Vangaveeti Radha: వంగవీటి రాధా పార్టీ మారుతున్నారా.. ముహూర్తం కూడా ఫిక్సయ్యిందా.. ఓహో మాస్టర్ ప్లాన్ ఇదా..!?
ABN , First Publish Date - 2023-02-27T19:04:42+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగానే సమయం ఉండగా అప్పుడే రాజకీయాలు (AP Politics) వేడెక్కాయి. ఇప్పట్నుంచే నేతలు జంపింగ్‌లు షురూ చేశారు. తమ రాజకీయ భవిష్యత్ గురించి నిశితంగా ఆలోచించుకుని..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగానే సమయం ఉండగా అప్పుడే రాజకీయాలు (AP Politics) వేడెక్కాయి. ఇప్పట్నుంచే నేతలు జంపింగ్‌లు షురూ చేశారు. తమ రాజకీయ భవిష్యత్ గురించి నిశితంగా ఆలోచించుకుని ఏ పార్టీలో ఉంటే సేఫ్ అనేదానిపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పేరుగాంచిన, మాస్ లీడర్ వంగవీటి రంగా (Vangaveeti Mohana Ranga) కుమారుడు వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) రాజకీయంగా కీలక స్టెప్ వేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా.. త్వరలోనే పార్టీ మారబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాదు.. ఓ కీలక నియోజకవర్గం నుంచి ఈసారి ఎలాగైనా సరే పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్‌తో పార్టీ మారబోతున్నారట. ఇంతకీ ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు..? ఎక్కడ్నుంచి పోటీ చేస్తున్నారు..? ఆ మాస్టర్ ప్లానేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
కలిసిరాని అదృష్టం..!
వంగవీటి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ఏపీ రాజకీయాల్లో వంగవీటి రంగా ఓ వెలుగు వెలిగారు. నిత్యం ప్రజలకోసం పరితపిస్తూ, ప్రజా క్షేమమే ధ్వేయంగా పనిచేశారని రంగాకు పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి. అయితే ఆయన కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధాకు పెద్దగా అదృష్టం కలిసిరావట్లేదు. యాక్టివ్ పొలిటిషియన్ కాకపోయినా తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టింది. అయితే ఆ గుర్తింపును సక్రమంగా వాడుకుని ఉంటే రాజకీయాల్లో ఆయన ఈ పాటికి తిరుగులేని స్థానంలో ఉండేవారేమో. దుందుడుకు వైఖరి, తొందరపాటు తనంతో అదృష్టాన్ని చేతులారా వదిలేసుకుంటారని ఆయన అత్యంత సన్నిహితులు చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా రాధా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..? ఎందుకు తీసుకుంటారో..? క్లారిటీ ఉండదని అభిమానులు నిరుత్సాహానికి గురవుతుంటారు. అంతటి చరీష్మా ఉన్న వంగవీటి రంగా కుమారుడిగా ఆ పేరును రాధా క్యాష్ చేసుకోలేకపోతున్నాడనే విమర్శలూ ఉన్నాయి.
ఒకే ఒక్కసారి అంతే..!
కాంగ్రెస్ పార్టీతో (Congress Party) రాజకీయ అరంగేట్రం చేసిన రాధా.. మొదటిసారి 2004లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. రాధా పొలిటికల్ కెరీర్‌లో ఇదొక్కటే విజయం.. ఆ తర్వాత రెండు సార్లు పోటీచేసినా గెలవలేకపోయారు. 2009 లో ప్రజారాజ్యం (Praja Rajyam) నుంచి విజయవాడ సెంట్రల్ (Vijayawada Central) అభ్యర్దిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014లో వైసీపీలో (YSR Congress) చేరి పోటీ చేసినా గెలవలేకపోయారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ తరఫున పోటీ చేయాలని రాధా భావించారు. కానీ ఆ సీటును రాధాకు కేటాయించడం ససేమిరా కుదరదని అప్పట్లో వైసీపీ అధిష్ఠానం తేల్చి చెప్పేసింది. దీంతో అధిష్టానంపై ఆగ్రహంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారినా టిక్కెట్ పైన టీడీపీ అధినేత నుంచి ఎలాంటి హామీ రాలేదు. దీంతో 2019 ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండి.. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి రావడంతో.. రాధా చేతులారా భవిష్యత్తు పాడు చేసుకున్నారని అభిమానులు, అనుచరులు అంతా నిరుత్సాహ పడాల్సి వచ్చింది. నాటి నుంచి నేటి వరకూ ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించలేదు.
ఇప్పుడెందుకు ఇంత హాట్ టాపిక్..!
మూడేళ్లుగా రాజకీయంగా ఎక్కడా పెద్దగా కనిపించని వంగవీటి రాధా పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మార్మోగుతోంది. రాధా మళ్లీ యాక్టివ్ అవుతున్నారని.. టీడీపీకి టాటా చెప్పి జనసేన (Janasena) తీర్థం పుచ్చుకుంటారని సోషల్ మీడియాలో ఈ వార్త కోడై కూస్తోంది. పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan) ఉన్న సాన్నిహిత్యంతో జనసేనలోకి చేరబోతున్నట్లు వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అంతేకాదు.. జనసేనలో చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మార్చి 14న జనసేన ఆవిర్బావ సభలో పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారని ఆ పార్టీ కార్యకర్తలు, వంగవీటి అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఒకవేళ మార్చి 14న పరిస్థితులు అనుకూలించకపోతే.. అదే నెల 22న ఉగాది (Ugadi) రోజు కూడా ముహూర్తం పరిశీలనలో ఉందట. మార్చి మొదటి వారంలో వంగవీటి రాధా టీడీపీకి రాజీనామా (Resignation) చేయనున్నారని.. అతి త్వరలోనే సుమారు 20వేలు మంది అభిమానులు, అనుచరులతో జనసేనలో చేరుతున్నారని సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున హడావుడి జరుగుతోంది. వంగవీటితో పాటు యలమంచిలి రవి (Yalamanchili Ravi), పలువురు నేతలు కండువా కప్పుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
జనసేనలోకే ఎందుకు..?
వాస్తవానికి 2019 నుంచి తన సామాజిక పరంగా గట్టి పట్టున్న విజయవాడ సెంట్రల్ నుంచి పోటీచేయాలన్నది వంగవీటి రాధా కోరిక. అయితే అప్పట్లో వైసీపీ టికెట్ కాదనటం, టీడీపీ కూడా టికెట్ ఇవ్వకపోవడంతో రానున్న ఎన్నికల్లో కచ్చితంగా సెంట్రల్ నుంచి పోటీచేయాలని భావిస్తున్నారట. టీడీపీలో ఉంటే 2024 ఎన్నికల్లో పోటీచేయడం కష్టమే. ఎందుకంటే సెంట్రల్ నుంచి బోండా ఉమామహేశ్వరరావును (Bonda Uma Maheswara Rao) కాదని రాధాకు టికెట్ ఇచ్చే పరిస్థితుల్లేవట. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బోండా ఉమకు 70,696 ఓట్లు రాగా.. వైసీపీ నుంచి గెలిచిన మల్లాది విష్ణుకు 70,721 ఓట్లు పోలయ్యాయి. అంటే కేవలం 25 ఓట్ల మెజార్టీతోనే వైసీపీ గెలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా సరే సెంట్రల్ పసుపు జెండా ఎగరేసి తీరాల్సిందేనని పట్టుదలతో బోండా ఉన్నారట. ఈ పరిస్థితుల్లో ఆ సీటు అడిగితే టీడీపీ అధిష్టానం అస్సలు ఇవ్వదని భావించి జనసేనలో చేరాలని వంగవీటి రాధా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టీడీపీ - జనసేన పొత్తు ఖాయమైతే పవన్‌తో కొట్లాడి మరీ జనసేన నుంచి సెంట్రల్‌లో పోటీచేయాలన్నదే రాధా మాస్టర్ ప్లానట. ఇదే నిజమైతే అందుకు బోండా ఉమ సిద్ధంగా ఉన్నారా..? లేదా..? అన్నది తెలియాల్సి ఉంది. జనసేనలో చేరిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రచార బాధ్యత రాధా తీసుకుంటారని ఓ వర్గంలో పెద్దఎత్తునే చర్చ జరుగుతోంది. ఎందుకంటే సామాజిక వర్గం పరంగా బాగా కలిసొస్తుందని జనసేన పెద్దలు భావిస్తున్నారట.
వాస్తవానికి వంగవీటి రంగా పార్టీ మారతారనే రూమర్స్ చాలా రోజులుగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు అటు పవన్ వీరాభిమానులు.. ఇటు వంగవీటికి అత్యంత సన్నిహితులే సోషల్ మీడియాలో ఈ విషయాలను వైరల్ చేస్తుండటంతో పక్కాగా పార్టీ మార్పు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. పైగా రాధా కానీ.. జనసేన కానీ ఖండించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే మార్చి 14 వరకు వేచి చూడాల్సిందే మరి.