Share News

CM Chandrababu: రాష్ట్రానికి నిధులే లక్ష్యం.. కేంద్రంలో కీలక వ్యక్తితో సీఎం చంద్రబాబు భేటీ

ABN , Publish Date - Feb 03 , 2025 | 01:25 PM

CM Chandrababu:ఢిల్లీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి కావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగడియాతో భేటీ అయ్యారు. ఏపీ పరిస్థితి గురించి ప్రజంటేషన్‌ ఇచ్చారు.

CM Chandrababu: రాష్ట్రానికి నిధులే లక్ష్యం.. కేంద్రంలో కీలక వ్యక్తితో సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(సోమవారం) 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగడియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు రెండు గంటలపాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తొలుత 45 నిమిషాల అనుకున్న భేటీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్ల పరిణామాలు, ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యలపై రెండు గంటల పాటు చర్చ జరిగింది. ఏపీ ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్ల వైసీపీ దుష్పరిపాలన, పలు రంగాల వారీగా జరిగిన నష్టంపై 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజంటేషన్‌ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏపీ తక్కువ జీడీపీ ఉండటం, దానికి గల కారణాలపై కూడా ప్రజంటేషన్‌లో వివరించారు. ఇటీవల నీతి ఆయోగ్‌ ఇచ్చిన ఆర్థిక ఆరోగ్య నివేదికలో ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి గురించి చెప్పిందని, రాష్ట్రం అప్పు తిరిగి చెల్లించే స్థితిలో లేదని నివేదించిందని చంద్రబాబు గుర్తుచేశారు.


ఏపీ చాలా నష్ట పోయింది..

2014-19 మధ్య అభివృద్ధికి, ఆ తర్వాత ఐదేళ్లలో చోటు చేసుకున్న దుష్పరిపాలనతో పొంతన లేకుండా పోయిందని, రాష్ట్రం చాలా నష్ట పోయిందని ప్రజంటేషన్‌లో చంద్రబాబు తెలిపారు. 2019-24 మధ్య జరిగిన ఆర్థిక విధ్వంసంపై ప్రత్యేకంగా ప్రజంటేషన్‌లో సీఎం చంద్రబాబు వివరించారు. దీని కారణంగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చూపుతున్న ప్రభావం గురించి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు వివరించారు. గత ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పులు తీసుకువచ్చారని, దానికి తోడు మరో రూ. లక్షన్నర కోట్లకు పైగా... పెండింగ్‌ బిల్లులు పెట్టిపోయారని చంద్రబాబు తెలిపారు. ఈ పరిణామాల నుంచి రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రజంటేషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. పోర్టులు, లాజిస్టిక్‌ పార్కులు, పరిశ్రమలు వచ్చేందుకు అనువైన వాతావరణాన్ని ఎలా తయారు చేస్తోంది. పోర్టు ఆధారిత అభివృద్ధికి ఉన్న మార్గాలపై కూడా వివరించి అందుకు సహకరించాలని కోరారు.


ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేలా చర్యలు..

పోర్టు ఆధారిత, పరిశ్రమల ఆధారిత అభివృద్ధి ఎలా చేయాలన్న దానిపై ఇరువురు నేతలు కీలకంగా చర్చించారు. డీప్‌ టెక్నాలజీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ ఎనర్జీ, ఏఐకు సంబంధించిన విషయాలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలపై ప్రజంటేషన్‌లో సవివరంగా సీఎం చంద్రబాబు చెప్పారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తూనే... అన్ని అంశాల్లో ఆర్ధిక సంఘం కూడా తగిన సహకారం ఇవ్వాలని కోరారు. ప్రజంటేషన్‌ అనంతరం చాలా అంశాలపై చంద్రబాబు, అరవింద్‌ పనగడియా చర్చించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థలను బలోపేతం దిశగా తీసుకువెళ్లడంలో చంద్రబాబు తీసుకున్న చర్యల గురించి అరవింద్‌ పనగడియా ప్రస్తావించారు.


పోర్టుల ద్వారానే ఎక్కువ ఆదాయం..

ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలు పోర్టుల ద్వారానే ఎక్కువ ఆదాయం సాధిస్తున్నారని, తెలంగాణ మాత్రమే అందుకు భిన్నంగా ఉందని ఇరువురి మధ్య చర్చించారు. తెలంగాణ కూడా ఎక్కువగా హైదరాబాద్‌ ఆధారంగానే అభివృద్ధి పథంలో ఉందని, గతంలో చేపట్టిన చర్యలు హైదరాబాద్‌ను ప్రపంచానికి అనుసంధానం చేశాయని పనగడియా పేర్కొన్నారు. బిల్‌ గేట్స్ హైదరాబాద్‌ రావడం, దాని కొనసాగింపుగా.. చాలా ప్రపంచ సంస్థలు ఎలా హైదరాబాద్‌కు అనుసంధానం అయ్యాయన్న విషయాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్ధిక వ్యవహారాల్లో గుజరాత్‌, మహారాష్ట్ర మోడల్స్‌తో పాటు సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రయోగంలో హైదరాబాద్‌ మోడల్‌ ఎలా విజయవంతం అయిందో ఇరువురి మధ్య చర్చ జరిగింది. వీటితో పాటు 2014-19 మధ్య స్వచ్ఛ భారత్‌, డిజిటల్‌ కరెన్సీ వంటి విషయాల్లో చంద్రబాబు ఇచ్చిన నివేదికలు, ప్రస్తుతం వాటి ఫలితాలను చర్చ సందర్భంగా అరవింద్‌ పనగడియా ప్రస్తావించారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్

AP News: ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 03 , 2025 | 01:47 PM