Harish Rao: ఎవరు రాజీనామా చేయాలి?
ABN , Publish Date - Aug 19 , 2024 | 05:02 AM
‘‘కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులే రుణమాఫీ కాలేదని అంటున్నారు. అలాంటప్పుడు ఎవరు రాజీనామా చేయాలో..? ఎవరు ఏట్లో దూకి చావాలో..?
రుణమాఫీ పూర్తయితే రైతులు ఆందోళనలెందుకు చేస్తున్నారు..?: హరీశ్
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులే రుణమాఫీ కాలేదని అంటున్నారు. అలాంటప్పుడు ఎవరు రాజీనామా చేయాలో..? ఎవరు ఏట్లో దూకి చావాలో..? అమరవీరుల స్థూపం వద్ద ఎవరి ముక్కు భూమికి రాయాలో..? సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలి’’ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని కాంగ్రెస్ నేతలు, కోదండరెడ్డి, కోదండరాంరెడ్డి, ఆదిశ్రీనివాస్ ఒప్పుకున్న విషయాన్నే తాను చెప్పానని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
రుణమాఫీ పాక్షికంగా జరిగిందని, రూ.31వేల కోట్లని చెప్పి.. రూ.17వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని అంటే ఎందుకు రంకెలేస్తున్నారని ప్రశ్నించారు. రుణమాఫీ పూర్తయి ఉంటే రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి నిరసనలు, సీఎం దిష్టిబొమ్మల దహనాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా రుణమాఫీ ప్రక్రియను తూతూ మంత్రంగా కాకుండా సమగ్రంగా పూర్తి చేయాలని, రైతులందరికీ న్యాయం చేయాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు.