Share News

Jagityala: అంజన్న చెంతన పవన్‌..

ABN , Publish Date - Jun 30 , 2024 | 04:50 AM

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ శనివారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తాను ఇలవేల్పుగా కొలిచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.

Jagityala: అంజన్న చెంతన పవన్‌..

  • కొండగట్టులో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం ప్రత్యేక పూజలు

  • పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులు

జగిత్యాల, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ శనివారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. తాను ఇలవేల్పుగా కొలిచే ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో దీక్షా వస్త్రాలు, తలపాగాతో ఆలయానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు మేళతాళాలతో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. జగిత్యాల కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌ పవన్‌ కల్యాణ్‌కు పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేశారు. పవన్‌ కల్యాణ్‌ గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహిం చి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆశీర్వచనం అందించి శేష వస్త్రాన్ని, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కాగా, గతేడాది పవన్‌ కల్యాణ్‌ తన ప్రచార వాహనం వారాహికి కొండగట్టులోనే పూజలు చేసి.. ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను ఆశించిన ఫలితాలు రావడంతో అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు.


భారీగా తరలివచ్చిన అభిమానులు...

కొండగట్టుకు పవన్‌ కల్యాణ్‌ వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జై శ్రీరామ్‌, జై హనుమాన్‌, జై జనసేన, పవన్‌ కల్యాణ్‌ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానుల కేకలు, కేరింతలు, ఈలలతో కొండగట్టు ప్రాంతం మారుమోగింది. పవన్‌ కల్యాణ్‌ రాక సందర్భంగా జగిత్యాల- కరీంనగర్‌ హైవే రోడ్డు నుంచి కొండగట్టుకు వచ్చే గుట్ట రోడ్డుకు ఇరువైపులా అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దారి పొడవునా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ పవన్‌ కల్యాణ్‌కు స్వాగతం పలికారు. అభిమానులకు ఆయన అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అంతకుముందు కొండగట్టుకు వస్తున్న క్రమంలో సిద్దిపేట జిల్లా సరిహద్దులో పవన్‌కు ఘనస్వాగతం లభించింది. సిద్దిపేట అర్బన్‌ మండలంలోని పొన్నాల, ములుగు మండలంలోని ఒంటిమామిడి, వర్గల్‌ వద్ద అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. పొన్నాల వద్ద తెలంగాణ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన గజమాలను ఆయన స్వీకరించారు.


పోలీసుల భారీ బందోబస్తు...

పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు పర్యటన సందర్భంగా పోలీసులు అడుగడునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో వారిని నిలువరించడం పోలీసులకు కష్టంగా మారింది. కాగా, పవన్‌ కల్యాణ్‌ వెంట ప్రముఖ ఆర్కిటెక్చర్‌ ఆనంద్‌ సాయి కూడా కొండగట్టుకు వచ్చారు. గతంలో అప్పటి సీఎం కేసీఆర్‌ కొండగట్టు దేవస్థాన అభివృద్ధి కోసం జరిపిన పర్యటనలోనూ ఆనంద్‌ సాయి కీలక పాత్ర పోషించారు. యాదాద్రి మాదిరిగానే అంజనాద్రిని అభివృద్ధి పరచడానికి అవసరమైన ప్రణాళికను ఆనంద్‌ సాయి రూపొందించి కేసీఆర్‌కు అందజేశారు. ప్రస్తుతం ఆయన పవన్‌ కల్యాణ్‌తో కలిసి రావడం చర్చనీయాంశమైంది.

Updated Date - Jun 30 , 2024 | 04:50 AM