Loans: సబ్సిడీ రుణాలకు రెవెన్యూశాఖ మోకాలడ్డు
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:20 AM
వైసీపీ పాలనలో సబ్సిడీ రుణాలకు దూరమైన వర్గాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశలు చిగురించాయి.

చిత్తూరు అర్బన్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో సబ్సిడీ రుణాలకు దూరమైన వర్గాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశలు చిగురించాయి. రుణాలు లభిస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చనే ఆశతో ఎదురుచూశారు. అనుకున్నట్లుగా బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే రుణాలను తీసుకోవడానికి అవసరమైన కుల, ఆదాయ, నివేశ పత్రాలను మంజూరు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు రెవెన్యూ, మీ- సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
జిల్లాలోని బీసీ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ, ఈబీసీ, కమ్మ, క్షత్రియ, రెడ్డి, వైశ్య, కాపు కార్పొరేషన్లకు కలిపి మొత్తం 2,797 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒంటరి, తెలగ, మేదర కులస్తులకు కలిపి మరో 2,041 యూనిట్లను కేటాయించగా.. మంగళవారం నాటికి 12,650 మంది దరఖాస్తు చేసుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌లో 16 యూనిట్లకు 29 మంది, ఈబీసీలో 103 యూనిట్లకు 237మంది, కమ్మ కార్పొరేషన్‌లో 84యూనిట్లకు 258 మంది, క్షత్రియ కార్పొరేషన్‌లో 13యూనిట్లకు 37 మంది, రెడ్డి కార్పొరేషన్‌లో 75యూనిట్లకు 208 మంది, వైశ్య కార్పొరేషన్‌లో 16యూనిట్లకు 80మంది, కాపు కార్పొరేషన్‌లో 448 యూనిట్లకు 1,119 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 2,797 యూనిట్లకు మంగళవారం నాటికి 14,618 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు రోజుల కిందట కుల, ఆదాయ, నివేశ ధ్రువపత్రాల కోసం జిల్లావ్యాప్తంగా వేలాదిమంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మధ్యలో రెండో శనివారం, ఆదివారం సెలవులు వచ్చాయి. సోమవారం జిల్లావ్యాప్తంగా సర్వర్ పనిచేయకపోవడంతో ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న సెలవులు తాము ఎక్కడ వెనుకబడిపోతామన్న ఆందోళనలో పడ్డారు.
దీనికి తోడు దరఖాస్తులను ప్రాసెస్ చేయాల్సిన సచివాలయం, మీసేవ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సంబంధిత అధికారులు సమావేశాల పేరిట కార్యాలయాలకు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం చివరిరోజు కావడంతో ఎంతమంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటారో చూడాల్సి ఉంది. ప్రభుత్వం దరఖాస్తు తేదీని పొడిగిస్తే మరింతమంది లబ్ధిదారులు ధరఖాస్తు చేసుకునే అవకాశం వుంటుంది.