AP Assembly Budget Session: ఏపీ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై సస్పెన్షన్ వేటు.. ఆయనతో పాటు

ABN , First Publish Date - 2023-03-15T14:19:11+05:30 IST

ఏపీ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.

AP Assembly Budget Session: ఏపీ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై సస్పెన్షన్ వేటు.. ఆయనతో పాటు

అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (YCP Rebal MLA KotamReddy Sridhar Reddy)పై సస్పెన్షన్ వేటు పడింది. కోటంరెడ్డితో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) కూడా సస్పెండ్ అయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), పయ్యావుల కేశవ్ (Payyavula kesav), నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu)ను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అలాగే మిగిలిన సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. హౌస్‌ను మిస్ లీడ్ చేసినందుకు, సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

అంతకుముందు కేవలం ఇద్దరు టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును మాత్రమే స్పీకర్ సస్పెండ్ చేశారు. గవర్నర్ రిసీవింగ్ అంశంపై సభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తనకు అవకాశం కల్పించాలని పదే పదే అడిగారు. సుమారు 40 నిమిషాలకు పైగా సభలో అధికారపార్టీ మంత్రులు, సభ్యులు మాట్లాడుతున్న సమయంలో పయ్యావుల అడ్డుతగిలారు. ఈ క్రమంలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేకుండా తమరెలా సస్పెండ్ చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. దీంతో అప్పటికప్పుడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మరలా వీరిద్దరిని సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు వినతి చేశారు. అప్పుడు స్పీకర్ మరోసారి ఇద్దరు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. సస్పెండ్ అయిన వారు సభ నుంచి బయటకు వెళ్లాలని కోరినప్పటికీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యులు మొత్తాన్ని సస్పెండ్ చేస్తేనే వెళతామని అంటున్నారని... వీరి మొత్తాన్ని సస్పెండ్ చేస్తే తప్ప సభను జరగనివ్వరని మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) అన్నారు. టీడీపీ సభ్యులను అందరిని సస్పెండ్ చేయాలని మరో మంత్రి దాడిశెట్టి రాజా (Minister Dadisetti Raja) స్పీకర్‌కు తెలిపారు.

12 మంది సస్పెండ్...

సభ్యులకు ఎంత సమయం ఇచ్చినా వితండవాదం చేస్తుడటంతో టీడీపీ సభ్యులు 12 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవని, చినరాజప్ప, గణబాబు, పయ్యవుల కేశవ్, గద్దె రామ్మెహన్, రామరాజు, ఏలూరి సంబశివరావు, డోలా వీరాంజనేయస్వామి, రవికుమార్‌లు సస్పెండ్ అయ్యారు.

పోడియం వద్దకు కోటంరెడ్డి.. మంత్రుల ఆగ్రహం

వీరితో పాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఈ రోజు ఉదయం సభ మొదలైనప్పటి నుంచి కోటంరెడ్డి నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. తన నియోజక వర్గ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సభలో పోడియం ముందు నిలబడి నియోజకవర్గ సమస్యలపై స్పీకర్‌కు కోటంరెడ్డి విజ్జప్తి చేశారు. అయితే నమ్మకద్రోహి శ్రీధర్ రెడ్డి అని.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దున వ్యక్తి, జగన్ ఫోటో పెట్టుకుని, ఫ్యాన్ గుర్తుపై గెలిచి మోసం చేశారని మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతోందని మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఈ క్రమంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ షెషన్ మెత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకున్నారు.

ఉదయం నుంచి నిలబడే కోటంరెడ్డి నిరసన...

ఈరోజు ఉదయం సభ మొదలై స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టిన వెంటనే నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ కోటంరెడ్డి ప్లకార్డుతో సభలో నిలబడ్డారు. దీంతో క్వశ్చన్ అవర్‌లో మెంబర్ మధ్యలో మాట్లాడకూడదని స్పీకర్ తెలిపారు. ‘‘శ్రీధర్ రెడ్డి మీరు ప్రభుత్వానికి సమస్యలు చెప్పుకోవాలంటే నేను గవర్నమెంట్‌కు తెలియజేస్తాను. మీరు చేస్తున్న ప్రొటెస్ట్‌ను హౌస్, నేను కూడా గుర్తించాం. మీరు కంటిన్యూగా ఇలా చేయడం తగదు. మీరు కుర్చుంటే ప్రభుత్వం స్పందిస్తుంది’’ అని స్పీకర్ తమ్మినేని తెలిపారు.

బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి (Buggan Rajendranath Reddy) స్పందిస్తూ... సమస్యలు లేని సోసైటీ ఉండదని.. సమస్యలను ఏ వేదికలో తీర్చుకోవాలనేది చూడాలన్నారు. గవర్నర్ ప్రసంగం జరగాల్సిన సమయంలో వ్యక్తిగత అంశాలు అడగడం సమంజసం కాదని తెలిపారు. కోటంరెడ్డి ఇబ్బందులను రిప్రజెంట్ చేస్తే తాము స్పందిస్తామన్నారు.

మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) మట్లాడుతూ.. శ్రీధర్ రెడ్డి కావాలనే రగడ చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన హౌస్‌ను ఇబ్బందిపెట్టి ప్రజల దృష్టిలో పడాలని చూస్తున్నారన్నారు. టీడీపీ సభ్యులకు తెల్లారే సరికి శ్రీధర్ రెడ్డిపై ప్రేమ వచ్చేసిందే అంటూ యెద్దేవా చేశారు. శ్రీధర్ రెడ్డి ఇక్కడకు వచ్చి తెలుగుదేశంతో చేతులు కలిపి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘‘శ్రీధర్ రెడ్డి నమ్మక ద్రోహి అని... శ్రీధర్ రెడ్డిని క్షమించొద్ద అని, అవకాశం ఇవ్వద్దు అవసరం అయితే చర్యలు తీసుకోండి’’ అంటూ స్పీకర్‌కు మంత్రి అంబటి వినతి చేశారు. అయినప్పటికీ ఉదయం నుంచి నిలబడే కోటంరెడ్డి తన నిరసనను తెలియజేశారు.

Updated Date - 2023-03-15T15:23:52+05:30 IST