TS News: హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బ తీస్తుంది: ఎంపీ లక్ష్మణ్
ABN , Publish Date - Feb 12 , 2024 | 02:31 PM
హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బ తీస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (Laxman) అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని పదే పదే ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోందని మండిపడ్డారు.
హైదరాబాద్: హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బ తీస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (Laxman) అన్నారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని పదే పదే ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని తెలిపారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్‌కు మనసు రాలేదన్నారు. ఐదుగురికి భారతరత్న ఇస్తే.. కాంగ్రెస్ ఓర్వలేక పోతుందని చెప్పారు.
అయోధ్య పర్యాటక, ఆధ్యాత్మిక రంగంగా వెలుగొందుతోందని అన్నారు. రాముడు, రామసేతు మిథ్య అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోందన్నారు. హిందువులను, హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదమని ఆరోపించారు. రాముడు మీద కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కిందని.. త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం హిందుత్వం కోసం పని చేస్తుందనీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శిస్తున్నారన్నారు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక, బస్సు యాత్రలపై ఎన్నికల కమిటీ సమావేశాల్లో చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎండగట్టడమే లక్ష్యంగా యాత్రలు నిర్వహిస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు.