Thalapathy Vijay: భాష పేరుతో డీఎంకే, బీజేపీ కపట నాటకాలు
ABN , Publish Date - Feb 27 , 2025 | 03:52 AM
భాష పేరుతో తమిళనాట డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కపట నాటకాలాడుతున్నాయని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, సినీ హీరో విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు

అన్ని భాషలను గౌరవించాల్సిందే
మూడో భాష అమలును వ్యతిరేకిస్తాం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం
టీవీకే వార్షికోత్సవంలో పార్టీ అధినేత విజయ్
చెన్నై, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): భాష పేరుతో తమిళనాట డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కపట నాటకాలాడుతున్నాయని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, సినీ హీరో విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసగించడానికి ఎల్కేజీ విద్యార్థుల్లా కొట్లాడుకుంటున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఒకరికొకరు హ్యాష్‌ట్యాగ్‌లు వేసుకుని ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్‌లో బుధవారం జరిగిన టీవీకే పార్టీ ద్వితీయ వార్షికోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి అవసరాల మేరకు నిధులివ్వడం కేంద్రం బాధ్యత అని, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం రాష్ట్ర ప్రభుత్వం విధి అని చెప్పారు. అయితే ఇటీవల విద్యా సంబంధిత నిధుల వ్యవహారంలో డీఎంకే, బీజేపీ ప్రభుత్వాలు తాయిలాల కోసం కొట్లాడుకునే చిన్న పిల్లల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల నాటకాలు ప్రజలకు తెలిసిందేనన్నారు. ‘వాట్ బ్రో... ఇట్స్ రాంగ్ బ్రో’ అంటూ సినీ స్టయిల్‌లో చెణుకులు విసిరారు. అన్ని భాషలను గౌరవించాల్సిందేనని, అదే సమయంలో ఓ భాషను నిర్బంధంగా అమలు చేయాలని కేంద్రం ప్రయత్నించడం సమాఖ్య రాజ్యాంగ విధానానికి వ్యతిరేకమన్నారు. విద్యా విధానాలను అయోమయంలో ఉంచి, ఓ భాషను నెత్తికెత్తుకుని నిర్బంధంగా అమలు చేయడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడో భాషను అమలు చేయడానికి ప్రయత్నిస్తే తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెత్తందార్లను ఇంటికి సాగనంపడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అవినీతిని అంతమొందించాలి: ప్రశాంత్ కిశోర్
టీవీకే వేడుకల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అవినీతి ప్రస్తుతం తమిళనాడులో ఉందన్నారు. అవినీతిపరులను అంతమొందించాలని, ఈ సత్కార్యాన్ని విజయ్ నెరవేరుస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయ్ గెలుస్తాడని, దానికి అవసరమైన అండదండలను తాను అందిస్తానని భరోసా ఇచ్చారు. విజయ్ పార్టీకి తాను వ్యూహకర్తగా పనిచేయడం లేదని, కానీ తమిళనాడులో కొత్త మార్పు కోసం ఆయనకు అండగా నిలిచానని వివరించారు. నాలుగేళ్ల క్రితమే తాను ఎన్నికల వ్యూహకర్త పని నుంచి వైదొలిగానని పేర్కొన్నారు. చివరగా డీఎంకేకు రాజకీయ సలహాదారుగా వ్యహరించానని గుర్తుచేశారు. విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చేలోగా తాను తమిళం నేర్చుకుని ప్రసంగించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
‘గెట్ అవుట్’ పేరుతో సంతకాల ఉద్యమం
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాన్ని గద్దే దింపే లక్ష్యంతో ‘గెట్ అవుట్’ పేరుతో ఈ వేడుకల్లో సంతకాల ఉద్యమాన్ని విజయ్ ప్రారంభించారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన ‘గెట్ అవుట్’ బ్యానర్‌పై విజయ్ తొలి సంతకం చేశారు. ఆ తర్వాత పార్టీ ప్రముఖులు సంతకాలు చేశారు. అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రం ఆ బ్యానర్‌పై సంతకం చేయడానికి నిరాకరించడం చర్చనీయాంశమైంది.