Share News

Nalgonda: ‘రైతుభరోసా’ 10ఎకరాలకే పరిమితం చేయాలి..

ABN , Publish Date - Jul 11 , 2024 | 02:55 AM

రైతు భరోసా పథకాన్ని పది ఎకరాల లోపు రైతులకే పరిమితం చేయాలనే ఆలోచన మంచిదేనని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు.

Nalgonda: ‘రైతుభరోసా’ 10ఎకరాలకే పరిమితం చేయాలి..

  • ఆదాయపన్ను చెల్లించేవారికి ఇవ్వకపోతేనే మంచిది

  • కృష్ణాజలాల్లో మనకే ఎక్కువ వాటా ఇవ్వాలి

  • పార్టీ మారిన ఎమ్మెల్సీల వ్యవహారంపై

  • గత రికార్డులు, కోర్టుల తీర్పులకు అనుగుణంగా నిర్ణయం: మండలి చైర్మన్‌

నల్లగొండ, జూలై 10 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రైతు భరోసా పథకాన్ని పది ఎకరాల లోపు రైతులకే పరిమితం చేయాలనే ఆలోచన మంచిదేనని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. రైతు భరోసా అమలుపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. రైతు భరోసా, రుణమాఫీ పథకాలను అర్హులకు అందించాలని, ఆదాయం పన్ను క్రమం తప్పకుండా చెల్లించేవారికి అవసరం లేదన్నారు. భూ సేకరణలో పరిహారం పొందినా, పట్టాలున్నవారికి, గుట్టలలో సేద్యం లేని భూములకు రైతు భరోసా ఇవ్వకపోవడమే మంచి ఆలోచన అన్నారు.


కృష్ణా జలాల్లో తెలంగాణకే ఎక్కువ వాటా ఇవ్వాలని, ఇందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, కేంద్రమూ సహకరించాలన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు పంతాలకు పోకుండా వ్యవహరిస్తే, పునర్విభజన సమస్యలు 90ు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు తొలగించుకునేందుకు ఇద్దరు సీఎంలు సమావేశం కావడం హర్షణీయమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్సీల వ్యవహారంపై ఆయన స్పందిస్తూ.. గతంలో ఇలాంటి సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు, మండలిలో ఉన్న రికార్డులు, కోర్టుల తీర్పులకనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు.

Updated Date - Jul 11 , 2024 | 02:55 AM