Share News

Revenue Department : భూమికి 'భంధనాలు' !

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:19 AM

‘ఫ్రీ హోల్డ్‌’ భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీలపై కూటమి సర్కారు నిషేధం విధించింది. నెలలు గడుస్తునప్పటికీ ఈ నిషేధం కొనసాగుతూనే ఉంది.

Revenue Department : భూమికి  'భంధనాలు' !

  • సామాన్యుల భూములకూ లభించని విముక్తి

  • జగన్‌ హయాంలో అడ్డగోలుగా ‘ఫ్రీ హోల్డ్‌’

  • నిషేధిత జాబితా నుంచి ఎడాపెడా తొలగింపు

  • మూకుమ్మడి దరఖాస్తులతో భూములు స్వాహా

  • అసైన్డ్‌ చట్ట సవరణతోనూ అదే దందా

  • కూటమి సర్కారు రాగానే విచారణ

  • నేడు చిన్న రైతుల భూమికీ చిక్కులు

  • 7 నెలలుగా ఏటూ తేల్చని రెవెన్యూశాఖ

  • రిజిస్ట్రేషన్‌లు నిలిచిపోయి నానా తిప్పలు

  • సాగదీత సరికాదంటున్న నిపుణులు

జగన్‌ హయాంలో గంపగుత్తగా వందలకొద్దీ దరఖాస్తులు ఇచ్చేసి వేల ఎకరాలను నిషేధ జాబితా నుంచి తొలగించారు. ఇదో భారీ భూదందా! కూటమి సర్కారు వచ్చాక... ఆ భూములపై లావాదేవీలు నిలిపివేసింది. విచారణకు ఆదేశించింది. అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే! ఈ క్రమంలో.. సామాన్యులకు చెందిన ఎకరం, అరెకరం కూడా బంధనాల్లో ఇరుక్కున్నాయి.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

జగన్‌ హయాంలో అడ్డగోలుగా సాగిన ‘నిషేధ భూముల’ విముక్తి ఇప్పుడు చిన్న, సన్నకారు రైతులకూ కష్టం తెచ్చిపెట్టింది. జరిగిన అక్రమాలను సరిదిద్దే క్రమంలో... ‘ఫ్రీ హోల్డ్‌’ భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీలపై కూటమి సర్కారు నిషేధం విధించింది. నెలలు గడుస్తునప్పటికీ ఈ నిషేధం కొనసాగుతూనే ఉంది. దీంతో... సామాన్య రైతులూ ఇక్కట్లు పడుతున్నారు. రెవెన్యూ శాఖలో ‘చుక్కల భూములు’ (22ఏ జాబితాలో ఉన్నవి) ఓ ఎడతెగని సమస్య! అసైన్డ్‌ భూములతోపాటు ప్రభుత్వ భూములు, అనుమానాస్పద భూములను ఈ జాబితాలో చేర్చుతారు. భూములను నిషేధ జాబితా నుంచి తొలగించేందుకు నిర్దిష్ట విధానాన్ని అనుసరించాలి.


జగన్‌ హయాంలో భూములు భోంచేసేందుకు ‘నిషేధ జాబితా’ను కూడా వాడుకున్నారు. పదులు, వందల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించేసి... భారీ స్థాయిలో నిషేధ భూములను సొంతం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా పరిశీలన చేసి... భూములను ‘ఫ్రీ హోల్డ్‌’ చేశారు. ఇక... 2023లో ఏపీ అసైన్‌మెంట్‌ భూముల చట్టానికి కూడా జగన్‌ సవరణ చేశారు. అసైన్‌ చేసిన 20 ఏళ్ల తర్వాత వాటికి శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తూ జీవో 596ను ఇచ్చారు. దీని ప్రకారం ఏకంగా 9 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను ఫ్రీ హోల్డ్‌ చేశారు. ఇందులో 20 ఏళ్ల గడువు పూర్తికాని భూములనూ చేర్చారు. నాటి ప్రభుత్వంలో కీలక నేత లు, కొందరు అధికారులు భారీగా భూములు కొన్నా రు. ఓ యజ్ఞంలా భూములను ఫ్రీహోల్డ్‌ చేయించారు.

కూటమి వచ్చాక..

కూటమి ప్రభుత్వం వచ్చాక ‘ఫ్రీ హోల్డ్‌’పై విచారణకు ఆదేశించింది. ఆ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. అంటే... అవన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్లినట్లే! రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ కలెక్టర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విచారణ చేయించారు. మూడు నెలల్లో విచారణ పూర్తిచేయాలని తొలుత ఆదేశించారు. గతేడాది నవంబరు నెలాఖరుకే ఈ విచారణ ముగిసింది. సగటున ఐదు లక్షల ఎకరాలను జీవో 596కి విరుద్ధంగా ఫ్రీ హోల్డ్‌ చే శారని, 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేశారని విచారణాధికారులు తేల్చారు. కానీ, అక్రమాలకు బాధ్యులెవరో రెవెన్యూశాఖ తేల్చలేదు. దీంతో అక్రమాలపై స్పష్టత లేకుండా పోయింది. నిజానికి అక్రమాలకు బాధ్యులెవరో గుర్తించడం రెవెన్యూశాఖకు కష్టమైన పనికాదు. కానీ రెవెన్యూ శాఖ ఈ విషయంలో నోరువిప్పడం లేదు. జగన్‌ హయాంలో జరిగిన అక్రమాలను సరిదిద్దాల్సిందే. భూముల దొంగల భరతం పట్టాల్సిందే. అయితే... అప్పట్లో ‘ఫ్రీ హోల్డ్‌’ చేసిన భూముల్లో సామాన్య రైతులవీ ఉన్నాయి. కూటమి సర్కారు నిర్ణయం కారణంగా ఇప్పుడు వారి భూముల రిజిస్ట్రేషన్లూ ఆగిపోయాయి.


విచారణ సందర్భంగా తొలుత మూడు నెలలే ఫ్రీ హోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు ఉండవని ప్రభుత్వం పేర్కొంది. కానీ, ఆ తర్వాత సెప్టెంబరులో ఒకసారి, అక్టోబరులో మరోసారి గడువు పెంచారు. నవంబరు, డిసెంబరులోనూ ఇలానే చేశారు. ఇప్పుడు ఏకంగా మరో మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లకు బ్రేకులు వేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి అక్రమాలను గుర్తించడం కోసమే రిజిస్ట్రేషన్లు ఆపారు. అధికారుల విచారణలో జీవో 596 ఉల్లంఘనలు బయటకొచ్చాయి. ఏ భూములను నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించారో తేటతెల్లమైంది. వాటి వరకు రిజిస్ట్రేషన్‌లు నిలిపేయవచ్చు. కానీ, ఆ పనిచేయకుండా అందరికీ ఇబ్బంది కలిగేలా భూములన్నింటి రిజిస్ట్రేషన్‌ నిలిపివేయడంతో చిన్నకారు రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికైనా సరిదిద్దాలి!

‘‘అక్రమాలు కనిపెట్టేందుకు రెవెన్యూశాఖకు ప్రభుత్వం 3నెలల గడువు ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌లు నిలిపివేసింది. 7 నెలలవుతున్నా ఈ ప్రక్రియను కొలిక్కి తీసుకురాలేదు. రిజిస్ట్రేషన్ల నిలిపివేత గడువును పొడిగించడం సరికాదు. ఇది చిన్నకారు రైతులకు ఇబ్బంది. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే ఓ నిర్ణయం తీసుకోవాలి’’

- రామయ్య, రెవెన్యూ నిపుణుడు


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 03:27 AM