Bapatla : టీడీపీ స్థలానికి ఎసరు!
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:30 AM
కానీ తన భూమినే కాపాడుకోవడం మరిచారు. ఆయన మరెవరో కాదు మన ముఖ్యమంత్రి చంద్రబాబే..!

పాతికేళ్ల కిందట బాపట్లలో పార్టీ ఆఫీసు కోసం భూదానం
చంద్రబాబు పేరుతో 9.5 సెంట్లు రిజిస్టర్ చేయించిన అభిమాని
ప్రస్తుత విలువ రూ.1.5 కోట్లు.. దీనిపై ఎన్నడో కన్నేసిన భూ మాఫియా
నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌కు యత్నాలు
తాజాగా దొంగ పత్రాలతో రుణం కోసం యత్నం.. గుట్టురట్టు
టీడీపీ నేతల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
వారి అదుపులో నక్కా సత్తార్‌రెడ్డి.. మరో సూత్రధారి కూడా?
(బాపట్ల-ఆంధ్రజ్యోతి)
ఆయన భూముల విలువ గురించి పదేపదే చెబుతుంటారు.. ప్రభుత్వ భూముల సంరక్షణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తుంటారు. కానీ తన భూమినే కాపాడుకోవడం మరిచారు. ఆయన మరెవరో కాదు మన ముఖ్యమంత్రి చంద్రబాబే..! భూమాఫియా ఆయనకే శఠగోపం పెట్టేందుకు ప్రయత్నించిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాపట్ల పట్టణం రైలుపేటకు చెందిన టీడీపీ అభిమాని మువ్వా సుబ్బారావు అనే వ్యక్తి టీడీపీ కార్యాలయం కోసం 2000వ సంవత్సరంలో తొమ్మిదిన్నర సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. పైగా దానిని అధినేత చంద్రబాబు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. విరాళంగా ఇచ్చిన స్థలం బాపట్లలోని శ్రీనివాసనగర్ పరిధిలోని సర్వే నంబరు 969-1లో ఉంది. ఇక్కడ భూముల ధరలు గత పదేళ్ల నుంచి భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం ధర దాదాపు రూ.కోటిన్నరగా ఉంది. ధరలు పెరుగుతుండడంతో భూ మాఫియా కన్ను ఖాళీగా ఉన్న ఆ స్థలంపై పడింది. 2010లోనే నకిలీ రిజిస్ట్రేషన్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆరు సార్లు నకిలీ డాక్యుమెంట్లతో దానిని అమ్మాలని చూశారు. ఆ పత్రాలతో బాపట్లలోని ఓ బ్యాంకులో రుణం తీసుకోవడానికి తాజాగా యత్నించగా.. వీరి బాగోతం బయటపడింది. ఈ విషయం బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో టీడీపీ శేణులు ఆదివారం బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు బాపట్ల మండలం కొత్తఓడరేవుకు చెందిన నక్కా సత్తార్‌రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆ స్థలం విషయంలో దొంగ డాక్యుమెంట్లు పుట్టించిన ఇతడికి.. ఈ తరహా మోసాలు వెన్నతో పెట్టిన విద్య అని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన ఓ వ్యక్తి పేరు మీద ఇప్పటికే పలుమార్లు లింక్ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మి రూ.కోట్లు కొల్లగొట్టాలనే పన్నాగానికి భూ మాఫియా తెరలేపింది. గతేడాది డిసెంబరులో సదరు వ్యక్తికి విక్రయించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఏకంగా బాపట్ల మున్సిపాలిటీలో ఆ స్థలానికి పన్ను కూడా వేయించుకున్నారు. ఈ భూ మాఫియా ముఠాలో సత్తార్‌రెడ్డితో పాటు చీరాల మండలం పాలిబోయినవారిపాలేనికి చెందిన ఇంకో వ్యక్తి కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు విచారణలో తేలింది.
వరుసగా వెలుగుచూస్తున్న మోసాలు..
వైసీపీ పాలనలో భూ మాఫియా ఆగడాలకు నేతల దన్ను దొరకడంతో వారు రెచ్చిపోయారు. 2023లో దొంగ పత్రాలు సృష్టించి ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ ఆసరాగా నరసరావుపేటలో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించిన ఉదంతం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో నరసరావుపేట పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం టీడీపీ కార్యాలయ స్థలాన్ని కాజేయాలని చేసిన భూమాఫియాకు వారితో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇన్నేళ్లూ ఏం చేశారు?
పార్టీ కార్యాలయం కోసం పాతికేళ్ల కిందట టీడీపీ అభిమాని తొమ్మిదిన్నర సెంట్ల స్థలం విరాళంగా ఇస్తే రెండున్నర దశాబ్దాల్లో అక్కడ ఆఫీసు కట్టలేకపోవడంపై టీడీపీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతంలో దొంగ డాక్యుమెంట్లతో ఈ స్థలాన్ని విక్రయించడానికి ప్రయత్నాలు జరిగినప్పుడే జాగ్రత్తపడాల్సి ఉండగా.. నేతలు నిర్లక్ష్యం వహించారు. దానిని కాపాడుకునే ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు దొంగ రిజిస్ట్రేషన్ అంశం ఆలస్యంగా వెలుగులోకి చూడడంతో ఆగమేఘాల మీద ఆ స్థలంలో బోర్డు ఏర్పాటు చేయడం కొసమెరుపు.