Ambedkar Jayanti : అంబేడ్కర్ జయంతి రోజున అడ్డంగా బుక్కయిన బండి సంజయ్.. ఓ రేంజ్‌లో ట్రోలింగ్స్.. సీన్ కట్ చేస్తే..!
ABN , First Publish Date - 2023-04-14T13:02:06+05:30 IST
భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ (Bhimrao Ramji Ambedkar) కీలక పాత్ర పోషించారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే..
భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ (Bhimrao Ramji Ambedkar) కీలక పాత్ర పోషించారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా గమ్యాన్ని చేరుకోగలమనే తాత్వికతకు అంబేడ్కర్ జీవితమే నిదర్శనం. శుక్రవారం నాడు అంబేడ్కర్ జయంతి కావడంతో ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా (Social Media) పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. సమాజంలో నెలకొన్న అజ్ఞానాంధకారాలను చీల్చుకుంటూ జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని ప్రముఖులు కొనియాడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగానికి రూపమిచ్చి, అణగారిన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత అంబేడ్కర్‌దేనని ఆయన సేవలను రాజకీయ నేతలు (Political Leaders) గుర్తు చేసుకుంటున్నారు. అందరి సంగతి అటుంచితే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (TS BJP Chief Bandi Sanjay Kumar) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఈ రేంజ్‌లో ట్రోల్ అవ్వడానికి కారణమేంటి..? నెటిజన్లు ఏమనుకుంటున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం.
ఇదీ అసలు కథ..!
అంబేడ్కర్ జయంతి (Ambedkar Jayanti) రోజున ట్విట్టర్ (Twitter) వేదికగా బండి ఒక పోస్ట్ పెట్టారు. పెద్ద పోస్టర్, అంబేడ్కర్ ఫొటో పెట్టి.. ఆయన సేవలను కొనియాడుతూ రాసుకొచ్చారు. అయితే.. ఆ అక్షరాల్లో పచ్చిబూతులు ఉండటం గమనార్హం. ‘ అణగారిన జీవితాలకు ఆలంబన.. ఆత్మాభిమానపు స్వాలంబన.. భారతజాతి స్వేచ్ఛాపతాక సమత గుళమెత్తిన చైతన్య గీతిక.. జాతి జనుల భవిత కోసం దారిచూపిన జయకేతనం.. భారత రాజ్యాంగు రచనా చేతనం.. వారే మన బాబాసాహెబ్ భీంరావు రాంజీ అంబేద్కర్ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నమస్సుమాంజలులు అర్పిస్తూ ప్రజలందరికీ శుభాకాంక్షలు’ అని పోస్టర్‌లో బండి రాసుకొచ్చారు. అయితే ఇందులో ‘గళమొత్తిన’ అని ఉండాల్సింది.. ‘గుళమెత్తిన’ అని ఉంది. ‘రాజ్యాంగ’ అని ఉండాల్సిన చోట ‘రాజ్యాంగు’ అని ఉంది. అంతేకాదు.. ‘స్వాలంబన’ కాదు ‘స్వావలంబన’ అని ఉండాలి. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్స్ చేశారు. ఈ ట్రోలింగ్స్ గమనించిన బండి సంజయ్ టీమ్.. తప్పయిపోయిందే అని వెంటనే డెలీట్ చేసింది. రెండోసారి మళ్లీ కొత్తగా పోస్టర్‌ను బండి పేరిట పోస్ట్ చేసింది టీమ్. అయితే ఈసారి కూడా ‘స్వాలంబన’ అనేది మారకపోవడంతో మళ్లీ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఇవేం కామెంట్స్ బాబోయ్..!
ఒకటా రెండా చిన్నపాటి పోస్టర్‌కు అది కూడా అధ్యక్షుడి హోదాలో ఉండి ఇన్ని పచ్చిబూతులా అంటూ బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇలా అయితే ఎలా బండి.. ఎప్పుడు నేర్చుకుంటావో ఏందో..’ అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘స్వాలంబన కాదు మహాప్రభో.. ‘స్వావలంబన’ ఎవరయ్యా తమర్ని అధ్యక్షుడు చేసింది..? అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకు అయితే బండి అడ్డంగా దొరికిపోయారు. అబ్బో.. రాయలేని రీతిలో స్క్రీన్ షాట్లు తీసి మరీ బీఆర్ఎస్ కార్యకర్తలు కామెంట్స్ చేసేస్తున్నారు. అధ్యక్షుడు అంటే ఆయన రేంజ్‌కు తగ్గట్లుగానే సోషల్ మీడియా టీమ్ ఉండాలి కదా..? కనీసం ఆ మాత్రం లేకపోతే ఎలా..? అని నెటిజన్లు ఈ పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ట్రోలింగ్స్‌కు బీజేపీ (BJP) కూడా కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. ‘అంబేడ్కర్‌కు పూలమాల కూడా వేయని కేసీఆర్‌తో 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ చేపిస్తున్న ఘనత మా బండి సంజయ్‌దే.. అదీ ఆయన రేంజ్’ అంటూ బీజేపీ వీరాభిమానులు కౌంటర్లిస్తున్నారు.
మరొకరు కూడా..!
ఇలా బండి సంజయ్ ఒక్కరే కాదండోయ్.. బీజేవైఎంకు చెందిన మహిళా నేత, చందానగర్ 110వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కసిరెడ్డి సింధు రెడ్డి (Kasireddy Sindhu Reddy) కూడా తప్పులో కాలేశారు. స్వామి వివేకానందకు నమస్కరిస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ అంబేడ్కర్ జయంతి అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే.. నిమిషాల వ్యవధిలోనే తన తప్పు తెలుసుకుని మొత్తం మార్చేశారు. ఇలా అతి తెలివి ఉన్నవాళ్లు అంతా బీజేపీలోనే ఉంటారు బాబోయ్.. అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సింధు ఇలా ఒక్క ఫొటోతో బుక్కయ్యారు. సింధుపై లెక్కలేనన్ని మీమ్స్, ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.
మొత్తానికి చూస్తే.. అధ్యక్షుడి హోదాలో ఉన్న బండి ఇవాళ మాత్రం అడ్డంగా బుక్కయిపోయారు. సంజయ్ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా టీమ్‌ను మార్చకుంటే మున్ముందు ఇంకెన్నిసార్లు ఇలా బుక్కవుతారో ఏంటో అని ఆయన అభిమానులే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఫైనల్‌గా ఈ వ్యవహారంపై బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.