Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- హరీష్‌రావు మెడకు ఆ కేసు ఉచ్చు ...
ABN , Publish Date - Dec 03 , 2024 | 03:11 PM
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం విషయం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావుపై కేసు నమోదైంది. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా విచారణ చేపట్టారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇవాళ(మంగళవారం) కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు చక్రధర్ ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్‌లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
పోలీసుల విచారణ ...
గతంలో హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసులో డీజీపీకి, జూబ్లీహిల్స్ ఏసీపీకి చక్రధర్ గౌడ్ (Congress Leader Chakradhar Goud) అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుపై గతంలో రెండుసార్లు పోలీసులు విచారణ చేశారు. హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించడంతో జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు చక్రధర్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఆయన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు పరిశీలించి విచారణ చేశారు.
ఆపిల్ కంపెనీ ద్వారా అలర్ట్ మెసేజ్..
ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందని, తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు ఆపిల్ కంపెనీ ద్వారా తనకు అలర్ట్ మెసేజ్ వచ్చిందని, దీనిపై గతంలో డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. గంటన్నర పాటు పోలీసులు విచారణ జరిపి.. స్టేట్మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు బీఆర్ఎస్ పార్టీలో చేరి హరీష్ రావుకు సరెండర్ అవ్వాలని... లేకపోతే అక్రమ కేసులు పెడతామని బెదిరింపులకు దిగారని చెప్పారు. తన వ్యక్తిగత ఫోన్‌తో పాటు తన భార్య, డ్రైవర్, తమ కుటుంబ సభ్యుల ఫోన్లు అన్ని ట్యాపింగ్ చేశారని పేర్కొన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, తాము చెప్పినట్లు వినకపోతే తన కుటుంబాన్ని అంతం చేస్తామంటూ అప్పటి ట్రాన్స్‌పోర్టు డీసీపీ రాధా కిషన్ రావు బెదిరింపులకు దిగారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసి పోరాటం చేస్తున్నానని, న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసి పోరాటం చేస్తానని చక్రధర్ గౌడ్ స్పష్టం చేశారు.
వారిపై హైకోర్టులో విచారణ ..
అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావు, భుజంగరావు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేసింది. ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. భుజంగరావు, రాధా కిషన్ రావులు ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కూడా గతంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం ఆయనను విచారించింది. విచారణలో మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న కాల్ లిస్ట్ చుట్టూ తిరిగింది. ‘‘మీరు తిరుపతన్న మొబైల్ ఫోన్‌కు రెండు ఫోన్ నంబర్లు పంపించారు. వాటిని ఎందుకు పంపారు’’ అని పోలీసులు ప్రశ్నించారు. రెండు గంటల పాటు విచారణ కొనసాగింది. కాగా.. ఈ కేసులో ఇటీవలే మరో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.. లింగయ్య ఇచ్చిన రెండు నంబర్లను తిరుపతన్న ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
తిరుపతన్న కాల్‌డేటా ఆధారంగా ముందుకు కేసు..
ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్ ఫోన్లను తిరుపతన్న ట్యాప్ చేసినట్లు నిర్ధారణ కావడంతో.. పోలీసులు లింగయ్యను మరోమారు విచారించారు. ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఓ పారిశ్రామికవేత్తను పోలీసులు విచారించారు. ఈ కేసు నమోదైన తర్వాత.. ఎఫ్ఎస్ఎల్ నివేదిక రావడంతో.. అధికారులు తిరుపతన్న కాల్‌డేటా ఆధారంగా ముందుకు సాగుతున్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి.. ఆ తర్వాతే భారత్‌కు వచ్చే యోచనలో ఉన్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌కు ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక పరికరం(షార్ట్ రేంజ్ బగ్) తెప్పించిన రవిపాల్‌ను మరోసారి విచారించేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి...
BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్
MLA: ‘పది’ విద్యార్థులకు బంపరాఫర్ ఇచ్చిన ఎమ్మెల్యే.. అదేంటో తెలిస్తే..
Pushpa 2: పుష్ప 2 టికెట్ ధరలు పెంపుపై హైకోర్టులో విచారణ.. ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News