Share News

Delhi New CM: కార్పొరేటర్ టు సీఎం.. ఆమె వైపు అధిష్టానం మొగ్గుకు కారణం అదేనా

ABN , Publish Date - Feb 19 , 2025 | 05:08 PM

ఢిల్లీ సీఎం ఎవరో తెలిసిపోయింది. మహిళను సీఎంగా బీజేపీ ప్రకటించింది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెెలిచిన రేఖా గుప్తాను బీజేపీ సీఎంగా ప్రకటించింది. కార్పొరేటర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా నేరుగా సీఎం కాబోతున్నారు.

Delhi New CM: కార్పొరేటర్ టు సీఎం.. ఆమె వైపు అధిష్టానం మొగ్గుకు కారణం అదేనా
Rekha Gupta

ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ ఆలోచన ఎలా ఉంటుందనేది ఎవరికి అంతుపట్టని విషయం.. లోకమంతా ఒకటి అనుకుంటే.. బీజేపీ అధిష్టానం మాత్రం మరొకటి తలుస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ సీఎంల ఎంపిక విషయంలో బీజేపీ ఇలానే చేసింది. తాజాగా ఢిల్లీ సీఎం ఎంపిక విషయంలోనూ బీజేపీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటిక్రితం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం సీఎంగా రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అధిష్టానం ముందుగానే నిర్ణయించిన రేఖా గుప్తా పేరును కేంద్ర పరిశీలకులు శాసనసభాపక్ష సమావేశంలో ప్రతిపాదించారు. దీనిపై పార్టీ ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీలో సీనియర్ నాయకురాలుగా ఉన్నప్పటికీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేదు. వార్డు కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా పనిచేశారు. కార్పొరేటర్‌గా పనిచేసిన వ్యక్తిని బీజేపీ సీఎం ఎందుకు చేసింది. కార్పొరేటర్ టు సీఎం కాబోతున్న ఆమె అసలు హిస్టరీ ఏమిటో ఓసారి తెలుసుకుందాం.


సుదీర్ఘ రాజకీయ అనుభవం..

రేఖా గుప్తాకు గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన అనుభవం లేదు. కానీ రాజకీయంగా ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది. విద్యార్థి నాయకురాలిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. పితంపుర, షాలీమార్ బాగ్ ప్రాంత ప్రజలకు సుపరచితురాలు. స్థానికంగా పార్కుల అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషిచేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. రేఖాగుప్తా కుటుంబానికి సంఘ్ నేపథ్యం ఉండటం ఆమెకు కలిసొచ్చింది. విద్యార్థి దశలో ఏబీవీపీలో చురుకైన పాత్ర పోషించిన ఆమె ఆ తర్వాత బీజేపీలో చేరారు. పితంపుర కౌన్సిలర్‌గా, షాలీమార్ బాగ్-బి నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకురాలు. ఢిల్లీ ప్రాంతంలో పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించే నేతల్లో ఆమె ఒకరు. షాలీమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2015, 2020 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి సమీప ప్రత్యర్థి ఆప్‌కు చెందిన బందనాకుమారి చేతిలో ఓటమి చెందారు. 2025లో అదే నియోజకవర్గం నుంచి బందనాకుమారిని 29వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. రేఖాగుప్తా బీజేపీలో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఢిల్లీ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారం కోసం కృషిచేయడమే ఆమెను సీఎంగా బీజేపీ ఎంపిక చేయడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు.


విద్యార్థి దశ నుంచి..

1994-95 సంవత్సరంలో ఆమె దౌలత్ రామ్ కళాశాలలో చదువుతున్న సమయంలో ఆ కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీచేసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1995-96 సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU) ఎన్నికల్లో పోటీచేసి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1996-97 సంవత్సరంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU) ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీచేసి విజయం సాధించారు. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత ఆమె బీజేపీలో చేరారు. 2003 నుంచి 2004 వరకు బీజేవైఏం ఢిల్లీ కార్యదర్శి పదవిని నిర్వహించారు. 2004 నుంచి 2006 వరకు బీజేవైఏం జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2007లో ఢిల్లీలోని ఉత్తరి పితంపుర వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఎన్నికల్లోనూ ఉత్తరి పితంపుర నుంచి కౌన్సిలర్‌గా రెండోసారి గెలిచారు. 2022లో షాలీమార్ బాగ్-బి నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆమె వార్డు కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా పనిచేసిన సమయంలో ఆ ప్రాంత అభివృద్ధికి విశేషకృషి చేశారు. పితంపుర ప్రాంతంలో ఎగువ మధ్య తరగతితో పాటు ఉద్యోగస్తుల కుటుంబాల ప్రజలు ఎక్కువుగా నివాసం ఉంటారు. ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా.. అపార్ట్‌మెంట్‌ల పక్కన పార్కుల నిర్మాణంతో పాటు, వాటి అభివృద్ధికి విశేషకృషి చేశారు.


సీఎంగా ఆమెవైపు ఎందుకంటే..

ఈ ఏడాది ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగడానికంటే ముందు ఆప్ నుంచి సీఎంగా అతిషి ఉన్నారు. ఆమె మహిళకావడంతో.. ప్రస్తుతం బీజేపీ కూడా మహిళా అభ్యర్థికే ఢిల్లీ సీఎం పీఠం అప్పగించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్ నుంచి షీలాదీక్షిత్ వరుసగా మూడుసార్లు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. మరోవైపు దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు ఉన్నా.. ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎం లేరు. దీంతో ఢిల్లీలో మహిళా సీఎం వైపు బీజేపీ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Feb 19 , 2025 | 08:25 PM