Ambulance: కంగారెత్తించిన కుయ్ కుయ్!
ABN , Publish Date - Dec 08 , 2024 | 04:38 AM
కుయ్ కుయ్ కుయ్ అని శబ్దం చేస్తూ అంబులెన్స్ దూసుకెళుతుంటే వాహనదారులు దారివ్వడం సహజం! ఆ అంబులెన్స్ దూసుకెళుతుంటే మాత్రం ఎక్కడ తమపైకి వస్తుందోనని వాహనదారులు బెంబేలెత్తిపోయారు.
హయత్‌నగర్‌లో అంబులెన్స్‌తో ఉడాయించిన దొంగ
రంగంలోకి 3 జిల్లాల పోలీసులు.. 130 కి.మీ మేర ఛేజ్
ఆపేందుకు యత్నించిన ఏఎ్‌సఐ.. ఢీకొట్టడంతో తీవ్రగాయాలు
సూర్యాపేట సమీపంలో లారీలను అడ్డుగా పెట్టిన పోలీసులు
యూ టర్న్ యత్నంలో గోతిలోకి అంబులెన్స్.. దొంగ అరెస్టు
హయత్‌నగర్, కేతేపల్లి, సూర్యాపేట రూరల్, కట్టంగూరు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కుయ్ కుయ్ కుయ్ అని శబ్దం చేస్తూ అంబులెన్స్ దూసుకెళుతుంటే వాహనదారులు దారివ్వడం సహజం! ఆ అంబులెన్స్ దూసుకెళుతుంటే మాత్రం ఎక్కడ తమపైకి వస్తుందోనని వాహనదారులు బెంబేలెత్తిపోయారు. పోలీసులేమో.. ఆ అంబులెన్స్‌ను ఆపేందుకు ఛేజ్ చేశారు! ముందు అంబులెన్స్.. వెనుక పోలీసులు.. ఇలా మూడు గంటలపాటు ఏకంగా 130 కి.మీ దూరం సినీ ఫక్కీలో ఛేజింగ్ జరిగింది!! ఆపేందుకు ప్రయత్నించి.. అంబులెన్స్ ఢీకొట్టడంతో ఓ ఏఎ్‌సఐ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ అంబులెన్స్‌ను ఓ దొంగ ఉడాయించడంతో శనివారం మఽధ్యాహ్నం హయత్‌నగర్ నుంచి చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్ మీదుగా సూర్యాపేట జిల్లా సరిహద్దు వరకు మూడు జిల్లాల పోలీసులు హైరానా పడ్డారు. ఆ దొంగ.. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం లక్ష్మీపురానికి చెందిన రావుల వెంకటరామనర్సయ్య. హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఉంటున్నాడు! మతిస్థిమితం లేనివాడిగా ప్రవర్తిస్తూ దొంగతనాలు చేస్తున్నాడు.
శనివారం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రి వద్ద నిలిపి ఉంచిన 108 అంబులెన్స్ ఎక్కాడు. ఆ వాహనంతో 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా విజయవాడ వైపు దూసుకెళ్లాడు. అంబులెన్స్ అపహరణకు గురైందని తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఒకరి తర్వాత ఒకరుగా భువనగిరి జిల్లా చౌటుప్పల్, నల్లగొండ జిల్లా చిట్యాల, కట్టంగూరు పోలీసులు హైవేపై అంబులెన్స్‌తో వెళుతున్న దొంగను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. చిట్యాల ఏఎ్‌సఐ పట్టణ కేంద్రంలో అంబులెన్స్ వాహనాన్ని చేజ్ చేసేందుకు పోలీస్ వాహనంతో వెంబడించారు. మండలంలోని పామనగుండ్ల గ్రామ శివారులోకి రాగానే అంబులెన్స్ వాహనాన్ని క్రాస్ చేసి కొంత దూరం వెళ్లాక రోడ్డు పక్కనే వాహనం నిలిపి అంబులెన్స్‌కు ఎదురుగా వెళ్లి ఆపేందుకు యత్నించారు. నిందితుడు అంబులెన్స్ ఆపకుండా ఏఎ్‌సఐను డీకొట్టి వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఏఎ్‌సఐ జానారెడ్డి కాలుకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టడంతో..
కట్టంగూరు మండలం దాటి కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వైపు అంబులెన్స్ వస్తోందని తెలుసుకున్న ఎస్‌ఐ శివతేజ బృందం వాహనాలను అడ్డుపెట్టగా దొంగ టోల్‌కౌంటర్ గేటును ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయాడు. ఎస్‌ఐ శివతేజ 8 కి.మీ. తర్వాత అంబులెన్స్‌ను ఓవర్‌టేక్ చేసి 6 కి.మీ. ముందుకెళ్లి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల వద్ద హైవేపై గల జంక్షన్‌లో లారీలను అడ్డుపెట్టి రోడ్డును బ్లాక్ చేయించారు. రోడ్డుపై పెద్ద ఎత్తున పోలీసులు, మనుషులను చూసిన దొంగ అంబులెన్స్‌ను వేగంగా ముందుకు కదిలించాడు. అయితే భారీ వాహనాలు రోడ్డుకు అడ్డంగా పెట్టడంతో వాహనాన్ని రోడ్డుపైనే వెనకకు యూటర్న్ తీసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. పోలీసులు వెంటనే అంబులెన్స్‌ను చుట్టుముట్టి డ్రైవింగ్ సీట్లో ఉన్న వెంకటరామనర్సయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడిని చికిత్స నిమిత్తం నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం హయత్‌నగర్ పోలీసులకు అప్పగించినట్లు కేతేపల్లి ఎస్‌ఐ శివతేజ తెలిపారు.