Share News

Ponguleti: పాత పద్ధతులు,పైరవీలు మర్చిపోండి..

ABN , Publish Date - Aug 26 , 2024 | 03:51 AM

ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హెచ్చరించారు.

Ponguleti: పాత పద్ధతులు,పైరవీలు మర్చిపోండి..

  • ప్రభుత్వ లక్ష్యాల కోసం పని చేయండి

  • తప్పు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించం

  • సబ్‌రిజిస్ట్రార్లతో ఇష్టాగోష్ఠిలో పొంగులేటి

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి హెచ్చరించారు. పైరవీలు, పాత పద్ధతులన్నీ మర్చిపోయి, ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయకపోతే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని చెప్పారు. విధి నిర్వహణలో ఇసుమంతైనా అవినీతి కనిపించవద్దని వ్యాఖ్యానించారు. ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు.


‘‘వాళ్లతో, వీళ్లతో చెప్పిస్తూ పైరవీలు చేస్తే ఊరుకునేది లేదు. మీ ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా ఇబ్బందులేమైనా ఉంటే తప్పకుండా మానవతా దృక్కోణంలో పరిశీలిస్తాం’’ అని మాట ఇచ్చారు. అందరూ కష్టపడి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. ‘‘భూముల మార్కెట్‌ ధరలను ప్రాంతాలను బట్టి శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్ధారించండి’’ అని మంత్రి సూచించారు. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర, కర్నాటకలో మెరుగైన పద్ధతులు అనుసరిస్తున్నారని, రెండు బృందాలు వెళ్లి పరిశీలించి రావాలని సూచించారు. భూముల మార్కెట్‌ ధరలను నిర్ధారించిన తర్వాత దశలో మరో ఏజెన్సీతో వాటిని సరిపోల్చుకుంటామని తెలిపారు.


  • రెండేళ్లలో అన్ని రిజిస్ట్రేషన్‌ ఆఫీసులు ప్రభుత్వ భవనాల్లోనే

రెవెన్యూ కార్యాలయాల అద్దె, విద్యుత్‌ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలకు అవసరమైన బడ్జెట్‌ను త్వరలోనే క్లియర్‌ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాలు అవసరమని, రెండేళ్లలో అన్ని కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో పని చేసేలా చూస్తామని చెప్పారు. శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యదర్శి, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కమిషనర్‌ బుద్ధప్రకాశ్‌ జ్యోతి రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు గురించి మంత్రికి వివరించారు. 2014లో రూ.2,746 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం గతేడాది రూ.14,588 కోట్లకు చేరుకుందని తెలిపారు. రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ వార్షిక నివేదికను మంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు. సమావేశంలో అదనపు ఐజీలు, డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్‌లు, సబ్‌ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2024 | 03:51 AM