Delhi assembly Election Results : నేనందుకే ఓడిపోయా.. ఓటమిపై కేజ్రీవాల్ ఎమోషనల్ రియాక్షన్..
ABN , Publish Date - Feb 08 , 2025 | 04:23 PM
అందరూ ఊహించినట్టుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఘెర ఓటమిని మూటగట్టుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిపై స్పందించారు.

రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి ఈ రోజు వరకూ ప్రజాక్షేత్రంలో ఓటమనేదే ఎరుగలేదు ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రికార్డు చెదిరిపోయింది. పదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలోనే ఉన్న దేశరాజధాని పగ్గాలను ఇప్పుడు కమలం పార్టీ లాగేసుకుంది. అంతే కాదు.. కేజ్రీవాల్ హ్యాట్రిక్ విజయాలకూ అడ్డుకట్ట వేసింది. గత రెండు పర్యాయాలు భారీ మెజార్టీ కట్టబెట్టి ఢిల్లీ పీఠంపై కూర్చోపెట్టిన ఓటర్లు ఈ సారి కనికరించలేదు. కేజ్రీవాల్ గ్యారెంటీలపై నమ్మకం ఉంచేందుకు సాహసించలేదు. భారతీయ జనతా పార్టీ వల్లే తమ రాత మారుతుందని పూర్తిగా నమ్మారు. దారుణ ఓటమి అంటే ఎలా ఉంటుందో చీపురు పార్టీకి తొలిసారి రుచి చూపించారు. ఈ సందర్భంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దారుణ పరాజయంపై స్పందించారు.
ప్రజల నిర్ణయాన్ని గౌరవంగానే భావిస్తాం..
ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆప్ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్రకటన ద్వారా తొలిసారిగా స్పందించారు. ' ప్రజల ఆదేశాన్ని మేము శిరసావహిస్తాం. పూర్తి వినయంతో అంగీకరిస్తున్నాం. ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి నా అభినందనలు. వారిని ఎన్నుకున్న ప్రజలకు అన్ని హామీలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. గత 10 సంవత్సరాల్లో ఢిల్లీ ప్రజల కోసం ఎన్నో చేశాం. ఆరోగ్యం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశాం. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాం. ఈ తీర్పును గౌరవంగా భావిస్తాం. ఇక ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్రను పోషిస్తాం. అలాగే ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేస్తూ వారి వెన్నంటే ఉంటాం. అలాగే ఎన్నికల్లో పోరాడిన ప్రతి ఒక్క ఆప్ పార్టీ నేతకు, కార్యకర్తకు కూడా నా ధన్యవాదాలు'. అని తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్టుగానే భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ 'వికసిత్ ఢిల్లీ సంకల్ప్ పత్ర' మేనిఫెస్టో మంత్రం ఢిల్లీ ఓటర్లపై పనిచేసింది. అవినీతి మరకలు, కుంభకోణాలు ఆప్ పార్టీ పాలిట శాపంగా మారాయి. న్యూ ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, జంగ్‌పురా నుంచి ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా ఓడిపోగా.. సీఎం ఆతిషీ ఒక్కరే గెలిచారు. 2015లో 70కి 67 సీట్లు, 2020లో 62 సీట్లు గెలిచి భారీ మెజార్టీ సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సారి కనీసం పాతిక స్థానాలు కూడా నిలబెట్టుకోలేకపోయింది.
ఇవి కూడా చదవండి..