Maha Kumbh Mela 2025 : గంగా మాత సాక్షిగా 37 ఏళ్ల తర్వాత కలిసిన ఫ్రెండ్స్.. హార్ట్ టచింగ్ స్టోరీ!
ABN , Publish Date - Feb 26 , 2025 | 07:55 PM
Maha Kumbh Mela 2025 : ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఈ రోజుతో ముగిసిపోతుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభమైన రోజు నుంచే ఆశ్చర్యకరమైన వ్యక్తులు, వింతలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా త్రివేణి సంగమంలో 37 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు మిత్రుల కథ అందరి మనసులను కదిలిస్తోంది..

Maha Kumbh Mela 2025 : ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా శివరాత్రి పర్వదినాన ముగియనుంది. ఇవాళ ఒక్కరోజే 1.32 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకూ దాదాపు 64 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇక కుంభమేళా మొదలైన రోజు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులపై అనేక కథనాలు తెగ వైరల్ అయ్యాయి. అలాగే చివరిరోజున కూడా ఓ ఇద్దరు మిత్రుల కథ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
37 ఏళ్లు గడిచినా..
కాలం ఎంత వేగంగా గడుస్తుందో తెలియదు, కానీ కొంతమంది మనుషుల్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. కాలం మారినా, వాతావరణం మారినా, మన మనసులో గుర్తుగా నిలిచిపోయిన స్నేహం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అలాంటి అద్భుతమైన సంఘటనే మహా కుంభ మేళాలో చోటుచేసుకుంది. సంజీవ్ కుమార్ సింగ్, రష్మి గుప్తా.. వీరిద్దరూ 1988 బ్యాచ్‌లో కాలేజీ మిత్రులు. 37 సంవత్సరాల తర్వాత జరిగిన వీరి గెట్ టుగెదర్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.
ఈ అద్భుతమైన మధుర క్షణాన్ని సంజీవ్ వీడియోలో ఇలా గుర్తు చేసుకున్నారు.. 'ఇదిగో, ఇది నా కాలేజీ ఫ్రెండ్ రష్మి. మేమిద్దరం 1988 బ్యాచ్. 37 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన ఆనందం మాటల్లో చెప్పలేను. ఆమె ఇప్పుడు లక్నోలోని ఒక కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తోంది...'
అటు రష్మి కూడా ఆనందంతో మాటలు చెప్పింది. 'ఇక్కడ మహా కుంభమేళా అనుభవం అసాధారణం. చాలా మంచి ఏర్పాట్లు ఉన్నాయి. సంజీవ్ మాకు చాలా సహాయం చేశాడు. కానీ కాలేజీ రోజుల్లో అయితే, సంజీవ్ అంతగా మాట్లాడేవాడు కాదు. చాలా ఇంట్రోవర్ట్. కానీ ఇప్పుడు చూస్తే అస్సలు అలా అనిపించడం లేదు. ఇప్పుడాయన పూర్తిగా మారిపోయాడు! అతన్ని మళ్లీ కలవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది' అని చెప్పింది.
సంజీవ్ కూడా సరదాగా తన కాలేజీ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. 'అదేంటో.. కాలేజీ రోజుల్లో రష్మి గ్యాంగ్ నాతో అస్సలు మాట్లాడేది కాదు. ఇప్పుడు మాత్రం నాకు పొగడ్తలు సునామీలా వెల్లువెత్తుతున్నాయి!' అని సరదాగా అన్నారు.
రష్మి ఈ మాటలు వింటూ, 'అయినా సరే, నీ మీద చేస్తున్న ఈ తప్పుడు పొగడ్తల్ని స్వీకరించు' అంటూ నవ్వుతూ ఆనందంతో మెరిసిపోయింది.
ఇక కాలేజీ అంటే కేవలం చదువు మాత్రమే కాదు, అనేక మధుర జ్ఞాపకాలకు కేరాఫ్ అడ్రస్. ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువత, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయాణంలో కలిసిన సహచరులు – వీటితో కలిసి ప్రతి ఒక్కరికీ కళాశాల అనుభవం ప్రత్యేకంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి చేసే కేరింతలు, క్లాసుల మధ్య చేసే అల్లరి, కంటి మాటల్లో పంచుకునే భావనలు, అప్పటి చిన్న చిన్న మనస్పర్థలు, పరీక్షల ముందు రాత్రిపూట కలిసి చదవడం, క్యాంటీన్‌లో కప్పు చాయ్‌తో గడిపిన ఆనంద క్షణాలు.. ఇవన్నీ కాలేజీ రోజుల అందమైన జ్ఞాపకాలు.
అయితే కాలం తన గమ్యాన్ని దాటుతూ వెళ్లిపోతూ ఉంటుంది. కాలేజీ రోజులు ముగిసిన తర్వాత, జీవితంలో కొత్త కొత్త దారులు ఏర్పడతాయి. కొందరు ఉద్యోగాల్లో స్థిరపడిపోతారు. మరికొందరు వివాహ జీవితం ప్రారంభిస్తారు.. మరికొందరు విదేశాలకు వెళ్తారు. కాలం నడుస్తూనే ఉంటుంది, కానీ మనం ప్రేమించే మనుషులు మన జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతారు. ఈ ప్రపంచంలో అన్ని బంధాలకంటే ప్రత్యేకమైనది స్నేహ బంధం. కాలం ఎంత గడిచినా, దూరం ఎంత ఎక్కువైనా, నిజమైన స్నేహితులు ఒకసారి కలిసిన తర్వాత మళ్లీ అదే అనుబంధాన్ని కొనసాగించగలుగుతారు. సంజీవ్, రష్మి ఘటన మనకు ఇదే నిజాన్ని గుర్తుచేస్తుంది. ఈ ఇద్దరి అనుబంధం, వీరి మధ్య మళ్లీ ఏర్పడిన మిత్రబంధం చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. నెట్‌జన్లు ఈ వీడియోను చూసి ఎంతో ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు.
Read Also : Kerala Horror Crime : పగిలిపోయిన పుర్రెలు, విరిగిపోయిన మణికట్టు.. ఆ 5 హత్యల వెనుక ఉన్నది ఎవరు?
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..