Budget- 2025: బడ్జెట్ గురించి అస్సలు తెలియదా.. ఇవి తెలుసుకోండి ఇట్టే అర్థం అవుతుంది..
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:17 AM
రుణాలు కాకుండా ప్రభుత్వ మొత్తం ఖర్చులు దాని ఆదాయాన్ని మించిపోయినప్పుడు ఆర్థిక లోటు ఏర్పడుతుంది. అప్పులు తెచ్చి వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకూ బడ్జెట్‌లో ఆర్థిక లోటును జీడీపీలో 4.9 శాతంగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

బిజినెస్ డెస్క్: దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న బడ్జెట్ సమావేశాలు రానే వచ్చాయి. ఇవాళ(శుక్రవారం) నాడు రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఏటాలాగానే పేద, మధ్యతరగతి ప్రజలు తమకు చేకూరే లబ్ధి గురించి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే చాలా మందికి బడ్జెట్ లెక్కలు అస్సలు అర్థం కావు. కొన్ని ప్రధాన అంశాలపై దృష్టి పెట్టగలిగితే బడ్జెట్ గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. వాటిలోని గణాంకాలను అర్థం చేసుకోగలిగితే ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు దేనిపై దృష్టి పెట్టాలో అర్థమవుతుంది.
వీటి గురించి తెలుసుకోండి..
రుణాలు కాకుండా ప్రభుత్వ మొత్తం ఖర్చులు దాని ఆదాయాన్ని మించిపోయినప్పుడు ఆర్థిక లోటు ఏర్పడుతుంది. అప్పులు తెచ్చి వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకూ బడ్జెట్‌లో ఆర్థిక లోటును జీడీపీలో 4.9 శాతంగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించిన ఆర్థిక లోటుపై కేంద్రం ఏం చెప్తుందోనని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదరుచూస్తున్నాయి.
ప్రస్తుత (2024-25) ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం(ప్రభుత్వ ఖర్చులు) రూ.11.1 లక్షల కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. అయితే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 2024 మెుదట్లో ఖర్చులు బాగా నెమ్మదించాయి. దీనికి ఎన్నికల కోడ్ కారణమనే చెప్పొచ్చు. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో మూలధన వ్యయం ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది కేంద్రం వివిధ పథకాలు, అభివృద్ధి పనుల కింద ఎంత ఖర్చు చేయనుందో బడ్జెట్ సమావేశాల్లో తెలియనుంది. 2024లో సాధారణ ప్రభుత్వ రుణం- జీడీపీ నిష్పత్తి 85 శాతం ఉండగా.. అందులో ఒక్క కేంద్ర ప్రభుత్వ రుణమే 57 శాతంగా ఉంది. నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ ప్రసంగంలో 2026-27 నుంచి జీడీపీలో ద్రవ్యలోటు తగ్గించేందుకు నిరంతరం ప్రయత్నిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక లోటును తీర్చుకునేందుకు పలు రకాలుగా రుణాలు సేకరిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం స్థూల రుణ బడ్జెట్ రూ. 14.01 లక్షల కోట్లుగా ఉంది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్థూల రుణ బడ్జెట్ గురించి మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కేంద్రం పన్నుల ద్వారా ప్రభుత్వ నిర్వహణకు అవసరమయ్యే ఆదాయం సమకూర్చుకుంటుంది. 2024-25 బడ్జెట్‌లో స్థూల పన్ను ఆదాయాన్ని రూ.38.40 లక్షల కోట్లుగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీంట్లో ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.22.07 లక్షల కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ.16.33 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు.
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.10.62 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. కావున 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ రాబడి భారీగానే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారతదేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 10.5 శాతంగా కేంద్రం అంచనా వేసింది. కాకపోతే వాస్తవ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉంటుందని ఆర్థిక పండితులు చెబుతున్నారు.