Rahul Gandhi : మోదీ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 19 , 2024 | 06:15 AM
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి చాలా బలహీనంగా ఉందని, చిన్నపాటి సమస్య తలెత్తినా పడిపోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. కూటమి నుంచి ఏ ఒక్క పార్టీ బయటకొచ్చినా గందరగోళం మొదలవుతుందన్నారు.
నీట్‌లో వ్యవస్థీకృత అవినీతిని రుజువు చేస్తున్న అరెస్టులు
అయినా ఎప్పటిలానే మోదీ మౌనం: రాహుల్
ఎప్పుడైనా కూలొచ్చు!
చాలా బలహీనంగా ఎన్డీఏ సర్కారు
మాతో ఎన్డీఏ నేతల సంప్రదింపులు
'ఫైనాన్షియల్ టైమ్స్’కు రాహుల్ ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ, జూన్ 18: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి చాలా బలహీనంగా ఉందని, చిన్నపాటి సమస్య తలెత్తినా పడిపోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. కూటమి నుంచి ఏ ఒక్క పార్టీ బయటకొచ్చినా గందరగోళం మొదలవుతుందన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని, కొన్ని పార్టీల నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. అయితే, వారు ఎవరనేది వెల్లడించలేదు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’కు రాహుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ అనే భావన, మోదీ ఇమేజ్ పూర్తిగా ధ్వంసమయ్యాయని.. భారత రాజకీయాల్లో భూకంపం సంభవించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. 2014, 2019ల్లో మోదీ పట్టిందల్లా బంగారమయ్యిందని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని.. కాబట్టే, అధికార కూటమికి ఇబ్బందులు తప్పవన్నారు. ‘ద్వేషాన్ని, ఆగ్రహాన్ని వ్యాప్తి చేసి దాన్నించి లాభపడదామనుకునే(బీజేపీ) భావజాలాన్ని ఈ ఎన్నికల్లో భారతీయ ఓటర్లు తిరస్కరించారు. బీజేపీ తీవ్రం గా దెబ్బతిన్నది. మూసుకుపోయిన భారతీయ రాజకీయ వ్యవస్థను ఓటర్లు తెరిచారు’ అని పేర్కొన్నారు.
తీవ్ర ఇబ్బందుల మధ్య పోరాడాం!
మోదీ హయాంలో ప్రతిపక్షాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘న్యాయవ్యవస్థ, మీడియా, ప్రభుత్వ యంత్రాంగం, అధికారిక సంస్థలు.. అన్నీ మాకు తలుపులు మూసేశాయి. దీంతో మాకు ప్రజల వద్దకు వెళ్ల టం మినహా మరో దారి లేకుండా పోయింది’ అని చెప్పారు. దీంట్లో భాగంగానే భారత్ జోడోయాత్ర, భారత్ జోడో న్యా య్‌యాత్రలను చేపట్టానన్నారు. ‘మా చేతులు వెనక్కి కట్టేశారు. అయినా మేం పోరాడాం’ అని రాహుల్ పేర్కొన్నారు. అయోధ్య గురించి మాట్లాడుతూ పదేళ్లు గడిపిన పార్టీని (బీజేపీ) అయోధ్యలోనే ఓటర్లు తుడిచిపెట్టారని గుర్తు చేశా రు. బీజేపీకి పునాదిలా తయారైన.. మత విద్వేషాన్ని నిర్మించటం అనే మూలసిద్ధాంతం ఈ ఎన్నికల్లో కుప్పకూలిందన్నారు. ఎన్నికలు నిష్పక్షపాత పరిస్థితుల్లో జరిగి ఉంటే ఇండి యా కూటమి లోక్‌సభలో మెజారిటీ సాధించి ఉండేదని, దాంట్లో సందేహం లేదని చెప్పారు. ఎన్నికల వేళ ఇండియా కూటమి నేతలను జైలుకు పంపారని తెలిపారు.
మోదీ రెండు చోట్ల పోటీ చెయ్యలేదా?
వయనాడ్ లోక్‌సభ స్థానం ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ పోటీ చేయనుండడం రాజకీయ దుమారం రేపిం ది. వయనాడ్ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు ఇదే నిదర్శనమని బీజేపీ విమర్శించింది. అయితే, 2014లో మోదీ ఏం చేశారో మరచిపోయారా? అంటూ కాంగ్రెస్ కౌంటరిచ్చింది. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. వయనాడ్ ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, వీడీ సతీశన్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో వడోదర, వారాణసీ స్థానాల్లో గెలిచిన మోదీ వడోదర స్థానాన్ని వదులుకున్నారని గుర్తు చేశారు. కాగా, రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు.