Share News

Revenue Minister : త్వరలో ‘22ఏ’పై నిషేధం ఎత్తివేత

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:10 AM

రాష్ట్రవ్యాప్తంగా 22ఏ జాబితాలో ఉన్న పేదల భూములపై నిషేధం ఎత్తివేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు.

Revenue Minister : త్వరలో ‘22ఏ’పై నిషేధం ఎత్తివేత

  • పేదల ఇళ్ల పట్టాలు, భూములకే విముక్తి

  • 22ఏ జాబితాలో 1.88 కోట్ల ఎకరాలు

  • దేవదాయ, ప్రభుత్వ భూములు పోనూ పేదలకు అసైన్డ్‌ చేసిన వాటికి ప్రయోజనం

  • గ్రామం యూనిట్‌గా రీ సర్వే కొనసాగింపు

  • అవసరమైన చోట భూముల ధరలు పెంపు

  • రెవెన్యూ సదస్సులో మంత్రి అనగాని వెల్లడి

విజయవాడ, జనవరి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 22ఏ జాబితాలో ఉన్న పేదల భూములపై నిషేధం ఎత్తివేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.88 కోట్ల ఎకరాల భూములు 22ఏ జాబితాలో ఉన్నాయని తెలిపారు. వీటిలో దేవదాయ, ప్రభుత్వ భూములు, అనేక కేటగిరీ భూములు ఉన్నాయన్నారు. శుక్రవారం మంగళగిరిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జోన్‌-2, జోన్‌-3 లకు సంబంధించిన 11 జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంత్రి సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవదాయ, ప్రభుత్వ భూములు పోనూ పేదలకు నివేశనా స్థలాలు, సాగు పట్టాలుగా ఇచ్చినవి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ 22ఏలోనే ఉన్నాయని, పేదలకు లబ్ధి కలిగించాలన్న ఉద్దేశంతో ఇలాంటి వాటన్నింటినీ 22ఏ జాబితా నుంచి తొలగించేందుకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదల భూములను కొట్టేయాలన్న ఉద్దేశంతో అక్రమంగా కొందరి భూములను 22ఏలో చేర్చిందన్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని 22ఏ కేటగిరీపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని తెలిపారు. రెవెన్యూ సదస్సులలో ప్రధానంగా 32 రకాల అర్జీలు వస్తున్నాయని, ఆర్‌ఓఆర్‌కు సంబంధించి 1.01 లక్షల అర్జీలు, సర్వే వివాదాలపై 7 వేల అర్జీలు వచ్చాయని తెలిపారు.


  • 25 వరకు రెవెన్యూ సదస్సులు

రెవెన్యూ సదస్సులు ఈ నెల 20వ తేదీ నాటికి ముగుస్తాయని, ఉత్తరాంధ్ర వంటి ప్రాంతంలో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల మరో ఐదు రోజులు పొడిగించినట్టు మంత్రి తెలిపారు. ఈ నెల 25వ తేదీ తర్వాత 45 రోజలలో అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రీ సర్వేను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అనగాని చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా ఒక మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా రోజుకు 20 ఎకరాల వరకు రీ సర్వే చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాస్‌పుస్తకాలపై ఫిర్యాదులు చేసిన వారికి రాజముద్రతో కూడిన కొత్త పుస్తకాలను అందిస్తామన్నారు.ఫ్రీహోల్డ్‌ భూములకు మంత్రుల కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతకుముందు నిర్వహించిన రెవె న్యూ సదస్సులో జోన్‌-2, జోన్‌-3 ప్రజా ప్రతినిధులంతా పేదల సమస్యలను మంత్రి అనగాని దృష్టికి తీసుకువచ్చారు. తమ నియోజకవర్గాల పరిధిలోని పేదల నివేశనా స్థలాలు, పేదలకు గతంలో సాగు భూములుగా ఇచ్చిన వాటిని 22ఏ నుంచి తొలగించాలన్న డిమాండ్లు భారీగా వచ్చాయని తెలిపారు. వీటిపై సత్వరం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jan 04 , 2025 | 04:10 AM