Share News

Vamsi Arrest: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ నేతలు ఏం అన్నారంటే..

ABN , Publish Date - Feb 13 , 2025 | 01:44 PM

Vamsi Arrest: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. వంశీ పాపం పండిందని నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టిన బాధితులు ధైర్యంగా బయటకు వస్తున్నారని టీడీపీ నేతలు అన్నారు.

 Vamsi Arrest: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై టీడీపీ నేతలు ఏం అన్నారంటే..
Vallabhaneni Vamsi Arrest

అమరావతి, ఫిబ్రవరి 13: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పాపం పండింది అని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ముందుగా నోరు పారేసుకుంది వంశీ అని టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అక్రమ కేసులు, దాడులు, కబ్జాలు, సెటిల్‌మెంట్లతో ప్రజలకు వంశీ అనుచరులు నరకం చూపించారని పోలీసులు చెబుతున్నారు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి వాహనాలు దగ్ధం, టీడీపీ కార్యకర్తలపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా వంశీ ఉన్నారు. నాటి అధికారంతో బాధితులైన టీడీపీ కార్యకర్తలు, నేతలపైనే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు పెట్టి వంశీ అరెస్టు చేయించారని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టిన బాధితులు ధైర్యంగా బయటకు వస్తున్నారని అన్నారు.


పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో వంశీ ముందస్తు బెయిల్ పొందాడని అంటున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటికే కొందరు అరెస్టు, రిమాండ్‌లో ఉన్నారని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. తనపై కేసు పెట్టిన వారిని భయపెట్టి కేసే లేకుండా చేయాలని కొద్దిరోజులుగా వంశీ కుట్ర పన్నాడని టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారు సత్యవర్థన్‌ను కిడ్నాప్, దాడి చేసి కేసు వెనక్కు తీసుకునేలా పన్నాగం పన్నాడని టీడీపీ నేతలు తెలిపారు. తనపై కేసే లేకుండా చేయాలనే కుట్రతో....కొత్త కేసులో మాజీ ఎమ్మెల్యే వంశీ ఇరుకున్నాడని చెప్పారు. పోలీసుల అభయంతో వాస్తవాలను ఫిర్యాదు దారుడు సత్యవర్థన్ బయటపెట్టాడని... సాక్ష్యాలు, ఆధారాలు పక్కాగా సేకరించి వంశీని దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారని టీడీపీ నేతలు తెలిపారు. కిడ్నాప్, అట్రాసిటీ కేసులో నేడు వంశీని దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారని అన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా రిమాండ్ ఖాయమని విచారణాధికారులు అంటున్నారు. నాడు వంశీ చర్యల వల్లనే తమ పార్టీ, ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నాయనే అభిప్రాయంలో వైసీపీ ముఖ్యనాయకులు ఉన్నారు.


వల్లభనేని వంశీ ఓ విధ్వంసకారుడు: కొనకళ్ల నారాయణరావు

konakalla.jpg

కృష్ణాజిల్లా, (మచిలీపట్నం): వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ విధ్వంసకారుడని ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు అన్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్‌పై స్పందించారు. ఇవాళ(గురువారం) టీడీపీ కార్యాలయంలో కొనకళ్ల నారాయణరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ... 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ దాడి చేయించి విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. అనేక మంది టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించి వేధించారని అన్నారు.


టీడీపీ కార్యాలయంపై ఆయనే దాడి చేయించి టీడీపీ నేతలను అరెస్ట్ చేయించారని చెప్పారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ మహిళా నేతలను కూడా జైలుకు పంపించారని మండిపడ్డారు. గన్నవరంలో వంశీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావని చెప్పుకొచ్చారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి కొన్ని వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. వల్లభనేని వంశీపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించాడని ధ్వజమెత్తారు. సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు.


వంశీ గత చరిత్ర అంతా నేర మయం: ప్రణవ్ గోపాల్

Pranav-Gopal.jpg

విశాఖపట్నం: ఒక నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరో నేరానికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్పడ్డారని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ చెప్పారు.వంశీ గత చరిత్ర అంతా నేర మయమని ఆరోపించారు. జగన్ గ్యాంగ్‌లో చేరి అనేక అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. దళిత యువకుడు సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీ అరెస్టు జరిగిందన్నారు. ఈ అరెస్టును ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ప్రణవ్ గోపాల్ చెప్పారు.


వేట మొదలైంది: నాదెండ్ల బ్రహ్మం

వల్లభనేని వంశీ లాంటి వారిని వేటాడే ఆట మొదలైందని టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం తెలిపారు. వంశీ , దేవినేని అవినాష్ , కొడాలి నాని చీడపురుగులు అని విమర్శించారు. కన్నతల్లి లాంటి పార్టీ కార్యాలయంపై దుర్మార్గులు దాడి చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వంశీకి తగిన శాస్తి జరిగిందని చెప్పారు. వంశీ అరెస్టుతో కూటమికి ఓటేసిన ప్రజలంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈరోజు నుంచి తెలుస్తుందని చెప్పారు. వంశీ, వంశీ అనుచరులు తన ఇంటిపైన దాడికి వచ్చిన సందర్భంలో ఆనాడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని నాదెండ్ల బ్రహ్మం కోరారు.


వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు

ఎన్టీఆర్ జిల్లా( నందిగామ): నందిగామ వై జంక్షన్ వల్లభనేని వంశీ మోహన్ భార్యను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె వద్ద సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను హైదరాబాద్‌కు పోలీసులు తరలిస్తున్నారు. వల్లభనేని వంశీ భార్యతో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. జగ్గయ్యపేట, నందిగామ, రూరల్ సీఐలు వంశీ మోహన్ భార్య ప్రయాణిస్తున్న త్రిబుల్ త్రి నెంబర్ కారును అడ్డుకున్నారు. వంశీతోపాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆమె బయలుదేరారు. ఆమెను నందిగామ వద్ద అడ్డుకుని వెనక్కు పోలీసులు పంపించారు. వంశీ కాన్వాయ్ ఇబ్రహీంపట్నం రింగ్ దాటింది. విజయవాడ వైపునకు విజయవాడ పోలీసులు వంశీను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం గొల్లపూడికి పోలీసులు తీసుకువచ్చారు. మరికాసేపట్లో వల్లభనేని వంశీని పడమట పోలీస్ స్టేషన్ వద్దకు పోలీసులు తీసుకురానున్నారు. ఇప్పటికే పడమట పోలీస్ స్టేషన్‌కు స్పెషల్ పార్టీ పోలీసులు, ఎస్ బీ, ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు చేరుకున్నారు. పడమట పోలీస్ స్టేషన్ ఇరువైపులా బార్ గేట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ, సీఐలు పోలీసులు మూడు గంటల నుంచి పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సీఐడీ కస్టడీలో వంశీ ప్రధాన అనుచరులు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అప్పు కట్టలేదని ఏం చేశారంటే..

ఉచితం.. అనుచితం

మృతదేహం జాడ దొరకలేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 13 , 2025 | 03:21 PM