Share News

AP Govt : నిషేధ భూములకు విముక్తి

ABN , Publish Date - Feb 08 , 2025 | 02:49 AM

ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని ప్రైవేటు భూములకు విముక్తి కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు రెవెన్యూ శాఖ...

AP Govt :  నిషేధ భూములకు విముక్తి

  • 22(ఏ) నుంచి 38 వేల ఎకరాల ప్రైవేటు భూములకు స్వేచ్ఛ!

  • జగన్‌ హయాంలో సామాన్య రైతుల భూములకు చెర

  • ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా వికృత క్రీడ

  • కూటమి సర్కారు వచ్చాక వేలాది ఫిర్యాదులు

  • ఆ జాబితా నుంచి తొలగించాలని సీఎం నిర్ణయం

  • ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని ప్రైవేటు భూములు 22ఏ నుంచి బయటకు

  • కసరత్తు మొదలు పెట్టిన రెవెన్యూ శాఖ

గత జగన్‌ సర్కారులో కన్నుపడ్డ భూములను అధికార పార్టీ నేతలు చెరపట్టారు. చేజిక్కించుకోవడం వీలుకాని భూములపై ‘నిషేధం’ విధించారు. చట్టాన్ని ఉపయోగించి నిషేధిత జాబితా 22(ఏ)లో చేర్పించారు. ఇలా పదులో, వందలో కాదు.. 38 వేల ఎకరాలపైనే ప్రైవేటు భూములను జాబితాలో చేర్పించారు. నాడు సామాన్యులు, రైతులు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలే బాధితులు.

బాధితుల కష్టాలను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేనివి, అన్యాయంగా 22(ఏ)లో చేర్చిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నాడు వైసీపీ నేతల దౌర్జన్యం, ఒత్తిళ్లతో అన్యాయంగా నిషేధిత జాబితాలోకి చేర్చిన భూములను విడిపించాలన్న ప్రజల డిమాండ్లపై కూటమి సర్కారు సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని ప్రైవేటు భూములకు విముక్తి కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌పీ సిసోడియాను ఆదేశించినట్లు తెలిసింది. అన్యాయంగా నిషేధిత జాబితాలో చేర్చిన దాదాపు 38 వేల ఎకరాల ప్రైవేటు భూములను చట్టప్రకారం 22(ఏ) నుంచి బయటపడేయటానికి రెవెన్యూశాఖ కసరత్తు మొదలు పెట్టింది. త్వరలో దీనిపై ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే వేలాది రైతుల భూములు నిషేధిత జాబితా నుంచి విముక్తి పొందనున్నాయి.


వేలాది ఫిర్యాదులు

రైతులు ప్రాణసమానంగా భావించే భూములను సర్కారే చెరపడితే? వాటిని నిషేధిత జాబితాలో చేరిస్తే? రైతుల పరిస్థితి ఏమిటి? న్యాయం పోరాటం చేయగల స్థోమత ఉన్నవారు కోర్టులకెళతారు. శక్తి లేని వారయితే రాజకీయంగా దారిలోకి వస్తారు. గత జగన్‌ ప్రభుత్వంలో జరిగిన భూ కక్ష ఇదే. ‘భూములను కాపాడుతాం. వాటికి శాశ్వత హక్కు కల్పిస్తాం. ఇదే జగనన్న భూరక్ష పథకం’ అంటూ ఆర్భాటం చేసిన వైసీపీ సర్కారులో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. నాడు వైసీపీ నేతలే అనధికారిక రెవెన్యూ పెద్దలుగా చెలామణి కావడంతో ప్రైవేటు భూములు సైతం నిషేధిత జాబితాలో చేర్చారు. ఏకంగా 38 వేల ఎకరాలను 22(ఏ) జాబితాలో చేర్పించారు. జగన్‌ సర్కారు ఘోర పరాజయానికి ఇది కూడా ప్రధాన కారణం. కూటమి ప్రభుత్వం వచ్చాక వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యను నిశితంగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కారానికి చర్యలు చేపట్టారు.


జగన్‌ జమానాలో వైసీపీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22 (ఏ)1(ఏ) సెక్షన్‌ను అడ్డగోలుగా వాడుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో మాట వినని సామాన్యులు, రాజకీయ ప్రత్యర్థులు, ఇతర పార్టీల కార్యకర్తలను అదిరించి, బెదిరించి లొంగదీసుకునేందుకు నిషేధిత జాబితాను దుర్వినియోగం చేశారు. జగన న్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పేరిట సర్కారు భూముల సర్వే చేసింది. సర్వే అనంతరం భూముల రికార్డులు, సరిహద్దులు, ఇతర వివరాలు మారిపోయాయి. దీన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు తమకు గిట్టనివారి భూములను అన్యాయంగా నిషేఽధిత జాబితాలో పెట్టించి వేధించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 38 వేల ఎకరాల భూమిని 22(ఏ)1(ఏ)లో చేర్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూముల సమస్యలపై ఇటు రెవెన్యూ శాఖకు, అటు రాజకీయ పార్టీలకు వచ్చిన ఫిర్యాదుల్లో నిషేధిత జాబితాకు సంబంధించినవే. ఈ ఫిర్యాదుల మేరకు భూముల డేటా పరిశీలించగా, ఎక్కువగా 90 శాతం ప్రైవేటు భూములను నిషేధిత జాబితా అందులోనూ ఈ కేటగిరిలో చేర్చినవే ఉన్నాయి. నిజానికి ప్రభుత్వ ఆసక్తి ఉన్న భూములంటే.. సరిహద్దు, యాజమాన్య హక్కు, ఇతర లావాదేవీల కారణంగా వివాదం ఉన్న భూములు.


వీటిపై క్రయ, విక్రయాలను నిషేధించేందుకే ఈ కేటగిరిలో చేరుస్తారు. ఇందులో ప్రైవేటు భూములు అందులోనూ పట్టాలున్నవి అసలు చేర్చడానికే వీల్లేదు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులకు ఇది తెలియని విషయం కాదు. అయినా వైసీపీ నేతల ఒత్తిళ్లతో సామాన్యుల భూములను అక్రమంగా, అన్యాయంగా నిషేధిత జాబితాలో చేర్చారు. ఇదీ 22(ఏ) ఉద్దేశం (బాక్స్‌లో) రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చట్టం-1908 అమల్లో ఉంది. దీంట్లో 22(ఏ)1(ఏ) అనే సెక్షన్‌ ఉంది. దీన్నే రెవెన్యూ పరిభాషలో నిషేఽధిత జాబితా అంటారు. ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థల భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు నిషేఽధిత జాబితాలో చేరుస్తారు. ఒక్కసారి ఈ జాబితాలో చేర్చిన భూమి ఇక రిజిస్ట్రేషన్‌ కాదు. కాబట్టి ఎవరూ 22(ఏ)లో ఉన్న భూములను కొని రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి అనుబంధ సంస్థల సొంత భూములు, వాటి ప్రయోజనాలతో సంబంధం ఉన్న భూములను 22(ఏ)(1)లో చేరుస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..

Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం

Updated Date - Feb 08 , 2025 | 02:49 AM