Share News

High Court: మేడిగడ్డ బ్యారేజీ కేసు కొట్టేయండి

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:12 AM

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో సోమవారం క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

High Court: మేడిగడ్డ బ్యారేజీ కేసు కొట్టేయండి

  • భూపాలపల్లి జిల్లా కోర్టుకు అధికార పరిధి లేదు

  • హైకోర్టులో కేసీఆర్‌, హరీశ్‌రావు క్వాష్‌ పిటిషన్‌

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో సోమవారం క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగుబాటు అంశంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌, హరీశ్‌రావు, అప్పటి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్‌ కుమార్‌, అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు హరిరామ్‌, శ్రీధర్‌, మేఘా నిర్మాణ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్‌ సహా ఇతరులు కారణమని పేర్కొంటూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి మొదట మేజిస్ట్రేట్‌ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. తమకు పరిధి లేదని పేర్కొంటూ మేజిస్ట్రేట్‌ కోర్టు సదరు పిటిషన్‌ను కొట్టేసింది.


దాంతో ఆయన జిల్లా కోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రివిజన్‌ పిటిషన్‌లోనే భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్‌ సహా ఇతరులకు నోటీసులు జారీ చేసింది. రివిజన్‌ పిటిషన్‌ను స్వీకరించే అధికార పరిధి భూపాలపల్లి జిల్లా కోర్టుకు లేదని, దాన్ని కొట్టేయాలని కోరుతూ కేసీఆర్‌, హరీశ్‌రావులు హైకోర్టును ఆశ్రయించారు. ఒక్కసారి మేజిస్ట్రేట్‌ కోర్టు తనకు పరిధిలేదని ప్రైవేటు ఫిర్యాదును కొట్టేసిన తర్వాత రివిజన్‌ పిటిషన్‌ విచారణకు స్వీకరించి ప్రైవేటు ఫిర్యాదును తిరిగి తెరిచే అధికారం జిల్లా కోర్టుకు లేదని అన్నారు. కోర్టుకు అధికారమే లేనిచోట తమకు నోటీసులు జారీ చేయడం అనే సమస్యే తలెత్తదని చెప్పారు. సీఆర్పీసీకి విరుద్ధంగా రివిజన్‌ పిటిషన్‌ను జిల్లా కోర్టు స్వీకరించిన విధానం తప్పుడు సంకేతాలను పంపుతుందని తెలిపారు. ఒకవేళ జిల్లా కోర్టు విచారణ పూర్తి చేసి ఈ అంశాన్ని మళ్లీ మేజిస్ట్రేట్‌ కోర్టుకు పంపినా తన ఉత్తర్వులను తానే మళ్లీ పునః పరిశీలించే అధికారం మేజిస్ట్రేట్‌ కోర్టుకు ఉండదని చెప్పారు. భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసుతో పాటు జూలై 10న ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని కోరారు. కేసీఆర్‌, హరీశ్‌ల పిటిషన్‌ త్వరలో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఎదుట విచారణకు రానుంది.


మరో కేసులో పట్నం నరేందర్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌

లగచర్ల ఘటన నేపథ్యంలో దాఖలైన మరో కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. భూసేకరణ విచారణకు వెళ్తున్న స్థానిక కాంగ్రెస్‌ నాయకుడిని అడ్డుకోవడమే కాకుండా ఆయన కారును ధ్వంసం చేశారని పేర్కొంటూ బొమ్రా్‌సపేట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 145 నమోదు చేశారు. ఈ కేసులో ప్రస్తుతానికి నరేందర్‌రెడ్డి నిందితుడిగా లేకపోయినప్పటికీ తర్వాత నిందితుడిగా చేర్చి పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో నరేందర్‌రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం పలు షరతులతో నరేందర్‌రెడ్డికి ముందస్తు బెయిలును మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, ప్రతి సోమవారం పోలీస్‌ స్టేషన్‌లో సంతకం పెట్టాలని, రూ.25 వేల పూచీకత్తు, రెండు ష్యూరిటీలు సమర్పించాలని కోరుతూ తుది ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Dec 24 , 2024 | 05:12 AM