Share News

Bird Flu: కోళ్లకు మరణశాసనం!

ABN , Publish Date - Feb 14 , 2025 | 05:05 AM

బర్డ్‌ ఫ్లూ.. వైరస్‌ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఇది వలస పక్షుల నుంచి కోళ్లు, బాతులకు మాత్రమే సోకుతుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి వలస పక్షులు కొల్లేరు, సిలికాన్‌ సరస్సులతో పాటు ఇతర జలాశయాలకు ఎక్కువగా వచ్చాయి.

Bird Flu: కోళ్లకు మరణశాసనం!

వ్యాక్సిన్‌ లేని వైరస్‌ బర్డ్‌ ఫ్లూ.. వలస పక్షులతోనే వ్యాధి వ్యాప్తి

  • ఇది మనుషులకు సోకదు

  • జీవ భద్రతా చర్యలతో నివారణ

  • పశువైద్య నిపుణుల సూచన

  • గోదావరి జిల్లాల్లో వ్యాప్తిపై ఆందోళన

  • అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

  • నియంత్రణకు కఠిన చర్యలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): బర్డ్‌ ఫ్లూ.. వైరస్‌ కోళ్లు, బాతుల పాలిట మరణశాసనంగా మారింది. ఇది వలస పక్షుల నుంచి కోళ్లు, బాతులకు మాత్రమే సోకుతుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి వలస పక్షులు కొల్లేరు, సిలికాన్‌ సరస్సులతో పాటు ఇతర జలాశయాలకు ఎక్కువగా వచ్చాయి. కానీ.. ఆ పక్షుల్లో ఈ వ్యాధి కనబడదు. దీనివల్ల వలస పక్షులు, కొంగలు చనిపోవు. కేవలం క్యారియర్లుగానే ఉంటాయి. అవి విసర్జించే రెట్టల ద్వారా వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. వాటి ముక్కు నుంచి వచ్చే ద్రవం నీటిలో చుక్క పడినా వైరస్‌ ప్రభావం చూపుతుంది. సాధారణంగా శీతాకాలంలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ ఉనికిలో ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ అంతరిస్తుంది. సహజంగా జలాశయాల వద్ద వలస పక్షులతో పాటు దేశీయ కొంగలు కూడా సంచరిస్తాయి. ఆ కొంగలు కోళ్ల ఫారాల వద్దకి రావడం వల్ల వైరస్‌ అంతర బదిలీ అవుతుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో సహజంగా కోళ్ల మరణాలు 3.5 శాతంగా ఉంటుంది. మరణాలు సహజమే కానీ.. కోళ్లు అత్యధికంగా మృతి చెందితే దానికి వైర్‌సలే కారణం. ప్రస్తుతం కోళ్ల మరణాలకు కారణమైన బర్డ్‌ఫ్లూ నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ లేదని పశుసంవర్థక శాఖ తెలిపింది. కోళ్ల ఫారాల వద్ద పరిశుభ్రతతోపాటు ఇతర జీవ భద్రతా ప్రమాణాలు పాటించడమే దీనికి నివారణ అని పేర్కొంది.


ఈ వైరస్‌ మనుషులకు సోకదు..

బర్డ్‌ఫ్లూ కారణంగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూ రు అగ్రహారంలో 5.42 లక్షల కోళ్లు మృతి చెందాయి. పక్షి జాతుల్లో వచ్చే వైర్‌సలను నిర్ధారించే ప్రయోగశాల నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైసెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ ల్యాబ్‌ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోనే ఉంది. గోదావరి జిల్లాల్లో చనిపోయిన కోళ్ల నమూనాలను ఈ ల్యాబ్‌కే పంపగా.. బర్డ్‌ఫ్లూగా నిర్ధారణ అయింది. దీని శాస్త్రీయ నామం ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్‌5ఎన్‌1). కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ సోకినట్లు రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. పశుసంవర్థక శాఖ అధికారులు మాత్రం దీన్ని కొట్టిపారేశారు. భోపాల్‌లోని ల్యాబ్‌కు మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారించే అధికారం ఉందని చెప్పారు. ఈ వైరస్‌ కోళ్ల నుంచి మనుషులకు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. కాగా, బర్డ్‌ఫ్లూ నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (ఆర్‌ఆర్‌టీ)లు ఏర్పాటు చేశామని, దీనిపై ఆందోళన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.


బర్డ్‌ఫ్లూపై అసత్య ప్రచారం వద్దు

  • తెలంగాణ పౌలీ్ట్ర ఫెడరేషన్‌ కార్యదర్శి పాతూరి

షాద్‌నగర్‌ అర్బన్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కోళ్లకు బర్డ్‌ఫ్లూ వచ్చిందని ప్రజలు భయపడొద్దని, సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేసి జనాన్ని భయపెట్టవద్దని తెలంగాణ పౌలీ్ట్ర ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి పాతూరి వెంకటరావు కోరారు. గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని పౌలీ్ట్ర ఫారాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ వచ్చిందని, దాని ప్రభావంతో తెలంగాణలోని సత్తుపల్లి, బాన్సువాడ ప్రాంతాల్లో లక్షణాలు కనిపించాయని తెలిపారు. కోళ్లకు ముందస్తు వ్యాక్సిన్‌ ఇచ్చిన ఏ ఒక్క ప్రాంతంలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ రాలేదన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ప్రాంతంలో బర్డ్‌ఫ్లూ రాలేదని.. ప్రజలు, పౌలీ్ట్ర రైతులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. కోళ్లకు వచ్చే బర్డ్‌ఫ్లూ మనుషులకు రాదని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్‌ ఎక్కడ లేదని తెలిపారు.

Updated Date - Feb 14 , 2025 | 05:05 AM