Rains In AP : వైఎస్ జగన్ అలా.. చంద్రబాబు ఇలా.. ఏపీ ప్రజలారా ఈ సీన్ చూశాక..!
ABN , First Publish Date - 2023-05-04T23:13:51+05:30 IST
అసలే అకాల వర్షం.. ఎక్కడ చూసినా నీట మునిగిన పంటలే దర్శనమిస్తున్నాయ్.. అపార నష్టం వాటిల్లడంతో ఎన్నికల్లో నమ్మి ఎంచుకున్న నాయకులు వచ్చి ఇప్పటికిప్పుడు ఏదో సాయం చేస్తారని కాదు కానీ..
అసలే అకాల వర్షం.. ఎక్కడ చూసినా నీట మునిగిన పంటలే దర్శనమిస్తున్నాయ్.. అపార నష్టం వాటిల్లడంతో ఎన్నికల్లో నమ్మి ఎంచుకున్న నాయకులు వచ్చి ఇప్పటికిప్పుడు ఏదో సాయం చేస్తారని కాదు కానీ.. కష్టాల్లో ఉన్నప్పుడు కాస్తయినా ధైర్యం చెప్పకపోరా అని చిన్ని ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల సంగతి అటుంచితే.. ఏపీలో మాత్రం పరిస్థితులు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. అన్నదాతలకు అధికారంలో ఉన్న పార్టీ ధైర్యం చెప్పి.. ఆదుకుంటామని చెప్పాల్సింది పోయి కనీసం ఈ విషయమే పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సీఎం జగన్ రెడ్డితో కాదని అనుకున్నారేమో కానీ.. ప్రజల కోసం స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలను పరామర్శిస్తూ గోదావరి జిల్లాల్లో ముందుకు సాగుతున్నారు. బాబు రాకతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయ్.. తమను ఆదుకునే నేత వచ్చారంటూ చెప్పుకుంటున్నారు.
ఆయన అలా.. ఈయన ఇలా..!
అకాల వర్షాలకు రైతులు నిండా మునిగారు. భారీగా పంటలు నష్టపోయి గగ్గోలు పెడుతున్నారు. లక్షలాది ఎకరాల్లో రూ.కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన పంటలు నీట మునిగాయి. కల్లాల్లో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. పసుపు, మెరప, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి, అరటి తదితర ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. అయినా జగన్ సర్కారు (Jagan Govt) కన్నెత్తి చూడడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా బాధిత రైతుల్ని పరామర్శించట్లేదు. పంటలు నష్టపోయి రైతులంతా ఆదుకోండి మహాప్రభో అని ఎదురుచూస్తుంటే.. అధికార పార్టీ నేతలు కానీ, సీఎం జగన్ కానీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం సమీక్షలకే జగన్ పరిమితం కావడం తీవ్ర విమర్శలు ఎంత విచిత్రమో చూడండి. తక్షణ పరిహారం ఇంతిస్తామనే ప్రకటనా చేయట్లేదు. కనీసం జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులైనా క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన దాఖలా లేదు. కాస్త ఆ సమీక్షలు పక్కనెట్టి నష్టపోయిన పంటలను పరిశీలించి.. రైతులను పరామర్శిస్తే జగన్‌కు వచ్చే ఇబ్బందేంటి..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీ పేరులోనే ‘రైతు’ అనేది ఉంది కానీ.. రైతులను ఆదుకోకపోవడం ఏంటి..? అని జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాంటూ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షంతో దెబ్బతిన్న పంటలను రైతులను పరామర్శిస్తున్నారు. చంద్రబాబు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తుంటే జగన్ ఏం చేస్తున్నారు..? ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో చర్చకు కారణమవుతోంది. ఎంతసేపూ సమీక్షలేనా.. రియాల్టీలోకి వచ్చి చూసేదేమీ ఉండదా..? అని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. అయినా కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోకుండా టీడీపీ అధినేత పరామర్శిస్తుంటే ఏపీ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చూశారుగా.. ఎవరూ ప్రజా నాయకుడో.. ఎవరు ఓట్లకోసం జనాలను వాడుకుంటారో అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
ఇక పోరాటమే..
గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తడిచిన ధాన్యం ప్రభుత్వం కొనేవరకు ఇక్కడే ఉండి పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నాడు ఈ విషయాన్ని అధికారికంగా బాబు ప్రకటించనున్నారు. మరోవైపు.. బాబు పర్యటనతో జగన్ సర్కార్ ఆలోచనలో పడింది. బాబుకు ఎవరూ తమ సమస్యలు చెప్పకూడదని రైతులకు బెదిరిస్తోంది జగన్ ప్రభుత్వం. మరోవైపు..చంద్రబాబు వెళ్లే దారిలో ఎక్కడా ధాన్యం పోగులు ఉండకూడదని స్థానికంగా నేతలను ప్రభుత్వం ఆదేశించడం గమనార్హం. ఈ పర్యటన సందర్భంగా రైతన్నలను ఈ చేత కాని దద్దమ్మ పాలనలో రైతులకు గోడు పట్టించుకోవడం లేదని కన్నెర్రజేశారు. ఈ చెత్త సీఎం, ఒక చెత్త వ్యవస్థను తీసుకువచ్చాడని.. భరోసా కేంద్రం కాదది దగా కేంద్రమని బాబు మండిపడ్డారు.
జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితం కావడం.. చంద్రబాబు ఇలా ప్రజాక్షేత్రంలో ఉండటంతో ఏపీ ప్రజానీకం ఆలోచనలో పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇకనైనా జగన్‌లో మార్పు వస్తుందో లేకుంటే అబ్బే అదేమీ లేన్నట్లుగా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోతారో వేచి చూడాల్సిందే మరి.