AP Politics: ఇదేం లెక్క.. హిందూపురంలో కూడా ఇదే జరుగుతుందా?
ABN , Publish Date - Jan 17 , 2024 | 04:53 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నకిలీ ఓట్ల అంశం కలకలం రేపుతోంది. ఎంతలా అంటే ఒకే పేరుతో ఉన్న వ్యక్తుల ఓట్లు ఐదారు నియోజకవర్గాల్లో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నకిలీ ఓట్ల అంశం కలకలం రేపుతోంది. ఎంతలా అంటే ఒకే పేరుతో ఉన్న వ్యక్తుల ఓట్లు ఐదారు నియోజకవర్గాల్లో ఉన్నాయి. కేవలం వయస్సు మాత్రమే మార్పు జరిగి మిగిలిన చోట అదే పేరుతో ఓట్లు నమోదయ్యాయి. అయితే ఈ ఫేక్ ఓట్లను ఎవరు నమోదు చేయిస్తున్నారు. కుప్పలు కుప్పలుగా నమోదవుతున్న ఈ నకిలీ ఓటర్ల నమోదు వెనుక వైసీపీ ప్రభుత్వ హస్తం లేకుండానే జరుగుతోందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ఆరునెలల ముందు నుంచే ఈ ప్రక్రియ కొనసాగినట్లు తెలుస్తోంది. ఏపీలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇదే వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
నేతల భయాందోళన!
అయితే ఈ ఫేక్ ఓటర్లను అడ్డుకునేదెవరు..అడ్డుకోకుంటే తమ భవిష్యత్తు ఏమవుతుందోనని నేతలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఓటు రాజకీయ నాయకుడి జీవితాన్ని మార్చేస్తుంది. అలాంటిది వందలకొద్ది ఓట్లు నకిలీవని తేలుతున్నాయి. మరి ఆ ఓట్ల పరిస్థితి ఏంటి. వాటి నమోదు విషయంలో ఎవరిపై చర్యలు తీసుకుంటారు. అధికార వైపీసీ ప్రమేయంతోనే ఇన్ని రోజులుగా ఈ తంతు కొనసాగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో బయటపెట్టిన బాగోతమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమని అంటున్నారు.
హిందూపూర్‌లో కుప్పలు కుప్పలుగా ఫేక్ ఓటర్లు
ఇలా ఒకటి రెండు కాదు తవ్వే కొద్దీ వైసీపీ సర్కార్ చేస్తున్న అక్రమాలు ఒక్కటికొక్కటిగా బయటికొస్తున్నాయ్. ఈ క్రమంలోనే తాజాగా హిందూపురం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నకిలీ ఓట్లు వెలుగులోకి వచ్చాయి. ఒకే పేరుతో ఉన్న వందల మంది ఓటర్లు రెండుకుపైగా నియోజకవర్గాల్లో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల మార్పులు, చేర్పుల పేరుతో భారీగా అవకతవకలు జరిగాయని ఈసీ డేటా ఆధారంగా స్పష్టంగా తెలుస్తోంది. ఆ సమాచారంలో హిందూపూర్ నియోజకవర్గంలో మొత్తం 239,043 ఓటర్లు ఉండగా..2023 జనవరి నుంచి అక్టోబర్ మధ్య 6,297 చేర్పులు జరిగాయి. ఈ క్రమంలోనే అధికారులు 595 మంది నకిలీ ఓటర్లను గుర్తించి తొలగించారు.
వీరి పనేనా?
ఇలా ఈ ఒక్క నియోజకవర్గమే కాదు. మడకశిర (SC), పెనుకొండ, పుట్టపర్తిలో కూడా ఒకే పేరు ఉండి వయస్సు మారడం లేదా నియోజవర్గం మారడం వంటి కారణాలతో 5,700 నకిలీ ఓట్ల వెలుగులోకి వచ్చాయి. ఇక 2019 ఈసీ డేటా ప్రకారం 10,496 ఓట్లను చేర్చగా..867 ఓట్లను తీసేశారు. అంతేకాదు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే పేరు, వయస్సు, లింగ బేధం మార్పుతో 1600 నకిలీ ఓట్లు బయటకొచ్చాయి. అయితే అసలు ఈ ఓట్లను ఎవరు చేర్చుతున్నారు. వీటి వల్ల ఎవరికీ ఉపయోగమని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ కీలక నేతలు ఓడిపోయే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ఫేక్ ఓటర్లను పెద్ద ఎత్తున చేర్చుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: AP NEWS: చిత్తూరు జిల్లాలో జల్లికట్టు నిర్వహణలో వైసీపీ అరాచకం
చర్యలేవి?
పదుల ఓట్లతోనే నేతల భవిష్యత్తు మారునున్న తరుణంలో ప్రతి ఓటు కీలకమని టీడీపీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. నకిలీ ఓటర్లు పెరిగిపోతే నేతల భవిష్యత్తు కూడా తలకిందులవుతుందని అంటున్నారు. గెలిచే అవకాశం ఉన్న నేతలు కూడా ఓడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఫేక్ ఓటర్లను అధికార వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇటివల ఏపీలో పర్యటించిన ఎన్నికల సంఘం అధికారులకు నకిలీ ఓట్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఫిర్యాదులు చేశారు. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.