Share News

CM Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ

ABN , Publish Date - Jan 22 , 2025 | 04:53 PM

CM Nitish KUmar: బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ) పార్టీ కీలక నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకొంది.

CM Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ
Bihar CM Nitish Kumar

ఇంఫాల్, జనవరి 22: మణిపూర్‌ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ కీలక పరిణామం చోటు చేసుకొంది. రాష్ట్రంలోని ఎన్ బిరేన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి జేడీ (యూ) తన మద్దతు ఉపసంహరించుకొంది. ఈ మేరకు జేడీ (యూ) రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌హెచ్ బీరేన్ సింగ్.. ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు బుధవారం లేఖ ద్వారా సమాచారం అందించారు. దీంతో జేడీ (యూ)కి చెందిన ఒక్కే ఒక్క ఎమ్మెల్యే.. బుధవారం ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కేటాయించిన స్థానంలో కూర్చొన్నాడు.

అయితే జేడీ (యూ) పార్టీ మద్దతు ఉప సంహరించుకోవడం వల్ల ప్రభుత్వ మనుగడకు ఎటువంటి ఇబ్బంది లేదని రాజకీయ వర్గాలు స్పష్టం చేశాయి. మణిపూర్‌లో బిరేన్ సింగ్ ప్రభుత్వానికి ఇప్పటికే నేషనల్ పీపుల్స్ పార్టీ నేతృత్వం వహిస్తున్న కాన్రాడ్ సగ్మా తమ మద్దతు ఉప సంహరించుకొన్న సంగతి తెలిసిందే.

2022లో మొత్తం 60 మంది సభ్యులు ఉన్న మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జేడీ (యూ) పార్టీ తరఫున ఆరుగురు సభ్యులు విజయం సాధించారు. అనంతరం వారిలో ఐదుగురు బీజేపీలో చేరారు. దీంతో జేడీ (యూ) పార్టీకి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు.


ఇక బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు అధికార బీజేపీకి ఉంది. ఇంకోవైపు జేడీ (యూ) నుంచి బీజేపీలోకి వెళ్లడం ద్వారా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై విచారణ స్పీకర్ ట్రిబ్యునల్ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్


గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ సీఎం నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీ (యూ) పార్టీ 12 ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. దీంతో కేంద్రంలో మోదీ సర్కార్ ముచ్చటగా మూడోసారి కొలువు తీరడానికి సహాయ పడిన మిత్ర పక్షాల్లో జేడీ (యూ) ఒక్కటి. అయితే సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఇండియా కూటమి నుంచి జేడీ (యూ) అధినేత నితీష్ కుమార్ బయటకు వచ్చారు. అనంతరం ఆయన ఎన్డీయే కూటమిలో చేరిన విషయం విధితమే.


ఈ ఏడాది చివర బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టేందుకు సీఎం నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాంటి వేళ.. మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి జేడీ (యూ) మద్దతు ఉప సంహరించుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది. మరోవైపు దాదాపు ఏడాదిన్నరగా మణిపూర్‌లో రెండు జాతుల మధ్య ఘర్షణ కారణంగా.. వందలాది మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అలాగే వేలాది మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిన సంగతి తెలిసిందే.

For National News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 04:53 PM