Share News

National Voters Day: నేడే జాతీయ ఓటర్ల దినోత్సవం.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:29 AM

ఢిల్లీ: జాతీయ ఓటర్ల దినోత్సవం-2025ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ(శనివారం) ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏటా జనవరి 25న భారతదేశం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1950లో భారత ఎన్నికల సంఘం(ECI) స్థాపించిన రోజును గుర్తు చేసుకుంటూ కేంద్రం ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తోంది.

National Voters Day: నేడే జాతీయ ఓటర్ల దినోత్సవం.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..
National Voters Day 2025

ఢిల్లీ: జాతీయ ఓటర్ల దినోత్సవం-2025ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ(శనివారం) ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏటా జనవరి 25న భారతదేశం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1950లో భారత ఎన్నికల సంఘం(ECI) స్థాపించిన రోజును గుర్తు చేసుకుంటూ కేంద్రం ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకు, ఓటింగ్ ప్రాముఖ్యత తెలియజేసేందుకు 2011 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో వారిని ఓటింగ్ వైపు పోత్సహించేలా నేడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది "నైథింగ్ లైక్ ఓట్.. ఐ ఓట్ ఫర్ ష్యూర్" థీమ్‌తో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.


చరిత్ర..

దేశంలో యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు 2011లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు. చాలా మంది అర్హత గల యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడం లేదని అప్పటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను అధిగమించేందుకు చొరవ చూపింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం.. యువతను ఓటర్లుగా నమోదు చేయించడం, వారికి ఓటర్ గుర్తింపు కార్డులు(EPIC) మంజూరు చేయడంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అమలులోకి వచ్చిన రోజును ఒక ప్రత్యేక దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దానికి జాతీయ ఓటర్ల దినోత్సవంగా నామకరణం చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 25న వేడుకగా ఈరోజును నిర్వహిస్తున్నారు.


ప్రాముఖ్యత..

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవడం జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రధాన ఉద్దేశం. అందు కోసం ఈ రోజున వారికి ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, 18సంవత్సరాలు నిండిన యవతను ఓటర్లుగా నమోదు చేయిస్తుంటారు. అలాగే ఎన్నికల ప్రక్రియలో వారంతా చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం ఓటర్ల దినోత్సవ ప్రధాన లక్ష్యం. మొదటిసారి ఓటర్‌గా నమోదు చేసుకునే వారికి సహాయం చేయడం, నూతన ఓటర్ గుర్తింపు కార్డులు అందించడం వంటి పనులు అధికారులు ఇవాళ చేస్తుంటారు. అలాగే ఓటింగ్ ప్రాముఖ్యత తెలియజేసేలా బహిరంగ ర్యాలీలు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఓటింగ్ ప్రక్రియ, ఓటు ప్రభావం గురించి అవగాహన కల్పించే ప్రచారాలు చేస్తుంటారు. అలాగే అక్షరాస్యతను ప్రోత్సహించడంలోనూ జాతీయ ఓటర్ల దినోత్సవం కీలక పాత్ర పోషిస్తోంది.


ఓటర్ల దినోత్సవంపై ప్రముఖులు ఏం చెప్పారంటే..

  • “ప్రతి ఓటు లెక్కించబడుతుంది. మీ స్వంత ప్రజాస్వామ్యంలో ప్రేక్షకుడిగా ఉండకండి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి”-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

  • “బ్యాలెట్ బుల్లెట్ కంటే బలమైనది.”- అబ్రహం లింకన్

  • “మేము ఉదారవాదులు లేదా సంప్రదాయవాదులం కాబట్టి కాదు, కానీ అమెరికన్ పౌరులం కాబట్టి ఓటు వేస్తాం, అది మా బాధ్యత.”- జార్జ్ బుష్

  • “ఓటు విలువైనది. ఇది దాదాపు పవిత్రమైనది. ప్రజాస్వామ్యంలో మనకు ఉన్న అత్యంత శక్తివంతమైన అహింసా సాధనం ఇదే.”-జాన్ లూయిస్

  • “ఒక ఓటు ఒక రైఫిల్ లాంటిది, దాని ఉపయోగం వినియోగదారుడి స్వభావంపై ఆధారపడి ఉంటుంది.”-థియోడర్ రూజ్‌వెల్ట్

  • “ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం" -బరాక్ ఒబామా

  • "ముఖ్యమైన విషయాలపై మౌనంగా మారిన రోజు నుంచి మన జీవితాలు ముగియడం ప్రారంభిస్తాయి."-మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్

Updated Date - Jan 25 , 2025 | 11:29 AM