Share News

Hyderabad: ఫిరాయింపులకు కళ్లెం వేద్దాం!

ABN , Publish Date - Jun 25 , 2024 | 03:27 AM

అనూహ్యంగా అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్నారు! మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు! ఇప్పటికే ఐదుగురు పార్టీని వీడగా.. మరికొందరు కూడా పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది!

Hyderabad: ఫిరాయింపులకు కళ్లెం వేద్దాం!

  • అత్యంత సన్నిహితులూ పార్టీని

  • వీడుతుండడంతో అప్రమత్తమైన బీఆర్‌ఎస్‌

  • ఎమ్మెల్యేల్లో భరోసా నింపేందుకు

  • ఈ వారంలోనే అధినేత కేసీఆర్‌ సమావేశం

  • విదేశీ పర్యటన రద్దు చేసుకుని ముందుగానే

  • రాష్ట్రానికి వస్తున్న ప్రశాంత్‌ రెడ్డి, పల్లా

  • ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్లాలనే యోచన

  • పార్టీ మారేవారిని ప్రోత్సహించడం తగదు

  • అధికారం ఉందని విర్రవీగితే..

  • ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు: కేటీఆర్‌

  • నేతన్నలవి ప్రభుత్వ హత్యలే..!

  • ఉపాధి లేక 6 నెలల్లో 10 మంది ఆత్మహత్య

  • అయినా ఆదుకోరా? సీఎంకు కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): అనూహ్యంగా అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడుతున్నారు! మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు! ఇప్పటికే ఐదుగురు పార్టీని వీడగా.. మరికొందరు కూడా పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది! దాదాపు 20 మందికిపైగా పేర్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి! అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడంతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవంతో నాయకులు పార్టీని వీడుతున్నారు. ఊహించని విధంగా అత్యంత సన్నిహితులు ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడుతుండడంతో బీఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది.


ఎమ్మెల్యేల జంపింగ్‌లను అడ్డుకునే దిశగా పావులు కదుపుతోంది. ఓవైపు అసెంబ్లీ స్పీకర్‌కు వినతి పత్రాలు ఇస్తూనే.. మరోవైపు, హైకోర్టును, సుప్రీం కోర్టును ఆశ్రయించి ఫిరాయింపులను అడ్డుకోవాలని యోచిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేల్లో భరోసా నింపాలని, వారు సొంత పార్టీలోనే ఉండేలా చర్చలు జరపాలని భావిస్తోంది. ఇందులో భాగంగా, బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోనే ఈ భేటీ జరగనుందని సమాచారం. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఈ వారంలో ఒక రోజు నిర్వహించే ప్రత్యేక సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ విధిగా హాజరు కావాలంటూ గులాబీ బాస్‌ ఫోన్‌ ద్వారా ఆదేశించినట్లు తెలుస్తోంది.


ఈ కారణంగానే విదేశీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తమ పర్యటనను ముందుగానే ముగించుకొని రెండు రోజుల్లో రాష్ట్రానికి వస్తున్నారని విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్‌ ప్రకారం ఆ ఇద్దరు నేతలూ జూలై మొదటి వారం వరకు తమ విదేశీ పర్యటన కొనసాగించాల్సి ఉన్నా.. అధినేత ఆదేశించడంతో ముందే రానున్నట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ విధానం, రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, సభలో అధికార కాంగ్రె్‌సను నిలదీసేందుకు ఏయే అంశాలను లేవనెత్తాలన్న దానిపైనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. కానీ, జంప్‌ జిలానీలకు కళ్లెం వేసేందుకే పార్టీ అధిష్ఠానం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. అలాగే, ఫిరాయింపులపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్‌ అధి నాయకత్వం భావిస్తోంది.


ఇప్పటికే కాంగ్రె్‌సలో చేరిన ముగ్గురితోపాటు తాజాగా బీఆర్‌ఎ్‌సను వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధించాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా, కాంగ్రె్‌సలో చేరకుండా అడ్డుకోవచ్చునని అంచనా వేస్తోంది. ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే అస్త్రంగా చేసుకోవాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రె్‌సలో చేరి మూడు నెలలు పూర్తయిందని, ఈ విషయంలో తమ పార్టీ నేతలు ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ ఏ నిర్ణయమూ తీసుకోలేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.


ఫిరాయింపులు సరికాదు

అధికారంలో ఉన్నామని ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం తగదంటూ ఆ పార్టీపై సోమవారం ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్‌ నీతి లేని వ్యవహారాలపై గతంలో తెలంగాణ ప్రజలు ఆందోళనను ఉద్ధృతం చేశారు. ఆ దెబ్బకు ఆ పార్టీ తలవంచక తప్పలేదు. ఇప్పుడు కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తున్న కాంగ్రె్‌సకు కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు’’అని అన్నారు.


రైల్‌రోకోపై ఎలాంటి పిలుపు ఇవ్వలేదు

  • 2011 నాటి కేసు కొట్టివేయండి.. హైకోర్టులో కేసీఆర్‌ పిటిషన్‌

రైళ్లను నిలిపేయాలని గానీ, రైల్‌ రోకో చేపట్టాలనిగానీ 2011లో తాను ఎలాంటి పిలుపు ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందున పాత కేసుకు ఎలాంటి విలువ లేదని, దాన్ని కొట్టివేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2011 సెప్టెంబరు 15న అప్పటి పొలిటికల్‌ జేఏసీ నాయకులు కేసీఆర్‌, కోదండరాం ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మరో 40 మంది మౌలాలి రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకో నిర్వహించారు. దీంతో కేసీఆర్‌ సహా మరికొందరిపై కేసు నమోదయింది. ఈ కేసుపై ఇటీవలే పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసీఆర్‌ ఎమ్మెల్యే కావడంతో ఈ కేసు సికింద్రాబాద్‌ రైల్వే కోర్టు నుంచి ప్రత్యేక కోర్టు అయిన నాంపల్లి ఎక్సైజ్‌ కోర్టు (మనోరంజన్‌ కాంప్లెక్స్‌)కు బదిలీ అయింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఘటన జరిగి దాదాపు 13 ఏళ్లు కావస్తోందని, ఈ కేసులో ప్రాసిక్యూట్‌ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలిపారు. అప్పటివరకు అన్ని ప్రొసీడింగ్స్‌పై స్టే విధించాలని కోరారు.

Updated Date - Jun 25 , 2024 | 03:27 AM