Share News

Swiggy: స్విగ్గీ ఆర్డర్లలో శాఖాహారమే టాప్‌!

ABN , Publish Date - Aug 01 , 2024 | 03:47 AM

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ద్వారా వినియోగదారులు ఎక్కువగా ఆర్డర్‌ చేసుకునే వంటకాల్లో శాఖాహార వంటకాలే అధికంగా ఉంటున్నాయి.

Swiggy: స్విగ్గీ ఆర్డర్లలో శాఖాహారమే టాప్‌!

  • టాప్‌ టెన్‌ వంటకాల్లో ఆరు వెజిటేరియనే

  • హైదరాబాదీలు మసాలా దోశ, ఇడ్లీ ప్రియులు

  • ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ నివేదిక

హైదరాబాద్‌ సిటీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ద్వారా వినియోగదారులు ఎక్కువగా ఆర్డర్‌ చేసుకునే వంటకాల్లో శాఖాహార వంటకాలే అధికంగా ఉంటున్నాయి. దేశ వ్యాప్తంగా ఉత్తమ శాఖాహార వంటకాలు, వాటిని అందించే రెస్టారెంట్లకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేందుకు గ్రీన్‌ డాట్‌ అవార్డుల పేరిట స్విగ్గీ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా స్విగ్గీకి వచ్చే ఆర్డర్లను విశ్లేషించి ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. స్విగ్గీకి అత్యధిక ఆర్డర్లు వచ్చే టాప్‌-10 వంటకాల్లో మసాలా దోశ, పన్నీర్‌ బటర్‌ మసాలా, మార్గెరిటా పిజ్జా, పావ్‌ బాజీ సహా ఆరు శాఖాహార వంటకాలు ఉన్నాయి.


ఇక, దేశంలో సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో స్విగ్గీకి అత్యధికంగా వెజ్‌ ఆర్డర్డు వస్తున్నాయి. బెంగళూరులో స్విగ్గీకి వచ్చే ప్రతీ మూడు ఆర్డర్లలో ఒకటి శాఖాహారం కోసం ఉంటుంది. బెంగళూరు ప్రజలు మసాలా దోశ, పన్నీర్‌ బిర్యానీ, పన్నీర్‌ బటర్‌ మసాలాను ఎక్కువగా ఆర్డర్‌ చేస్తున్నారు. అత్యధిక వెజ్‌ ఆర్డర్ల జాబితాలో ముంబై రెండో స్థానంలో ఉండగా హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. ముంబై వాసులు దాల్‌ కిచిడి, మార్గెరిటా పిజ్జా, పావ్‌ బాజీ అధికంగా ఆర్డర్‌ చేస్తుండగా.. హైదరాబాదీలు మసాలా దోశ, ఇడ్లీ ఎక్కువగా తెప్పించుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉదయం అల్పాహారం వేళలో ఎక్కువ మంది మసాలా దోశ, వడ, ఇడ్లీ, పొంగల్‌ ఆర్డర్‌ చేస్తున్నారు. మసాలా దోశ కోసమైతే ఉదయం నుంచి రాత్రి భోజనం వరకు ఆర్డర్లు వస్తుంటాయని స్విగ్గీ పేర్కొంది.

Updated Date - Aug 01 , 2024 | 03:47 AM