KL Rahul: సచిన్‌ను గుర్తుచేసిన రాహుల్.. చూసేందుకు రెండు కళ్లు చాలవంతే..
ABN , Publish Date - Nov 23 , 2024 | 02:51 PM
KL Rahul: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన క్లాస్ ఏంటో మరోమారు చూపించాడు. సూపర్బ్ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను కంగారెత్తించాడు. అతడు కొట్టిన ఓ షాట్ అయితే మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
పెర్త్: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన క్లాస్ ఏంటో మరోమారు చూపించాడు. సూపర్బ్ బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను కంగారెత్తించాడు. తన అనుభవం మొత్తాన్ని రంగరించి ఆడిన రాహుల్.. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరూ చెలరేగడంతో పెర్త్ టెస్ట్‌లో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. అయితే మ్యాచ్‌లో హైలైట్ అంటే రాహుల్ ఆడిన ఓ క్లాసిక్ షాట్‌ను చెప్పొచ్చు. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో రాహుల్ బాదిన స్ట్రైట్ డ్రైవ్ చూసేందుకు రెండు కళ్లు చాలవంతే..
వాటే టైమింగ్..
టీమిండియా రెండో ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసేందుకు వచ్చాడు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్. జోష్ హేజల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌కు వికెట్లు రాకపోవడంతో తానే రంగంలోకి దిగాడు. అయితే అతడ్ని రాహుల్-జైస్వాల్ బాదిపారేశారు. ముఖ్యంగా కేఎల్ క్లాసిక్ షాట్లతో అతడిపై విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్ మూడో బంతిని అద్భుతమైన రీతిలో స్ట్రయిట్ డ్రైవ్‌గా మలిచాడు. కాస్త ఫుల్లర్ లెంగ్త్‌లో పడి లోపలికి దూసుకొచ్చిన బంతిని చక్కటి టైమింగ్‌తో అంపైర్ పక్క నుంచి బౌండరీకి తరలించాడు రాహుల్.
అచ్చం సచిన్‌లా..
క్లాసికల్ షాట్‌తో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను గుర్తుచేశాడు రాహుల్. కవర్ డ్రైవ్స్, స్ట్రయిట్ డ్రైవ్స్ కొట్టడంలో సచిన్‌ను మించినోళ్లు లేరు. ముఖ్యంగా బ్యాటర్ తల మీదుగా, అలాగే అంపైర్ పక్క నుంచి ఎదురుగా ఉన్న బౌండరీలను టార్గెట్ చేసుకొని ఫోర్లు కొట్టడంలో అతడికి అతడే సాటి. అలాంటి సచిన్‌ను గుర్తుచేస్తూ రాహుల్ పర్ఫెక్ట్ హెడ్ పొజిషన్, చక్కటి బ్యాలెన్స్, ఆఖరి వరకు బంతి మీద నుంచి దృష్టి మరల్చకుండా దాన్ని టైమింగ్ చేసిన విధానం స్పెషల్ హైలైట్ అనే చెప్పాలి. ఈ షాట్‌తో కమిన్స్‌తో పాటు కంగారూ బౌలర్లకు అతడు హెచ్చరికలు పంపించాడు. కాగా, సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం వికెట్లేమీ కోల్పోకుండా 138 పరుగులతో ఉంది. మన జట్టు ఆధిక్యం 184 పరుగులకు చేరింది. రాహుల్ (50 నాటౌట్)తో పాటు జైస్వాల్ (73 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
Also Read:
పంత్‌కు తగలరాని చోట తగిలిన బంతి.. కోహ్లీ రియాక్షన్ చూస్తే నవ్వాగదు
సెమీస్‌కు సాత్విక్ జోడీ
స్నేహిత్‌కు కాంస్యం
For More Sports And Telugu News