Patancheru: తెల్లవార్లూ హైడ్రా కూల్చివేతలు..
ABN , Publish Date - Sep 24 , 2024 | 03:49 AM
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. పటాన్‌చెరు పరిధి కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ గ్రామాలలో ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకధాటిగా 20 గంటలపాటు కొనసాగాయి!
పటాన్‌చెరు కిష్టారెడ్డిపేటలో అర్ధరాత్రి 3 భవనాలు నేలమట్టం చేసిన హైడ్రా
పటేల్‌గూడలో 24 ఇళ్ల కూల్చివేత
మాదాపూర్ కావూరిహిల్స్‌లో పార్కు స్థలంలో జిమ్ నేలమట్టం
పటాన్‌చెరు, సెప్టెంబరు 23: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. పటాన్‌చెరు పరిధి కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ గ్రామాలలో ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకధాటిగా 20 గంటలపాటు కొనసాగాయి! హైడ్రా కూల్చివేతలు పగలు, రాత్రి కొనసాగడం ఇదే తొలిసారి. కిష్టారెడ్డిపేట సర్వే నంబర్ 164 ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఐదంతస్తుల భారీ షాపింగ్ కాంప్లెక్స్‌లు మూడింటిని.. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అలాగే పటేల్‌గూడ సర్వే నంబర్ 12లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన 24 ఇండ్లను పూర్తిస్థాయిలో ధ్వంసం చేసి, శ్లాబ్‌లను నేలమట్టం చేశారు. మరో నాలుగు ఇండ్లలో జనాలు ఉండటంతో.. ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీచేశారు. కాగా.. కిష్టారెడ్డిపేటలోని సర్వే నంబర్164లో ఇంకా అనేక అక్రమ కట్టడాలున్నాయి. వాటిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అక్కడే.. ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లుగా ఆరోపణలున్న కొన్ని అపార్ట్‌మెంట్‌ల కూల్చివేతకు సైతం హైడ్రా ఏర్పాట్లు చేస్తోందని ప్రచారం జరుగుతోంది.
అమీన్‌పూర్‌లో..
వారం రోజులుగా అమీన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు కుంటల్లో అక్రమ కట్టడాలపై దృష్టి సారించిన హైడ్రా.. అమీన్‌పూర్ పెద్దచెరువు, శంభునికుంట, బందకొమ్ము చెరువుల్లోని అక్రమ కట్టడాలతో జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. వాటికి సంబంధించి నోటీసులు సైతం జారీచేసినట్లు సమాచారం. అక్కడికి కూడా ఏ క్షణాన్నైనా ఎక్సకవేటర్లు ప్రత్యక్షమవుతాయని సమాచారం. అయితే.. అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 993, 630 సర్వే నంబర్లలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో ఎక్కువ శాతం పేద, మధ్య తరగతి వర్గాలే ఉన్నాయి. వారంతా.. తమ గూడు చెదిరిపోతుందేమోనని కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. తమను దారుణంగా వంచించిన బిల్డర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మాదాపూర్ కావూరిహిల్స్‌లో పార్కు స్థలంలో జిమ్ కూల్చివేత
మోతినగర్, సెప్టెంబర్ 23(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో.. పార్క్ స్థలంలో నిర్మించిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది సోమవారం తొలగించారు. కావూరిహిల్స్‌లోని రోడ్ నెంబర్ 36లో.. సర్వే నంబర్ 42, 43, 44, 45లో గల లే-అవుట్‌లో రెండెకరాల పార్కు స్థలం ఉంది. ఆ స్థలంలో కొన్నాళ్లుగా షెడ్డు ఏర్పాటు చేసి జిమ్ నడుపుతున్నారు. అనుమతి లేకుండా కట్టిన ఆ నిర్మాణాలపై కావూరిహిల్స్ అసోసియేషన్ ప్రతినిధులు 8 ఏళ్ల క్రితం హైకోర్టును ఆశ్రయించారు.
కూల్చివేయాలని కోర్టు ఆదేశించినా.. జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. కాలనీవాసులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లగా సోమవారం ఉదయం బుల్‌డోజర్‌తో కూల్చివేతలు నిర్వహించారు. అక్కడ 2000 గజాల స్థలం స్వాధీనం చేసుకుని.. పార్క్ అభివృద్ధి నిమిత్తం జీహెచ్‌ఎంసీకి అప్పగించినట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. కాగా.. జీహెచ్‌ఎంసీ నుంచి తాము అనుమతులు తీసుకొనే జిమ్ ఏర్పాటు చేసుకున్నామని, ప్రతి నెలా అద్దె కూడా చెల్లిస్తున్నామని నిర్వాహకులు వాపోయారు.