Inter students: ఎగ్జామ్స్ ముంగిట కాలేజీల టార్చర్.. హాల్‌ టికెట్లు అందక విద్యార్థుల్లో టెన్షన్!

ABN , First Publish Date - 2023-03-13T11:44:32+05:30 IST

మరో రెండు రోజుల్లో ఇంటర్‌ వార్షిక పరీక్షలు (Inter Annual Examinations) ప్రారంభకానున్నాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు

Inter students: ఎగ్జామ్స్ ముంగిట కాలేజీల టార్చర్.. హాల్‌ టికెట్లు అందక విద్యార్థుల్లో టెన్షన్!
బలవంతపు వసూళ్లు

ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్‌

ప్రైవేటు కళాశాలల్లో బలవంతపు వసూళ్లు

పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి

హైదరాబాద్‌ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మరో రెండు రోజుల్లో ఇంటర్‌ వార్షిక పరీక్షలు (Inter Annual Examinations) ప్రారంభకానున్నాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే, పూర్తి ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్‌ (Hall Ticket) ఇస్తామని, లేకుంటే అంతేనని ప్రైవేట్‌ కాలేజీల (Private colleges) యాజమాన్యాలు విద్యార్థులను హెచ్చరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొందరు అప్పులు చేసి ఫీజు చెల్లిస్తుండగా, మరికొందరు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల నుంచి 4,17,740 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో అత్యధిక శాతం మంది ప్రైవేట్‌ కళాశాలల్లో చదువుతుండగా, ఫీజుల వసూళ్లకు కాలేజీ యాజమాన్యం ఇదే అదునుగా భావిస్తోంది. పూర్తి ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు జారీ చేస్తామని కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే, ఫీజుల కోసం యాజమాన్యాల ఒత్తిడి విద్యార్థులను అయోమయానికి గురి చేస్తోంది. పరీక్షలు ముగిసేలోపు పూర్తి ఫీజు చెల్లిస్తామని ఫోన్లు, మెస్సేజ్‌ల ద్వారా తల్లిదండ్రులు విన్నవిస్తున్నా కొన్ని యాజమాన్యాలు వినిపించుకోవడం లేదు. తోటి స్నేహితులకు హాల్‌ టికెట్లు ఇచ్చి తమకు ఇవ్వకపోవడం కొందరు విద్యార్థులను కుంగదీస్తోంది.

ఫిర్యాదు చేస్తే చర్యలు

హాల్‌టికెట్ల జారీలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని, దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆయా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్‌ విద్యాధికారులు చెబుతున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులను ప్రశాంతంగా ఉంచాల్సిన యాజమాన్యాలు బెదిరింపు ధోరణిని అవలంబిస్తుండడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విద్యను వ్యాపారమయం చేసి ఫీజుల కోసం పీడిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇటువంటి చర్యలను మానుకోకపోతే ఆయా విద్యాసంస్థల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-03-13T11:44:32+05:30 IST