Vemuri Radhakrishna: చదువుల తల్లికి అండగా ఏబీఎన్- ‘ఆంధ్రజ్యోతి’
ABN , Publish Date - Dec 05 , 2024 | 04:34 AM
ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కళాశాల ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న ఓ నిరుపేద విద్యార్థినికి ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ అండగా నిలిచింది.
ఎండీ రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపిన వైద్య విద్యార్థిని శ్రీహర్షిత
ఖమ్మంటౌన్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కళాశాల ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న ఓ నిరుపేద విద్యార్థినికి ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ అండగా నిలిచింది. దాంతో సదరు విద్యార్థిని బుధవారం ఖమ్మం యూనిట్ కార్యాలయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. వైరా మునిసిపాలిటీ పరిధిలోని దిద్దుపుడి గ్రామానికి చెందిన పానెం శ్రీహర్షిత చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తాతయ్య- అమ్మమ్మ కొనకంచి జోజి- ప్రకాశమ్మల వద్ద పెరిగింది. కష్టపడి చదివి నీట్ ఫలితాల్లో జాతీయస్థాయిలో ర్యాంకు తెచ్చుకుని ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. అయితే చదువు కొనసాగించేందుకు ఫీజులు కట్టే ఆర్థిక స్తోమత లేక ఎంతో ఆవేదనకు లోనైంది.
ఆమె వ్యధను ఏబీఎన్‌తో పాటు ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దాంతో రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్, ఏపీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చిన్ని సహా పలువురు దాతకు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. శ్రీహర్షితకు సాయం చేసేందుకు లయన్స్ క్లబ్ సభ్యులు కూడా స్పదించారు. దాంతో శ్రీహర్షిత ఖమ్మంలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో చేరింది. బుధవారం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఖమ్మం యూనిట్ కార్యాలయానికి రాగా, విషయం తెలుసుకున్న శ్రీహర్షిత , తన తాత జోజితో వచ్చి రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపి, శాలువాతో సత్కరించింది. తన చదువు కొనసాగేందుకు ఏబీఎన్- ఆంధ్రజ్యోతి అందించిన సహాయం ఎప్పటకీ మరువలేనని పేర్కొంది. ఈ సందర్భంగా వేమూరి రాధాకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థినికి ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపి, ఎంబీబీఎ్‌సలో ఉత్తమ ఫలితాలు సాధించాలని శ్రీహర్షితను ఆశీర్వదించారు.