Share News

Health Mission : పది లక్షల వ్యాక్సిన్లు ఔట్‌!

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:13 AM

రాష్ట్రంలో క్షయ (టీబీ) వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంలేదు.

Health Mission : పది లక్షల వ్యాక్సిన్లు ఔట్‌!

  • ఈ నెలాఖరుకు క్షయ వ్యాక్సిన్లు ఎక్స్‌పైరీ

  • ఏడాది క్రితం మొదలైన పంపిణీ

  • ఇంకా 40% కూడా పూర్తికాని వైనం

  • కేంద్రం పంపిన వ్యాక్సిన్లకు కాలపరిమితి

  • అడల్ట్‌ బీసీజీ వ్యాక్సిన్ల విలువ కోట్లలోనే!

  • ఆరోగ్యశాఖ అధికారుల తీరుతో వృథా

  • వ్యాక్సిన్లు వేశాక కూడా క్షయ లక్షణాలు?

  • వాటి పనితీరుపై సర్వత్రా అనుమానాలు

అమరావతి/గుంటూరు మెడికల్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్షయ (టీబీ) వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధి నివారణకు రూ.కోట్లు చేస్తున్నాయి. క్షయ సెంటర్ల ద్వారా ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నాయి. అయినా...కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేకపోతోంది. రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన వారికి క్షయ సోకకుండా కేంద్ర ప్రభుత్వం అడల్ట్‌ బీసీజీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ వ్యాక్సిన్‌ సరఫరా చేసి వృద్ధుల్లో క్షయ నివారణకు ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా మన రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వ్యాక్సిన్‌ డోస్‌లను నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా ఏపీకి పంపించింది. గత ఏడాది మే నెల నుంచి ఈ వ్యాక్సిన్‌ వేయడం ప్రారంభించారు. అయినా, ఇప్పటి వరకూ 40 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయారు. టీబీతో బాధపడుతున్న వ్యక్తితోపాటు ఆయన కుటుంబ సభ్యులకు, ఆ ఇంటి చుట్టూ ఉన్న వారికి కూడా వ్యాక్సిన్‌ ఇవ్వాలి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ పట్ల అప్పట్లో ఏర్పడిన నెగిటివ్‌ ప్రచారం వల్ల వీరిలో కొంతమంది అడల్ట్‌ బీసీజీ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకురావడం లేదు. అలాంటివారిని గుర్తించి అవగాహన కలిగించడంలో రాష్ట్ర ఆరోగ్యశాఖలోని కొందరు అధికారులు వైఫల్యం చెందుతున్నారు. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీ అనుకున్నంత చురుగ్గా జరగడం లేదని ఆరోగ్యశాఖ వర్గాలే చెబుతున్నాయి.


కొరవడిన సమన్వయం

కేంద్రం నుంచి రాష్ట్రానికి మొత్తం 70 లక్షల అడల్ట్‌ బీసీజీ వ్యాక్సిన్లు అందాయి. అందులో 30 లక్షలు అనంతర కాలంలో తమిళనాడుకు పంపించారు. ఇక మిగిలిన 40 లక్షల వ్యాక్సిన్లలో 24 లక్షలు ఉపయోగించారు. ఇక మిగిలింది 16 లక్షలు. అందులో పది లక్షల వ్యాక్సిన్ల కాల పరిమితి ఈ నెల 28వ తేదీతో ముగుస్తోంది. ముందుగా నిర్దేశించుకున్న దానికి ప్రకారం వ్యాక్సిన్‌ వేయలేకపోవడంతో తలెత్తిన సమస్య ఇది. దీనిపై ఏం చేయాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ వ్యాక్సిన్ల విలువ రూ. కోట్లలో ఉంటుంది. కొంత డబ్బుల ద్వారా, కొంత కైండ్‌ గ్రాంట్‌ కింద... ఇలా వివిధ మార్గాల్లో కేంద్రం సహకరిస్తోంది. ఇందులో.. మందులు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు కైండ్‌ గ్రాంట్‌ కింద అందిస్తోంది. ఎక్స్‌పైరీ అవుతున్న వ్యాక్సిన్‌ విలువ కైండ్‌ గ్రాంట్‌ కింద చూపించి ఆ మేరకు నిధులకు కేంద్రం కోత పెడుతుందా? లేక ఎక్స్‌పైరీ వ్యాక్సిన్ల స్థానంలో కొత్తవి అందిస్తుందా అనేది చూడాలి. రాష్ట్ర ఆరోగ్యశాఖలోని కొందరి అధికారుల నిర్వాకంతో సకాలంలో వ్యాక్సిన్లు వేయలేకపోతున్నారు. దీనిపై కేంద్రంతో సమన్వయం చేసుకోవడంలోనూ విఫలమవుతున్నారు.


వ్యాక్సిన్‌ పని చేస్తున్నదా?

మన రాష్ట్రంలో ప్రస్తుతం 76,590 మంది క్షయవ్యాధికి చికిత్స పొందుతున్నారు. టీబీ వ్యాధి సోకకుండా ముందస్తుగా కాపాడేందుకు అడల్ట్‌ బీజీసీ వ్యాక్సిన్లు ఇవ్వాలని కేంద్రం నిర్దేశించింది. అయితే, ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా కొందరిలో క్షయ లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో వ్యాక్సిన్‌ పనితీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల గుంటూరులో ఈ తరహా కేసులు వెలుగు చూడటం చర్చనీయాంశంగా మారింది. వీరిలో క్షయ లక్షణాలు వ్యాక్సిన్‌ వేయకముందే ఉన్నాయా? లేక వ్యాక్సిన్‌ వేసిన చాలా కాలానికి తలెత్తాయా అనేది చెప్పాల్సింది రాష్ట్ర ఆరోగ్యశాఖ. కానీ, ఈ శాఖలోని కొందరు అధికారులు దీనిపై నిర్లక్ష్యంగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మా దృష్టికి రాలేదు

‘‘అడల్ట్‌ బీసీజీ వ్యాక్సిన్ల కాలపరిమితి ముగుస్తున్న సమాచారం మా దృష్టికి రాలేదు. కొవిడ్‌ వ్యాక్సిన్‌పై వచ్చిన ప్రతికూల ప్రచారం ఈ వ్యాక్సిన్ల పంపిణీపై ప్రభావం చూపుతోంది. వ్యాక్సిన్‌ చేసుకోవడానికి కొంత మంది సుముఖత చూపడం లేదు. దీని వల్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో జాప్యం జరుగుతోంది’’

- ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌

Updated Date - Feb 24 , 2025 | 04:13 AM