానికి కొండ చరియలు విరిగిపడ్డాయి.

ముండక్కై గ్రామాన్ని తుడిచిపెట్టేశాయి. ఆ గ్రామంలో 65 కుటుంబాలు నివసిస్తుండగా.. ఆ ఇళ్లలో నివసిస్తున్న వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో గ్రామస్థులు ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. మట్టి దిబ్బల కింద కూరుకుపోయిన మృతదేహాలను గుర్తించడంలో అధికారులకు సవాళ్లు ఎదురవుతున్నాయి.

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 09:16 PM