MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అస్వస్థత
ABN , Publish Date - Feb 06 , 2025 | 07:24 AM
MP Magunta Srinivasulu Reddy: ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అస్వస్థతతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయనకు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అభిమానులు, పార్టీలనేతలకు ఈ సమాచారం తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.

ప్రకాశం : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హార్ట్ బైపాస్ సర్జరీకి చెన్నై అపోలో హాస్పటల్ వైద్యులు సిఫార్సు చేశారు. ఇవాళ(గురువారం) ఎంపీ మాగుంటకు డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయనున్నారు. అంతా సాఫీగా జరిగిపోతుందని అభిమానులకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీడియో విడుదల చేశారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని అభిమానులకు తెలిపారు.
ఆందోళన చెందొద్దు...
‘‘ఈ మధ్య కొన్ని రోజుల క్రితం నా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు నాకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి బాగా ఉండాలంటే హార్ట్ బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో పిబ్రవరి 6వ తేదీన చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో హార్ట్ ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆపరేషన్ సక్రమంగా జరుగుతుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. ఇందువల్ల ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు అందజేయడానికి వీలు ఉంటుందని వైద్యులు వెల్లడించారు. ఆరోగ్య రీత్యా ఆపరేషన్ చేయించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఇవాళ చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో నాకు ఆపరేషన్ చేస్తారు. మీ అందరి , భగవంతుని ఆశీస్సులతో ఆపరేషన్ సక్రమంగా జరిగి ప్రజలకు ఇంకా సేవలు కొనసాగించేందుకు మెరుగుబడిన ఆరోగ్యంతో తక్కువ రోజుల్లోనే నేను ఒంగోలుకు వచ్చి మీ అందరిని కలుసుకొంటాను’’ అని మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.
ఏపీ నుంచి సీనియర్ ఎంపీగా..
కాగా.. ఆయన ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు (1998, 2004, 2009, 2019, 2024)ల్లో ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు ఆయన ఏపీ నుంచి సీనియర్ ఎంపీగా ఉన్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేశారు.1998, 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున శాసనమండలి సభ్యునిగా మాగుంట శ్రీనువాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 మార్చి16న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2024 ఫిబ్రవరి 28న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మార్చి 16న తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటి చేసి గెలుపొందారు.
ఈ వార్తలు కూడా చదవండి
ABN ఎఫెక్ట్ : ‘అక్షరమే ఆయుధంగా - పరిష్కారమే అజెండా’కు అనూహ్య స్పందన
Government Hospitals: రోగుల సంతృప్తే ప్రధానం
Read Latest AP News and Telugu News