Mamata Banerjee: కాంగ్రెస్ వల్లే మెజారిటీ లేకున్నా బీజేపీకి అధికారం.. తాజా పుస్తకంలో మమత ఆక్షేపణ
ABN , Publish Date - Jan 29 , 2025 | 06:21 PM
తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి విజయం సాధించలేకపోయిందని తాను రాసిన పుస్తకంలో మమతాబెనర్జీ ఆరోపించారు.

కోల్‌కతా: గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ లేకున్నా బీజేపీ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి కారణం కాంగ్రెస్సేనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వ్యాఖ్యానించారు. కోల్‌కతా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. స్వయంగా తాను రాసిన మూడు పుస్తకాలను మమతా బెనర్జీ విడుదల చేశారు. ఇందులో 'బంగ్లార్ నిర్బచోన్ ఒ అమ్రా' టైటిల్‌తో విడుదలైన పుస్తకంలో 2024 సార్వత్రిక ఎన్నికలపై ఆమె లోతైన విశ్లేషణ చేశారు.
PM Modi: నేను తాగుతున్న నీళ్లు కూడా అవే... ఆప్‌పై మోదీ నిప్పులు
తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేసినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే ఎన్నికల్లో 'ఇండియా' కూటమి విజయం సాధించలేకపోయిందని ఆ పుస్తకంలో మమతాబెనర్జీ పేర్కొన్నారు. ''ఎన్డీయే ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ జాతీయ స్థాయిలో కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి ఏర్పడినప్పటి నుంచి కనీస ఉమ్మడి కార్యక్రమం, ఉమ్మడి మేనిఫెస్టోకి తృణమూల్ పట్టుబట్టింది. విపక్ష కూటమి పేరు కూడా నా ప్రతిపాదనే. కానీ, కనీస ఉమ్మడి కార్యక్రమం కానీ, ఉమ్మడి మేనిఫెస్టో కానీ కార్యరూపంలోకి రాలేదు. కూటమి భాగస్వామ్యులు ఒకరిపై మరొకరు పోటీ చేశారు. ఇది బీజేపీకి కలిసొచ్చింది. మెజారిటీ సాధించకుండానే ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది" అని ఆమె విశ్లేషించారు.
కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు కూటమి చలవే
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్యను ప్రస్తావిస్తూ, కూటమి భాగస్వామ్య పార్టీల మద్దతుతోనే కాంగ్రెస్ సీట్లు గెలుచుకుందన్నారు. టీఎంసీ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఘన విజయం అందించారని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న టీఎంసీ 2024 ఎన్నికల్లో 29 సీట్లు సాధించింది. బీజేపీ 19 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కింది. సీపీఎం సారథ్యంలో లెఫ్ట్ ఫ్రెంట్ ఖాతా కూడా తెరవలేదు.
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News