Warangal: తల్లడిల్లిన బాలింత!
ABN , Publish Date - Oct 24 , 2024 | 03:40 AM
ఆస్పత్రిలో బెడ్ లేక ఓ బాలింత ఆవరణలోని చెట్టు కింద గడపాల్సి వచ్చింది. ఇంక్యుబేటర్‌లో ఉన్న బిడ్డను చూసుకుంటూ వార్డు ఎదుట నేలపై కూర్చొని పడిగాపులు కాయాల్సి వచ్చింది.
అబ్జర్వేషన్ రూమ్‌లో పసికందు..
బెడ్ లేక చెట్టు కింద బాలింత అవస్థలు
వరంగల్ ఎంజీఎంలో ఘటన
వరంగల్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆస్పత్రిలో బెడ్ లేక ఓ బాలింత ఆవరణలోని చెట్టు కింద గడపాల్సి వచ్చింది. ఇంక్యుబేటర్‌లో ఉన్న బిడ్డను చూసుకుంటూ వార్డు ఎదుట నేలపై కూర్చొని పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎంలో చోటుచేసుకుంది. ములుగు జిల్లా ఏటూరునాగరం మండలం ముల్కనపల్లి గ్రామానికి చెందిన మౌనికకు మంగళవారం రాత్రి వాజేడు మండలం పేరూరు పీహెచ్‌సీలో సాధారణ ప్రసవమైంది. పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకొచ్చారు. పరిశీలించిన వైద్యులు శిశువును పిల్లల వార్డులో అడ్మిట్ చేసి, ఇంక్యుబెటర్‌లో ఉంచారు.
అయితే చంటిపాపతో పాటు వచ్చిన తల్లి మౌనికను బెడ్ ఖాళీ లేదని చెప్పి బయటకు పంపించారు. బిడ్డను చూసుకుంటూ వార్డు బయట నేలపైన పడిగాపులు కాసింది. చేసేది లేక చివరకు ఆస్పత్రి ఆవరణలోని చెట్టు కింద తలదాచుకుంది. ప్రసవం అయ్యి 24 గంటలు కూడా గడవముందే ఇలా చెట్టు కింద పడుకొని బాలింత పడిన వేదన అక్కడ ఉన్న వారిని కలిచివేసింది. ఈ విషయమై ఎంజీఎం వైద్యులకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు సమాచారమిచ్చినా డ్యూటీలోని వైద్యులు, సిబ్బంది తమకు తెలియదంటూ దాటవేస్తూ వెళ్లారు. బాలింత అవస్థలు చూడలేక చిన్నపాటి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి తన బెడ్‌ను బాలింతకు ఇచ్చారు. కాగా, వరంగల్ ఎంజీఎంలో బెడ్స్‌తో పాటు ఇతర సౌకర్యాలు కూడా లేవని పలువురు పేర్కొంటున్నారు.