Rahul Gandhi: హత్రాస్ పై రాజకీయం చేయను
ABN , Publish Date - Jul 06 , 2024 | 03:13 AM
హత్రాస్ తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయాలని తాను భావించటంలేదని, అయితే, ఈ విషాదం వెనుక ప్రభుత్వ యంత్రాంగ పరంగా పలు లోపాలున్నాయని కాంగ్రెస్ అగ్ర నాయకుడు....
బాధితులకు వీలైనంత అధికంగా, త్వరగా పరిహారం అందించాలి
యూపీ ప్రభుత్వానికి రాహుల్ విజ్ఞప్తి
బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నేత
హత్రాస్, జూలై5: హత్రాస్ తొక్కిసలాట ఘటనను రాజకీయం చేయాలని తాను భావించటంలేదని, అయితే, ఈ విషాదం వెనుక ప్రభుత్వ యంత్రాంగ పరంగా పలు లోపాలున్నాయని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు వీలైనంత ఎక్కువగా, త్వరగా పరిహారం అందించాలని యూపీ ప్రభుత్వాన్ని కోరారు. హత్రాస్ బాధితులను రాహుల్ శుక్రవారం పరామర్శించారు.
వేకువజామునే ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్, హత్రా్సల పరిధిలోని బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, పలువురు బాధితులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని.. పోలీసులు, అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే తొక్కిసలాట జరిగిందని వారు చెప్పారని తెలిపారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు నిరుపేదలని, వారికి వీలైనంత అధికంగా పరిహారం అందించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని రాహుల్ పేర్కొన్నారు.
ఇచ్చే పరిహారం కూడా ఆర్నెళ్ల తర్వాతో, ఏడాది తర్వాతో కాకుండా త్వరగా అందిస్తే బాధితులకు సహాయం చేసినట్లవుతుందన్నారు. కాగా ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని యూపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రాహుల్ పర్యటన నేపథ్యంలో స్థానికంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. హత్రాస్ ఘటనను పార్లమెంటులో లేవనెత్తుతానని, పరిహారం త్వరగా అందేలా కృషి చేస్తానని రాహుల్ తమకు హామీ ఇచ్చారని బాధితులు పేర్కొన్నారు.