Share News

SRH vs CSK: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సీఎస్కే ఓడిపోయిందని ఏకంగా..

ABN , Publish Date - Apr 06 , 2024 | 04:38 PM

ఐపీఎల్ 2024 అభిమానులను అలరిస్తోంది. బ్యాటర్ల బౌండరీల వరద, బౌలర్ల వికెట్ల వేట, ఫీల్డర్ల విన్యాసాలు అభిమానులకు ఫుల్ మజా పంచుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘనవిజయం సాధించింది. వన్‌ సైడేడ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నైని సన్‌రైజర్స్ చిత్తు చేసింది.

SRH vs CSK: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. సీఎస్కే ఓడిపోయిందని ఏకంగా..
Yellow turned into Orange last night

హైదరాబాద్: ఐపీఎల్ 2024 (IPL 2024) అభిమానులను అలరిస్తోంది. బ్యాటర్ల బౌండరీల వరద, బౌలర్ల వికెట్ల వేట, ఫీల్డర్ల విన్యాసాలు అభిమానులకు ఫుల్ మజా పంచుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (Chennai Super Kings vs Sunrisers Hyderabad) జట్టు ఘనవిజయం సాధించింది. వన్‌ సైడేడ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నైని సన్‌రైజర్స్ చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. నటరాజన్, భువనేశ్వర్ కుమార్, కమిన్స్, జయదేవ్ ఉనద్కత్ సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో చివరి 5 ఓవర్లలో చెన్నై 38 పరుగులే చేసింది. అనంతరం 166 పరుగుల లక్ష్య చేధనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. ఆరంభం నుంచే ధాటిగా బ్యాటింగ్ చేశారు. అభిషేక్ శర్మ(Abhishek Sharma) సునామీ ఇన్నింగ్స్‌తో చేధించాల్సిన లక్ష్యంలో సన్‌రైజర్స్ పవర్ ప్లేలోనే దాదాపు సగం పరుగులు చేసింది. అనంతరం ట్రావిస్ హెడ్, మాక్రమ్ కూడా చెలరేగడంతో మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే హైదరాబాద్ లక్ష్యాన్ని పూర్తి చేసింది.


అయితే ఈ మ్యాచ్‌ సాగుతుండగా ప్రేక్షకుల్లో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పిల్లాడు చెన్నైసూపర్ కింగ్స్‌ అభిమానిగా మ్యాచ్ చూడడానికి మైదానానికి వచ్చాడు. చెన్నై జెర్సీ కూడా ధరించాడు. కానీ సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో ఎందుకనో ఆ బుడ్డోడు మనసు మార్చుకున్నాడు. చెన్నైసూపర్ కింగ్స్ జెర్సీని తీసేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించాడు. ఆ బుడ్డోడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు జెర్సీ ధరిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటకు ఫిదా అయిపోయి ఆ బుడ్డోడు తన ఫెవరేట్ జట్టును మార్చుకున్నాడని కొందరు అంటున్నారు. మరికొందరేమో ‘‘ ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. మ్యాచ్ పోయిందని ఏకంగా జట్టునే మార్చేశాడు..’’ అని రాసుకొచ్చారు. అలాగే ఆ బుడ్డోడు అలా జట్టు మారడంపై మరికొందరు షాక్ అవుతున్నారు. కొందరైతే హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చెన్నై అభిమానులను పాట్ కమిన్స్ హైదరాబాద్ అభిమానులుగా మారుస్తున్నాడని కొనియాడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SRH vs CSK: ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడా..? అందుకే రివ్యూకు వెళ్లలేదా..?

IPL 2024: డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్.. మరొక తప్పు చేస్తే..

Updated Date - Apr 06 , 2024 | 04:43 PM