Hyderabad: కూల్చివేతలు ఆగవు..
ABN , Publish Date - Aug 17 , 2024 | 04:15 AM
‘‘చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో రాజీపడేది లేదు. రాజకీయ నేతలు ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. వారి విమర్శలపై స్పందించను.
వెనక్కి తగ్గేది లేదు.. ఎవరున్నా వదిలేది లేదు
ఒత్తిళ్లొస్తాయని తెలుసు.. పట్టించుకోం
సౌత్ జోనే కాదు.. అంతటా చర్యలు
చెరువులు, పార్కుల్ని కాపాడుకోవాలి
ప్రజలు అనుకుంటే నేతలు సైలెంట్
‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ‘‘చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో రాజీపడేది లేదు. రాజకీయ నేతలు ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు. వారి విమర్శలపై స్పందించను. భూముల ధరలు పెరగడంతో భూమాఫియా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను చెరబడుతోంది. వారి వెనుక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. తమకు నష్టం జరుగుతుందనుకున్నప్పుడు వాళ్లు అలాగే స్పందిస్తారు. రాజకీయాలతో నాకు సంబంధం లేదు. ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు తప్పవు’’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించి నెలకావస్తున్న నేపథ్యంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
కొత్త బాధ్యతల అనుభవం ఎలా ఉంది?
హైడ్రాకు తొలి కమిషనర్‌గా రావడం అదృష్టంగా భావిస్తున్నా. చెరువులు, పార్కులతో ముడిపడి ఉన్న హైదరాబాద్ మనుగడను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. ఆ విషయంలో హైడ్రా కీలకంగా వ్యహరిస్తుంది. చెరువులు, పార్కుల కబ్జా, భూవివాదాల గురించి తెల్సుకోవడం రాకెట్ సైన్స్ కాదు. వరంగల్, నల్గొండలో పని చేసినప్పుడు కొంత అవగాహన ఉంది. పురపాలన, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఇరిగేషన్ విభాగాల చట్టాల గుర్తించి తెల్సుకుంటున్నా.
తాగు, సాగు నీటి అవసరాలకు, భూగర్భ జలాల పెంపునకు.. ఇలా బహుళ ప్రయోజనాలు సాధించేలా నిజాం, కాకతీయులు, ఇతర పాలకులు ప్రణాళికాబద్ధమైన నీటిపారుదల వ్యవస్థ తయారు చేశారు. వాటన్నిటి వివరాలూ సేకరిస్తున్నాం. కొన్నిచోట్ల మ్యాపుల్లో చెరువులున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు. కొన్ని నాలాలు, పార్కులదీ అదే దుస్థితి. చెరువుల ఆక్రమణలపై సుప్రీం, హైకోర్టు, ఎన్‌జీటీల తీర్పులతో కంపెండియమ్ తయారు చేస్తున్నాం. యజమాన్యపు హక్కు వివాదాలుండే అవకాశమున్న దృష్ట్యా ప్రభుత్వ భూముల కబ్జాల జోలికి వెళ్లట్లేదు. చెరువులు, పార్కుల్లో నిర్మాణాలు కూల్చివేస్తున్నాం.
అవాంతరాలను ఎలా అధిగమిస్తారు?
గ్రేహౌండ్స్, ఆక్టోపస్, టీజీన్యాబ్, ఎస్‌ఐబీ తరహాలో హైడ్రా కొత్త సంస్థ. సరైన మార్గంలో తీసుకెళ్లేందుకు వ్యవస్థను సమర్థంగా నిర్మించుకోవాలి. ఆరంభంలో అవాంతరాలుంటాయి. కూల్చివేతలకు సంబంధించి కార్పొరేషన్లు, మునిసిపాలీటీలు, జీహెచ్‌ఎంసీ, పంచాయతీ రాజ్ యాక్ట్‌ల అధికారాలను హైడ్రాకు ఇచ్చారు. ఒత్తిళ్లు వస్తాయని ముందే తెలుసు. కానీ.. ఈ విషయానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎన్‌ఆర్‌ఎ్‌ససీ, ఇస్రో, పర్యావరణవేత్తలు మాతో కలిసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారు. హైడ్రా పనితీరుపై ప్రజల నుంచి అభినందనలు వస్తున్నాయి.
ఎఫ్‌టీఎల్ నిర్ధారణ ఏ ప్రతిపాదికన చేస్తున్నారు?
ఔటర్ వరకు 400కుపైగా చెరువులున్నాయి. వాటిలో మెజారిటీ జలాశయాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం(ఎఫ్‌టీఎల్)పై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. కొన్ని చోట్ల కోఆర్డినేట్స్ మారినట్టు తెలుస్తోంది. అందుకే ఎఫ్‌టీఎల్ ఎలా నిర్ధారించాలి? ఎంత విస్తీర్ణంలో ఉన్న చెరువుకు ఎంత బఫర్ జోన్ ఉంటుంది? తెలుసుకునేందుకు రిటైర్డ్ ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, పర్యావరణవేత్తలతో వర్క్‌షాప్ నిర్వహిస్తాం. దశాబ్దాల నాటి శాటిలైట్ చిత్రాలు, గూగుల్ మ్యాపుల ద్వారా వాస్తవాలు తెల్సుకునే ప్రయత్నం చేస్తాం.
జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై చర్యలుంటాయా?
జంట జలాశయాల ఎగువన ఉన్న కాలువల్లో ఎస్‌టీపీలు నిర్మించారు. వాటి నుంచి వచ్చే మురుగును శుద్ధి చేసి జలాశయాల్లోకి వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నీటిని నగర తాగునీటి అవసరాలకూ వాడుతుంటారు. అలాంటప్పుడు శుద్ధి చేసిన నీరు ఎంత వరకు సురక్షితం? జీఓ-111 పరిధి జోలికి వెళ్లడం లేదు. చెరువులు, ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై దృష్టి సారించాం. ఫామ్‌హౌ్‌సలైనా.. ఇతర నిర్మాణాలైనా వరద కాలువలు, చెరువుల్లో ఉంటే కూల్చివేస్తాం.
అనుమతిలిచ్చిన అధికారులపై చర్యలుంటాయా?
చందానగర్‌లోని ఈర్ల చెరువు, ప్రగతినగర్‌లోని ఎర్ర చెరువు ఎఫ్‌టీఎల్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అనుమతులిచ్చారు. ఇక్కడ సర్వే నెంబర్లు, సరిహద్దులను తారుమారు చేసి నిర్మాణదారులు అనుమతులు తీసుకున్నారు. ఇరిగేషన్ నిరభ్యంతర పత్రాలూ లేవు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చిన అధికారులపై చర్యలుంటాయి. వారిని ప్రాసిక్యూట్ చేస్తాం.
కూల్చివేతలకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నారా?
ఏదైౖనా స్పష్టత కావాలనుకుంటే ప్రభుత్వంతో చర్చిస్తా. లేదంటే నేనే నిర్ణయం తీసుకుంటా. క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించి చర్యలు చేపడుతున్నాం. అందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. విధి నిర్వహణకు సంబంధించి పూర్తి స్వేచ్ఛ ఉంది. సర్కారుకు ఏదైనా సందేహాలుంటే నివృత్తి చేసుకుంటుంది. అక్రమ నిర్మాణాలకు గతంలోలా రంధ్రాలు చేసి వదలకుండా పూర్తిస్థాయిలో నేలమట్టం చేస్తున్నాం. ఇందుకు ఎక్కువ ఖర్చవుతోంది. కూల్చివేతల వ్యయం నిర్మాణదారుల నుంచి వసూలు చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వ స్థాయిలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన చెరువులకు ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
హైడ్రా ఏర్పాటు సత్ఫలితాలనిస్తుందా?
హైడ్రా ఏర్పాటు దేశంలోనే సరికొత్త చర్చకు దారి తీసింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా ఏజెన్సీ ఏర్పాటుకు డిమాండ్లు వస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఓ ప్రొఫెసర్ నాతో మాట్లాడారు. హైడ్రా పనితీరు గురించి ఆరా తీశారు. ఢిల్లీలో ఎక్కువ అక్రమ నిర్మాణాలే ఉన్నాయని.. అక్కడ హైడ్రా లాంటిది కావాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. ఏపీలోని వైజాగ్‌లోనూ ఇదే డిమాండ్ వచ్చిందని ఐపీఎస్ ఆఫీసర్ల వాట్సప్ గ్రూపులో చూశా. ఈ తరహా డిమాండ్లు, పెరుగుతున్న ఫిర్యాదులే.. హైడ్రాపై శ్వాసం పెరిగిందనేందుకు నిదర్శనం.
కొనుగోలుదారులు బాధితులవుతున్నారు కదా?
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు.. వెబ్‌సైట్‌లో చెరువుల ఎఫ్‌టీఎల్ హద్దులు అందుబాటులో ఉంచుతాం. ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఉన్నారా? లేక బఫర్ జోన్‌లో ఉన్నారా తెలిసేలా యాప్ రూపొందిస్తున్నాం.
విపత్తుల నిర్వహణ మెరుగుదలకు ఏం చేస్తున్నారు?
హైదరాబాద్‌లో వర్షపాతం తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రియల్ టైమ్‌లో ఎక్కడ ఎంత వర్షం పడింది.. ఎంత వరద నీరు నిలిచే అవకాశముందనేది సాంకేతికతతో తెల్సుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిపై స్టార్టప్‌లతో పని చేస్తాం. ఐఎండీ వాళ్లతోనూ సమన్వయం చేసుకుంటున్నాం.
నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చిన అధికారులపై చర్యలుంటాయి. వారిపై విచారణ జరిపి ప్రాసిక్యూట్ చేస్తాం. ఆక్రమణదారుల వెనుక ఉన్న ఇతర వ్యక్తులనూ గుర్తిస్తాం. ఆధారాలు దొరికితే వారిపైనా చర్యలు తీసుకుంటాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. ఎవరైనా వదలం. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో భవనాలు నిర్మించి మెనేజ్ చేస్తామనుకుంటే ఇక కుదరదు. కోర్టులు కూడా అంత సులువుగా స్టేలు ఇవ్వవు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వ్యవస్థను తప్పుదోవపట్టించే వారిని ప్రాసిక్యూట్ చేస్తాం.
- రంగనాథ్, హైడ్రా కమిషనర్
ఆ చెరువు చూసి బాధేసింది!
జీవవైవిధ్య పరంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న అమీన్‌పూర్ చెరువును చూస్తే బాధేసింది. వ్యర్థాలతో నింపి చెరువును రెండుగా విభజించారు. అక్కడి రాళ్లపై ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అగ్రిమెంట్ భూమి అని రాసి ఉంది. రేపు పోలీ్‌సస్టేషన్ వచ్చాక దీనిపై విచారణ జరుపుతాం. గూగుల్ మ్యాప్, శాటిలైట్ చిత్రాలు తీసి.. ఎవరు పూడ్చారో విచారించి క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూడ్చిన వ్యర్థాలను తొలగిస్తాం.