Share News

ప్రైవేటు సర్వే నంబర్లతో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు

ABN , Publish Date - Sep 23 , 2024 | 05:04 AM

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, శివారు మునిసిపాలిటీ.. ఇలా ప్రాంతమేదైనా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టేవారిది ఒకే విధానం. నిర్మాణాలకు అనుమతులు పొందడంలో, కొనుగోలుదారులను మోసం చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ప్రైవేటు సర్వే నంబర్లతో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, శివారు మునిసిపాలిటీ.. ఇలా ప్రాంతమేదైనా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టేవారిది ఒకే విధానం. నిర్మాణాలకు అనుమతులు పొందడంలో, కొనుగోలుదారులను మోసం చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్‌ పట్టా భూముల సర్వే నంబర్లతో నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటూ చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నారు.

ఆ అనుమతి పత్రాలను చూపించి.. అక్రమ నిర్మాణాలను అమ్మకానికి పెడుతున్నారు. రూ.లక్షలు, కోట్లు దోచుకొని బయటపడుతున్నారు. జేబులు నింపుకొని నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిస్తున్న అధికారులూ దర్జాగా ఉంటున్నారు. జీవిత కాలపు కష్టార్జితం, బ్యాంకు రుణాలు, బంగారం తనఖా పెట్టి అప్పు తీసుకున్న కొనుగోలుదారులు మాత్రం రోడ్డున పడుతున్నారు. అమీన్‌పూర్‌ మునిసిపాలిటీలోని పటేల్‌గూడలో అదే జరిగింది. గతంలో నిజాంపేట ఎర్రకుంట చెరువులోనూ ఇతర సర్వే నంబర్లతో అనుమతులు తీసుకొని ఇలాగే భవనాలు నిర్మించారు. హైడ్రా పరిశీలనలో ఆ నిర్మాణాలు చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నట్లు తేలడంతో నేలమట్టం చేశారు. అమీన్‌పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని పటేల్‌గూడలో సర్వే నంబర్‌ 164లో 27 ఇళ్లను నిర్మించారు. వాస్తవంగా అది ప్రభుత్వ భూమి. కానీ, ప్రైవేట్‌ పట్టా భూముల సర్వే నంబర్ల పేరిట అనుమతులు తీసుకొని.. సర్కారు స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. బిల్డర్లకు మునిసిపల్‌, ఇతర విభాగాల అధికారులు సహకరించారన్న ఆరోపణలున్నాయి.

నిబంధనల ప్రకారం.. మునిసిపాలిటీలోని ప్రణాళికా విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రెవెన్యూ విభాగం ఇచ్చిన యాక్సెస్‌ ఆధారంగా స్థలం ఎక్కడుందో ఆన్‌లైన్‌లో కూడా చూడాల్సి ఉంటుంది. పక్కన ప్రభుత్వ భూములున్నాయా? లేదా? అన్నదీ తెలుసుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో రెవెన్యూ విభాగం నుంచి నిరభ్యంతర పత్రమూ సమర్పించేలా నిర్మాణదారులకు సూచించాలి. ఇక్కడ మాత్రం మునిసిపల్‌ అధికారులు గుడ్డిగా అనుమతులిచ్చారనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్‌ నేతలు అధికార అండతో అనుమతులు పొందినట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో అనుమతులు ఇచ్చిన తీరు, దరఖాస్తుతోపాటు నిర్మాణదారులు సమర్పించిన పత్రాలు, ఇతరత్రా వివరాలనూ హైడ్రా అధికారులు పరిశీలించనున్నారు. దాని ఆధారంగా అధికారుల పొరపాటు ఉందని తేలితే.. వారిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు ఫిర్యాదు చేయనున్నారు.

Updated Date - Sep 23 , 2024 | 05:04 AM