Share News

Navya : ఆ నాటి రాజరికపు వివాహాలు

ABN , Publish Date - Jul 21 , 2024 | 12:41 AM

అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ పెళ్లి వేడుకలు చూసి ప్రపంచమంతా విస్తుపోయింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేయటమంటే ఏమిటో వారు ప్రపంచానికి రుచి చూపించారు.

Navya : ఆ నాటి రాజరికపు వివాహాలు

అలనాటి కథ

అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ పెళ్లి వేడుకలు చూసి ప్రపంచమంతా విస్తుపోయింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేయటమంటే ఏమిటో వారు ప్రపంచానికి రుచి చూపించారు. టీవీలలోను.. పేపర్లలోను.. సోషల్‌ మీడియాలోను ఎక్కడ చూసిన ఆ పెళ్లి కబుర్లే! ఒకప్పుడు రాజ కుటుంబాలలో కూడా ఈ తరహా పెళ్లిళ్లు జరుగుతూ ఉండేవి. కానీ అవి కేవలం కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమయ్యేవి.

రాజుకైనా.. పేదకైన పెళ్లి పెళ్లే! నా ఉద్దేశంలో మన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్పదనం అదే! ఆర్థికహోదా బట్టి పెట్టే ఖర్చు మారచ్చు.. చేసే వేడుకల తీరు మారచ్చు.. విందుల్లో పెట్టే పదార్థాలు మారచ్చు.. కానీ వివాహం అనేది వ్యక్తికి మాత్రమే పరిమతం కాదు.. రెండు కుటుంబాల కలయిక అనే విషయం ఇప్పటికీ మనకు తెలిసేలా వివాహ వేడుకలు ఉంటాయి.

నేను ఎక్కువ కాలం జీవించింది హైదరాబాద్‌లోనే కాబట్టి ఇక్కడ రాజకుటుంబాల వివాహాలను నేరుగా చూసే అవకాశం నాకు దక్కింది. సాధారణంగా రాజకుటుంబీకులు- తమ హోదాలో ఉన్నవారిని మాత్రమే వివాహ వేడుకలకు పిలిచేవారు. కొందరు వివాహ సమయంలో భండారా (ఆహార వితరణ) చేసేవారు. హైదరాబాద్‌ నిజాం కుటుంబీకులు మాత్రం పెళ్లిని తమ కుటుంబానికి సంబంధించిన వ్యవహారంగా మాత్రమే చూసేవారు. నాకు తెలిసి ఏ నిజాం తన ఇంట్లో జరిగే ఏ పెళ్లికి ‘సామాన్య ప్రజలను’ కానీ వారి ప్రతినిధులను కానీ వివాహాలను పిలిచేవారు కారు.


నిజాం ఆస్థానంలో ఉన్న కొందరు రాజకుటుంబీకులనే వివాహానికి పిలిచేవారు. నిజాం కుటుంబీకులు ఎవరైనా ఇతరుల వివాహానికి హాజరయితే సమాజంలో వారి గౌరవం రెట్టింపు అయ్యేది. చాలా అరుదుగా వారు పెళ్లిళ్లకు వచ్చేవారు. నాన్న రాజా ధన్‌రాజ్‌గిరికి నిజాం కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి కాబట్టి చెల్లి రేణుక పెళ్లికి ప్రిన్స్‌ ముఖరం ఝా బహదూర్‌ వచ్చారు. రావటమే కాదు.. రేణుక చేతికి ముత్యాలు, బంగారపు దారం తయారుచేసిన సెహ్రా (తల మీద ముత్యాలతో కట్టే ఒక ఆభరణం) కట్టారు. సాధారణంగా నిజాం పాలనలో యువరాజులు వచ్చినప్పుడు వారికి నజర్‌ (కానుక)ను ఇవ్వటం ఒక ఆచారంగా ఉండేది. ముఖరం ఝా ఆ నజర్‌ను స్వీకరించలేదు. అంటే మమల్ని కూడా ఆయన ఒక కుటుంబ సభ్యులుగా భావించారని అర్థం.

ఈ వార్త ఆ రోజుల్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇక్కడ సెహ్రా గురించి కూడా కొద్దిగా చెప్పాలి. ఒకప్పుడు పెళ్లికూతురుకు కట్టే సెహ్రాను చాలా పవిత్రమైనదిగా.. వివాహావేడుకల్లో ముఖ్యమైనదిగా భావించేవారు. అందుకే గాలిబ్‌ ఒక చోట- ‘‘నా చెలి సెహ్రాకు అవసరమైన ముత్యాల కోసం సముద్రమంతా గాలిస్తున్నాను’’ అంటాడు. ఆ రోజుల్లో సామాన్యంగా ఎప్పుడూ పాటలు పాడని వారు కూడా పెళ్లిళ్లలో ‘‘దుల్హా ఆయా.. హర్యాలా బనా ఆయా’’ అంటూ ఉత్సాహంగా పాటలు పాడేవారు. అంతే కాదు. వివాహాలలో షెహనాయి తప్పనిసరి.


షెహనాయి మోగితే ఏవైనా దుష్టశక్తులు ఉంటే పారిపోతాయని భావించేవారు. ఇక ఆడంబరాల విషయానికి వస్తే- పెద్ద కుటుంబాల వారికి పెళ్లిళ్లు తమ సంపదను ప్రదర్శించుకోవటానికి ఒక సందర్భంగా మారేది. ఏదైనా పెళ్లిలో రాజకుటుంబాలకు సంబంధించిన సైన్యం బారాత్‌లో పాల్గొంటే అది గొప్పింటి పెళ్లిగా భావించేవారు. నాకు గుర్తున్నంత వరకు ఒక రాజకుటుంబానికి చెందిన పెళ్లి బారత్‌- హైదరాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు నడిచింది. మా ఇంట్లో జరిగిన ఒక వివాహంలో బారాత్‌లో సాలార్‌జంగ్‌ సైన్యం ముందు నడిచింది. ఆ రోజుల్లో అదొక పెద్ద సంచలనం.

నేను గత 80 ఏళ్లలో అనేక పెళ్లిళ్లు చూశాను. పెళ్లిళ్ల విషయంలో అప్పటికి.. ఇప్పటికి వచ్చిన ప్రధాన మార్పు- బాధ్యతలు, అప్యాయతలు తగ్గిపోవటం. ఒకప్పుడు పెళ్లంటే ఒక బాధ్యత. దూరపు చుట్టాలు కూడా ముందుగానే వచ్చి పెళ్లి పనుల్లో పాల్గొనేవారు. అందువల్లే ఐదు రోజుల పెళ్లిళ్లు కూడా సునాయాసంగా జరిగిపోయేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ మధ్యకాలంలో- కేవలం ఫోటోల కోసమో.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ల కోసమో పెళ్లిళ్లను ఘనంగా జరిపించాలనుకొనే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.

నేను గమనించినదేమిటంటే- ఎంతో ఆతృతగా ఎక్కువ ఖర్చు పెట్టి ఫోటోలు తీయించుకున్నవారికి కూడా ఆ ఫోటోలు చూసేందుకు సమయం లేకపోవటం! ఒకప్పుడు ఆల్బమ్స్‌ ఉండేవి. వాటిని చూడటానికి అందరూ సమయం కేటాయించేవారు. కానీ ఈ డిజిటల్‌ యుగంలో ఎవ్వరికి అంత సమయం లేదు. చివరగా- వివాహం చేయటం ఒక కుటుంబ బాధ్యత. దానికి వెళ్లటం ఒక సామాజిక బాధ్యత. ఇతరులతో ఆనందకరమైన క్షణాలను పంచుకోవటం వల్ల సామాజికంగా ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అందుకే ఎవరు పిలిచినా- పెళ్లికి వెళ్లండి.. వారితో ఆనంద క్షణాలు పంచుకోండి.

- రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్‌

Updated Date - Jul 21 , 2024 | 12:41 AM