Share News

Bhatti : హూవర్‌ డ్యామ్‌ స్ఫూర్తితో.. జల విద్యుత్తు ప్రాజెక్టుల సామర్థ్యం పెంచండి

ABN , Publish Date - Sep 27 , 2024 | 03:13 AM

అమెరికాలోని నెవాడా, అరిజోన రాష్ట్రాల సరిహద్దులో కొలరాడో నదిపై నిర్మించిన హూవర్‌ జల విద్యుత్తు డ్యామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని జల విద్యుత్తు ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టాలని రాష్ట్ర అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.

Bhatti : హూవర్‌ డ్యామ్‌ స్ఫూర్తితో.. జల విద్యుత్తు ప్రాజెక్టుల సామర్థ్యం పెంచండి

  • అమెరికా పర్యటనలో రాష్ట్ర అధికారులకు భట్టి సూచన

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని నెవాడా, అరిజోన రాష్ట్రాల సరిహద్దులో కొలరాడో నదిపై నిర్మించిన హూవర్‌ జల విద్యుత్తు డ్యామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని జల విద్యుత్తు ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టాలని రాష్ట్ర అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం హూవర్‌ డ్యామ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అమెరికా అధికారులు ప్రాజెక్టు గురించి భట్టికి వివరించారు. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న 1931- 36 మధ్య ఈ ప్రాజెక్టును నిర్మించారని, దీని ద్వారా 2080 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని తెలిపారు.


ఈ డ్యామ్‌ మూడు రాష్ట్రాల విద్యుత్తు అవసరాలను తీరుస్తుందని చెప్పారు. మూడు ప్రధాన పట్టణాల్లోని 80 లక్షల మంది ప్రజలకు మంచినీటిని అందిస్తుందని, సాగునీటి అవసరాలు కూడా తీరుస్తుందని వివరించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ, హూవర్‌ డ్యామ్‌ జల విద్యుత్తు ఉత్పాదకతను స్ఫూర్తిగా తీసుకుని, రాష్ట్రంలోని ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుదలకు, రక్షణకు గల అవకాశాలను పరిశీలించాలని ఆయనతో పాటు ఉన్న రాష్ట్ర విద్యుత్తుశాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌, సింగరేణి ఎండీ బలరామ్‌కు సూచించారు.

Updated Date - Sep 27 , 2024 | 03:13 AM