Share News

Rythu Runa Mafi: ఎల్లుండిలోగా లక్షన్నర..

ABN , Publish Date - Jul 29 , 2024 | 02:47 AM

రైతుల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరు (ఎల్లుండి)లోగా రైతులకు రూ.1.50 లక్షల రుణాలను మాఫీ చేసి, తమ నిబద్ధతను చాటుకుంటామని తెలిపారు.

Rythu Runa Mafi: ఎల్లుండిలోగా  లక్షన్నర..

  • నేను విదేశాల నుంచి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం

  • రైతుల పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటాం

  • అధికారం పోయిన బాధ తండ్రీకొడుకులకు ఇంకా తగ్గలే

  • కేసీఆర్‌, కేటీఆర్‌ మధ్యే సమన్వయం లేదు

  • 2014లో జైపాల్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా

  • ప్రకటించి ఉంటే కాంగ్రెస్‌ గెలిచేది

  • పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును

  • పాస్‌ చేయించడంలో ఆయనదే కీలకపాత్ర

  • అప్పటి స్పీకర్‌ మీరాకుమార్‌ను ఒప్పించారు

  • రూ.10 కోట్లతో కల్వకుర్తికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

  • హైదరాబాద్‌-కల్వకుర్తి మధ్య 4 వరుసల రహదారి

  • కల్వకుర్తిలో జైపాల్‌ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్‌

నాగర్‌కర్నూల్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రైతుల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరు (ఎల్లుండి)లోగా రైతులకు రూ.1.50 లక్షల రుణాలను మాఫీ చేసి, తమ నిబద్ధతను చాటుకుంటామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసి, వారిని ఆదుకోవాలన్నదే కాంగ్రెస్‌ సంకల్పమని స్పష్టం చేశారు. పదేళ్ల పాలనలో తెలంగాణను తెగనమ్ముకున్న ఒక సన్నాసి ఆగస్టులోగా రుణమాఫీ చేయాలని సవాల్‌ విసిరాడని.. తాము జూలైలోనే రూ.లక్ష రుణమాఫీ చేసి 6 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. అధికారం కోల్పోయామన్న బాధ నుంచి తండ్రీకొడుకులు (కేసీఆర్‌, కేటీఆర్‌) ఇంకా తేరుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల కంటే ముందు సూదిని జైపాల్‌రెడ్డిని సీఎంగా ప్రకటించి ఉంటే కాంగ్రె్‌సకు అధికారం దక్కేదని అభిప్రాయపడ్డారు.


కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత సూదిని జైపాల్‌రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో సీఎం రేవంత్‌ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కొట్ర గేటు వద్ద ఏర్పాటు చేసిన జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఈ నెల 31లోగా రూ.లక్షన్నర రుణం నుంచి రైతులకు విముక్తి కల్పించబోతున్నామని ప్రకటించారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు తాను విదేశీ పర్యటనలో ఉంటానని, వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణాలన్నీ మాఫీ అవుతాయని చెప్పారు. ఆ సొమ్ములను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సూదిని జైపాల్‌రెడ్డి లాంటి మహోన్నత వ్యక్తిత్వాలు చాలా అరుదుగా ఉంటాయని సీఎం చెప్పారు. నిజాయతీ గల నేతగా జైపాల్‌రెడ్డి తెలుగుజాతికే వన్నె తెచ్చారన్నారు. రాజకీయ నేతలకు జైపాల్‌రెడ్డి దార్శనికుడని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర అని తెలిపారు.


పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును కొన్ని పక్షాలు వ్యతిరేకించిన సందర్భంలో మూడాఫ్‌ ద హౌస్‌ ప్రకారం బిల్లు పాసయ్యేలా చేయొచ్చని అప్పటి స్పీకర్‌ మీరాకుమార్‌ను ఒప్పించారన్నారు. పార్లమెంటు తలుపులు మూసివేసి, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసి, తెలంగాణ బిల్లు పాసయ్యేలా చేయడంలో జైపాల్‌రెడ్డి ప్రమేయం ఎంతో ఉందని చెప్పారు. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొని, రాజకీయంగా జరిగే నష్టాల గురించి అంచనాలున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో సోనియాగాంధీ చూపిన చొరవ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రె్‌సకు 2014 ఎన్నికల్లో అధికారం దక్కకపోవడానికి ఓ తప్పిదమే కారణమన్నారు. ఎన్నికల కంటే ముందే జైపాల్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే రాష్ట్ర రాజకీయాలు మరోలా ఉండేవన్నారు.


తెలంగాణకు జైపాల్‌రెడ్డే తొలి ముఖ్యమంత్రి అయ్యేవారని రేవంత్‌ చెప్పారు. ఆ ఒక్క తప్పిదం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని తెగనమ్ముకునే పరిస్థితి కేసీఆర్‌ కుటుంబానికి దక్కిందన్నారు. అధికారం కోల్పోయామనే బాధ కేసీఆర్‌, కేటీఆర్‌కు ఇంకా తగ్గలేదని ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్‌ అసెంబ్లీకి రాడు. నేను, నా బావనే అధికార పక్షం అడిగే వాటికి సమాధానం చెబుతామని కేటీఆర్‌ చెప్పాడు. కానీ, బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు 11 గంటలకే కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు’ అని రేవంత్‌ అన్నారు. తండ్రీకొడుకుల మధ్యనే సమన్వయం లేదనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మేడిగడ్డను సందర్శించి కేటీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.


  • నాలుగు వరసల రహదారి..

హైదరాబాద్‌-కల్వకుర్తి మధ్య రహదారిని నాలుగు వరసలుగా విస్తరించనున్నట్లు సీఎం రేవంత్‌ చెప్పారు. శ్రీశైలం వెళ్లే భక్తుల రద్దీ పెరిగినందున.. ఈ రహదారిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మూడు లేన్లుగా ఉన్న ఈ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ విషయమై తాను, మంత్రి కోమటి వెంకటరెడ్డి.. కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఇక కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్‌ మండలంలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.


  • కార్యకర్తలను గెలిపించుకుంటాం..

నాయకుల ఎన్నికలు ముగిశాయని, కార్యకర్తలను గెలిపించుకునే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని సీఎం రేవంత్‌ అన్నారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన కార్యకర్తలను కచ్చితంగా గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. పుట్టిన గడ్డకు తొలిసారి వచ్చిన సీఎం.. కల్వకుర్తిపై వరాల జల్లు కురిపించారు. రూ.10 కోట్లతో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను మంజూరు చేశారు. ఆగస్టు 1 నుంచి పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. తాను చదువుకున్న కల్వకుర్తి మండలంలోని తాండ్రా పాఠశాలకు రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. విగ్రహావిష్కరణ సభకు హాజరైన మంత్రి దామోదర రాజనరసింహ.. జైపాల్‌రెడ్డితో తమ కుటుంబానికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి లాంటి నిబద్ధత కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారన్నారు. 2014లో జైపాల్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సి ఉందని, ఆ లోటును ఇప్పుడు రేవంత్‌రెడ్డి భర్తీ చేశారని చెప్పారు. నల్లమల బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం శుభప్రదమని మరో మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.


  • వృత్తి నైపుణ్య వర్సిటీ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్‌

ఇబ్రహీంపట్నం/కందుకూరు: వృత్తి నైపుణ్య యూనివర్సిటీ ఏర్పాటు కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్కాన్‌పేట వద్ద గుర్తించిన స్థలాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఇక్కడ సర్వే నంబరు 112లోని 57 ఎకరాల ప్రభుత్వ భూమిని వర్సిటీ కోసం అఽధికారులు గుర్తించారు. భూముల పటాన్ని పరిశీలించిన సీఎం, ఉన్నతాఽధికారులకు పలు సూచనలు చేశారు. నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకొని యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీకి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. వర్సిటీ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (కొంగర కలాన్‌) వరకు 200 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు నిధులు వెంటనే విడుదల చేయాలని సూచించారు. కాగా ఈ ప్రాంతంలో ఫార్మా, నాన్‌ ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సీఎం సూచించినట్లు తెలిసింది.


  • స్ఫూర్తి స్థల్‌లో జైపాల్‌కు సీఎం రేవంత్‌ నివాళులు

కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నెక్లె్‌సరోడ్డులోని స్ఫూర్తి స్థల్‌లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సీఎంతో పాటు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో జైపాల్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Updated Date - Jul 29 , 2024 | 07:46 AM