Share News

IND W vs SL W: ఫైనల్‌లో భారత్ ఓటమి.. టైటిల్ సాధించిన శ్రీలంక

ABN , Publish Date - Jul 28 , 2024 | 06:53 PM

మహిళల ఆసియా కప్-2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలయ్యింది. ఈ టోర్నీలో వరుస విజయాలతో..

IND W vs SL W: ఫైనల్‌లో భారత్ ఓటమి.. టైటిల్ సాధించిన శ్రీలంక
India W vs Sri Lanka W

మహిళల ఆసియా కప్-2024లో (Women's Asia Cup 2024) భాగంగా శ్రీలంకతో (Sri Lanka Women) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు (India Women) ఓటమి పాలయ్యింది. ఈ టోర్నీలో వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత జట్టు.. తుది పోరులో మాత్రం శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఈ పోరులో శ్రీలంక 8 వికెట్ల తేడాతో భారత్‌పై గెలుపొంది, టైటిల్ సాధించింది. భారత్ నిర్దేశించిన 166 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 18.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి విజయఢంకా మోగించింది.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్మృతి మందాన (60) అర్థశతకంతో రాణించడంతో పాటు రిచా ఘోష్ (30), రోడ్రిగ్స్ (29) మెరుపులు మెరిపించడంతో.. భారత్ అంత స్కోరు చేయగలిగింది. మిగిలిన ఆటగాళ్లు మాత్రం పెద్దగా రాణించలేకపోయారు. ఓపెనర్ షెఫాలీ వర్మ 16 పరుగులకే పరిమితం అవ్వగా.. ఉమా ఛేత్రి (9), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (11) తక్కువ స్కోర్లతోనే పెవిలియన్ బాట పట్టారు. అందుకే.. ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేయలేకపోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. మరో 8 బంతులు మిగిలిన ఉండగానే 8 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేధించింది.


మొదట్లోనే 7 పరుగుల వద్దే శ్రీలంకకు ఓ ఝలక్ తగిలింది. ఓపెనర్ గుణరత్నే (1) రనౌట్ అయ్యింది. కానీ.. చమరి ఆటపట్టు (61), హర్షిత సమర విక్రమ (69) సమర్థవంతంగా రాణించారు. వెంటనే మరో వికెట్ పడకుండా.. ఆచితూచి ఆడారు. వీళ్లిద్దరు నిలకడగా రాణించడం వల్లే.. శ్రీలంక జట్టు విజయం ఖరారైంది. ఇక ఆటపట్టు ఔటయ్యాక వచ్చిన కవిశా దిల్హారి మెరుపులు మెరిపించడంతో.. శ్రీలంక విజయం సాధించింది. ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. దీప్తి శర్మ ఒక్కరే ఒక వికెట్ తీయగలిగింది. మిగిలిన బౌలర్లెవరూ తమ సత్తా చాటలేకపోయారు. శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 28 , 2024 | 06:53 PM