TG NEWS: పెద్దపల్లి కాలేజీలో ఆసక్తికర సన్నివేశం.. తల్లి, కొడుకు ఒకే క్లాస్
ABN, Publish Date - Dec 09 , 2024 | 07:32 AM
తల్లి కొడుకు ఒకే తరగతి గదిలో చదువుకుంటూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంటుంది. ఇంతకు తల్లి కొడుకుతో ఎందుకు చదవాల్సి వస్తోంది.

పెద్దపల్లి జిల్లా: తల్లి కొడుకు ఒకే తరగతి గదిలో చదువుకుంటూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంటుంది. ఇంతకు తల్లి కొడుకుతో ఎందుకు చదవాల్సి వస్తోంది. అమ్మతో తరగతి గదిలో పాఠాలు నేర్చుకుంటున్న కొడుకు ఎలా ఫీలవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారానికి చెందిన గాండ్ల స్వర్ణలత, తన కుమారుడు రోషన్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. వాళ్లిద్దరూ కలిసి పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐలో విద్యను అభ్యసిస్తున్నారు. తల్లి, కొడుకు ఇద్దరు కలిసి కంప్యూటర్స్ ఆపరేటర్ ప్రోగ్రాం అసిస్టెంట్ కోర్సులో చేరారు.
ఈ కోర్సు సంవత్సరం కాల వ్యవధి ఉండగా ఇటీవలే ఈ కోర్సులో స్వర్ణలత, రోషన్ జాయిన్ అయ్యారు. వాస్తవానికి తల్లి స్వర్ణలతకు చదువు అంటే ఎంతో ఇష్టం. కాకపోతే పెళ్లి, కుటుంబ సమస్యలు, ఆర్థిక కారణాలతో చదువును మధ్యలోనే వదిలివేసింది. ప్రస్తుతం భర్త ప్రోత్సాహంతో మళ్లీ చదువుకోవడం ప్రారంభించారు. 38 ఏళ్ల స్వర్ణలత తన 18 ఏళ్ల కొడుకుతో ఒకే తరగతి గదిలో చదువుతుండటం ఆసక్తికరంగా మారింది. పెళ్లికి ముందు స్వర్ణలత ఇంటర్‌మీడియట్ పూర్తి చేశారు. అనంతరం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 2005లో డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేశారు.
అయితే మధ్యలోనే ఆ చదువులను వదిలేసినప్పటికీ 2010, 2011లో డిగ్రీ పూర్తి చేశారు. మధ్యలో ఐదారేళ్ల పాటు స్వయం శక్తి సంఘాల్లో సీఏగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తన కుమారుడు రోషన్ ఐటీఐ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకోగా.. ఆ చదవుపై మక్కువతో స్వర్ణలత కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ కోర్సులో ఆమెకు కూడా పెద్దపల్లి అధికారులు సీటు కల్పించారు. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతో చదువుకుంటున్నానని స్వర్ణలత తెలిపారు. తన తల్లితో కలిసి కాలేజ్‌కు రావడం సంతోషంగా ఉందని కోడుకు రోషన్ చెబుతున్నాడు. చదువులు మధ్యలోనే ఆపేసిన వారు తిరిగి వీళ్లిద్దరూ అందిస్తున్న స్పూర్తితో మళ్లీ మొదలు పెట్టాలని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 09 , 2024 | 07:33 AM